Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts

Wednesday, November 23, 2011

ఉలి వాడని '' శిల్పి ''

‘నాలుగు రాళ్లు’ వెనకేసుకోవడం అంటే ఆస్తి కూడబెట్టడం అనుకుంటాం మనం...‘నాలుగు రాళ్లు’ పోగేసుకోవడం అంటే అందమైన బొమ్మలను తీర్చిదిద్దడం అనుకుంటుంది ఆమె... ఉలితో చెక్కకుండానే రకరకాల రాళ్లు ఆమె చేతిలో ఒద్దికగా ఒదిగి రూపుకడతాయి.. రతనాల కన్నా రాళ్లనే మిన్నగా భావించే ఆమె పేరు సుజాత. ఉలి వాడని శిల్పిగా ఆమె పరిచయం ..


‘నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకుబెళుకు రాళ్లు తట్టెడేల?’ అంటే.. తళుకు బెళుకులు లేకపోయినా ఫర్వాలేదు రాయి అయితే చాలు అంటారు సుజాత. ఇల్లు కట్టడానికా! పొయ్యి వెయ్యడానికా..? అనే సందేహంతో ఎవరైనా చూస్తే ‘షోకేసుల్లో పెట్టడానికి’ అనే సమాధానం వస్తుంది ఆమె నుంచి. అవును, సుజాత రాళ్లతో బొమ్మలను చేస్తుంది. అదీ ఉలితో చెక్కకుండా. ఉలి లేని శిల్పిగా సుజాతకు, ఆమె చేతిలో రూపు కట్టిన బొమ్మలకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ వివరాలు కావాలంటే సికింద్రాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్న ఆమె నివాసానికి వెళ్లాలి.

అపురూపం.. ఆ బొమ్మ
ముప్పై అయిదేళ్ల సుజాత చదువుకున్నది టెన్త్ క్లాసే. 2, 5 తరగతులు చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గుండెపోటు వచ్చి ఏపనీ చేయలేని భర్త. ఒకటే అనిపించే రెండు గదుల అద్దె ఇంట్లో నివాసం. ఇదీ సుజాత సామ్రాజ్యం. అందులో ఆమెకున్న ఆస్తిపాస్తులు మాత్రం ఏడాదిగా పోగేసుకున్న వందలకొద్దీ రాళ్లు. సమయం చిక్కితే ఆ రాళ్లను ముందేసుకొని వాటికి బ్రష్‌తో రంగులేస్తూ, ఏ రాయి ఇంకో రాయికి అతికించవచ్చో చూసుకుంటూ ఉంటుంది. కోరుకున్నరూపం వచ్చాక తనకు తాను మురిసిపోతుంది.

తర్వాత కూతుళ్లను పిలిచి తన చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మను చూపించి సంబరపడిపోతుంది. ఆ రాతిబొమ్మను అపురూపంగా తీసుకెళ్లి షెల్ఫ్‌లాంటి చెక్కలపైన నిలబెడుతుంది. రాయి మీద రాయిని పేర్చి బొమ్మలుగా మలుస్తున్న ఈ కళ సుజాతను కోరి కోరి ఎలా వరించిందో తెలపమంటే కళ్లింతలు చేసుకుంటుంది.‘‘ఏడాదిక్రితం మా ఇంటి పక్కన ఇల్లు కడుతున్నారు. లారీల కొద్ది ఇసుక తెచ్చి పోశారు. ఓ రోజు చుట్టుపక్కల ఆడవాళ్లం ఆ ఇసుకలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. చేతులు ఊరుకోవు కదా! ఇసుకలో అటూ ఇటూ కదుపుతుంటే చేతికి గోధుమ వర్ణంలో ఉన్న ఓ రాయి దొరికింది.


ఆ రాయిని ఎందుకో అక్కడ వదిలేయాలనిపించలేదు. ఇంటికి తెచ్చి షెల్ఫ్‌లో పెట్టాను. రోజూ ఆ రాయిని చూస్తుండేదాన్ని. ఆ రాయితో ఏదో తెలియని అనుబంధం. ఏదో మనసును తట్టే బొమ్మ.. చూడగా చూడగా గణేషుని బొమ్మలా అనిపించింది. బయటకు వెళ్లినప్పుడు ఎమ్‌సీల్(రకరకాల వస్తువులు అతికించడానికి వాడేది), పెయింట్, బ్రష్ కొనుక్కొచ్చాను. తొండం, చెవులు, కిరీటంగా మళ్ళీ రాళ్లు వెతికి తెచ్చి అతికించాను. చూడముచ్చటనైన గణేషుని రూపం. పార్వతీదేవి నలుగుపిండితో గణేషుని తయారుచేసుకుంటే, నేను రాయితో చేశాను అన్న ఆలోచన రాగానే ఉద్వేగంతో కళ్లలో నీరు పొంగింది. ఆ బొమ్మను దేవుని మందిరంలో పెట్టాను.’’ అంటూ తన తొలికళ విఘ్నరాజుతో నిర్విఘ్నంగా వంటపట్టిందని ఆనందంగా చెబుతుంది సుజాత.



రోడ్డుపాలు...
‘ఈ బొమ్మల్ని ఇంట్లో ఉంచితే ఎవరికి తెలుస్తుంది. ఎక్కడైనా ఎగ్జిబిషన్‌గా పెట్టు’ అన్న వాళ్ల మాటలు పట్టుకొని ఉస్మానియా క్యాంపస్ ఆవరణలో టేబుల్ వేసుకొని దాని మీద రాతి బొమ్మల కొలువు పెట్టింది సుజాత. వచ్చి చూసిన వాళ్లు ‘ఔరా’ అని ఆశ్చర్యపోవడమే తప్ప వాటికి ఎక్కడ గుర్తింపు వస్తుందో చెప్పేవాళ్లే లేరని ఆవేదన వ్యక్తం చేసింది. హస్తకళల వారిని కలిసి తన బొమ్మలను చూపించింది. బొమ్మలు బాగున్నాయని అన్నవారే తప్ప, ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వలేదు. సభ్యత్వం తీసుకోవాలన్నారు.

అందుకు డబ్బులు కట్టాలన్నారు. ఎక్కడ తీసుకోవాలో, ఎవరిని అడగాలో, ఎంత డబ్బు కట్టాలో తెలియదు. తనకు తెలిసిన ఈ కళ ఇక్కడే మరుగునపడిపోతుందేమో అనేదే సుజాత బాధ. రాతిబొమ్మలకు పేరు తేలేకపోవడం తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడమే కారణమంటుంది. ‘‘అక్క దగ్గర నేర్చుకున్న బ్యుటీషియన్ పనే ఇప్పుడు నా కుటుంబానికి ఆదరవు. తెలిసినవారు కోరితే వారి ఇళ్లకే వెళ్లి బ్యుటీషియన్ పనులు చేసి వస్తాను.


ఇంట్లో నలుగురి కంచంలోకి నాలుగు మద్దలు రావాలంటే ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్లాలి కదా’’ అనే సుజాతకు ఈ బొమ్మల వల్ల ఉపయోగమేంటో తెలియదు. రేపటి తరానికి వాటి ద్వారా ఏం అందించవచ్చో తెలియదు. ఇలాంటి కళకు దేశ విదేశాలలో ఎక్కడెక్కడ, ఎలాంటి పేరుందో! తెలియదు. అందుకే మూలన పడేయడంతో విరిగిన బొమ్మలు, కావాలని అడిగిన వారికి ఇచ్చేసిన బొమ్మలు, పిల్లలు ఆడుతూ ఆడుతూ రోడ్డు మీద వదిలేసి వచ్చిన బొమ్మలు, ప్రాణం చివుక్కుమన్నా స్థలం సరిపోక వద్దనుకున్న బొమ్మలు ఎన్నో... కాని రాయి కనపడితే చాలు అది ఏ బొమ్మగా రూపుకట్టవచ్చో ఆలోచన చేస్తుంది. దానిని అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్ది బొమ్మను చేస్తుంది. ఈ ఉలి చెక్కని బొమ్మల విలువ తెలిసినవారెవరైనా వాటికో స్థానం క లిపిస్తే చాలనుకుంటుంది సుజాత.


కళలు తెలిసిన వారు అరుదు. తమకు తాముగా నేర్చుకుని కళకు ప్రాణం పోసే వారు మరీ అరుదు. స్వతహాగా అబ్బిన ఈ కళ సుజాత జీవితాన్ని సుసంపన్నం చేస్తుందని ఆశిద్దాం.


ఒకటికి ఒకటి...
‘‘బయట ఏదైనా రాయి కనిపిస్తే చాలు, దానికి సరిపోయే రాయి నా దగ్గర ఏది ఉంది? అని చెక్ చేసుకుంటాను. కొన్ని రాళ్లు పక్షుల రెక్కల్లా ఉంటే కొన్ని తలల్లా, మనుషుల చేతుల్లా.. ఏదో ఒక అవయవ రూపంలో కనిపిస్తాయి. ఒకటి దొరికనప్పుడు దానికి అనువైన మరో రాయి దొరికే దాకా ఎదురుచూడక తప్పదు’’ అంటూ రాతిబొమ్మల రూపకల్పనలో పట్టే సమయాన్ని వివరిస్తుంది ఆమె. తిమింగలం, నెమలి, చేప, కప్ప, ఎలుక, జూజూ, గుర్రం, కుక్క, జోకర్, ఏలియన్ మాస్క్, మర్రిచెట్టు, శివలింగం, రామచిలుకలు, వృద్ధుడు, రాకాసి, ... చెప్పుకుంటే పోతే వందల కొద్ది బొమ్మలు సుజాత చేతిలో రూపుకట్టి మనల్ని అబ్బురపరుస్తాయి.

- నిర్మలారెడ్డి
ఫొటోలు: అమరశ్రీనివాసరావు. వి

Thursday, May 19, 2011

అశేష కీర్తి గిరి చిత్రాలు * కొండపల్లి శేషగిరిరావు

seshagiri_pic3
కొండపల్లి బొమ్మలు ఈ తరం వారికి కొత్తేమోగానీ పాతతరం వాళ్ల ఇళ్లల్లో కొలువుతీరి ఉంటాయి ఆ కొయ్యబొమ్మలు. ప్రత్యేకించి బొమ్మల కొలువుల్లో కొండపల్లి బొమ్మలు ఉండితీరాల్సిందే. అంతలా ప్రాచుర్యం పొందిన కొండపల్లి బొమ్మలు చూడటానికి అచ్చం కొండపల్లి శేషగిరిరావు గీసిన బొమ్మల్లానే ఉంటాయి. అంతలా జీవకళ ఉట్టిపడుతుంటుంది శేషగిరిరావుగారి కళాత్మక చిత్రాలలో. ఆదరణ కరవై కొండపల్లి బొమ్మలకు గిరాకీ తగ్గిందిగానీ అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రం తగ్గవు కొండపల్లి బొమ్మలు. అంతగా గుర్తుకుతెచ్చే కొండపల్లినే ఇంటిపేరుగా చేసుకుని శేషగిరిరావు అనే ప్రసిద్ధ చిత్రకారుడు తన విశేష పేరుప్రతిష్టలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేయక యావత్‌ భారతావని మెచ్చే స్థాయికి వ్యాప్తిచెందడమంటే అంత తేలికైన విషయం కాదు. ఎనిమిది పదుల వయసులోనూ వన్నెతగ్గని కళాఖండాలను ఎంతో సృజనాత్మకంగా తీర్చిదిద్దుతుంటారు ఆయన. ఇంటిపేరు కొండపల్లి అయినా శేషగిరిరావు పుట్టింది మాత్రం తెలంగాణకే తలమానికమైన పోరుగడ్డ వరంగల్‌ జిల్లాలోని పెనుగొండలో 1924 సంవత్సరంలో జన్మించారు. పెనుగొండలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసి వరంగల్‌ ప్రాంతంలో ఉన్నత విద్యను అభ్యసించారు ఆయన.

seshagiri_pic 

లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్రా : పౌరాణిక, దృశ్య కావ్య నాయకానాయికలను, మనసుకు హత్తుకుపోయే వివిధ సుందర దృశ్యాలను మనోహరంగా చిత్రించడమేకాక కుడ్య చిత్రలేఖనంలో కూడా శేషగిరిరావుకు సాటి ఆయనే అనిపించుకొన్నారు. కొండపల్లి వేసిన బొమ్మలు పరోక్షంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్ర’ అనే అతి బృహత్తర చిత్రం అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో వేదిల మీద మనకు కనిపిస్తుంటాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వాటిని చూడటం తటస్తించివుంటుంది. కాకపోతే చాలామందికి ఆయన పేరు మాత్రం తెలియదు. టీవీ ఛానల్స్‌, వార్తాపత్రికల ద్వారా, మీడియా ద్వారా రాష్ట్రంలోని ప్రజలు ఏదో ఓ సందర్భంలో ఆ చిత్రాన్ని తిలకించి ఉంటారు.అయితే ఆ చిత్రం ‘కొండపల్లి’ శేషగిరిరావుదే అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియనే తెలియదు.

seshagiri_pic1 

సైన్స్‌ మాస్టార్‌ స్ఫూర్తి : కోటిరత్నాల వీణ తెలంగాణలో వేయిస్తంభాల గుడి, అరుదైన చారిత్రక కళాసంపదను చాటుతున్న వరంగల్‌ ప్రాంతంలో జన్మించిన కొండపల్లి శేషగిరిరావు చిన్నతనంలోనే సామాన్యశాస్త్రంలో గీయవలసిన బొమ్మల్ని తన పాఠ్యపుస్త్తకంలో ఉన్నదానికన్నా ఎంతో అందంగా చిత్రించేవారు. చిన్నతనంలోనే కొండపల్లి శేషగిరిరావులో ఉన్న సృజనాత్మకతను పరిశీలించిన ఆ పాఠశాల డ్రాయింగ్‌ మాస్టర్‌ అయిన దీనదయాళ్‌ ఆనాడే కొండపల్లి గొప్ప కళాకారుడవుతాడని గ్రహించారు. దీంతో కొండపల్లి కళాచతురతను ప్రప్రథమంగా ఆ పాఠశాల డ్రాయింగ్‌ టీచరు దీనదయాళ్‌ గుర్తించారు. పెన్సిల్‌తో ఏ రేఖలు ఎలా గీయాలో, కుంచెతో ఏ రేఖల్లో జీవం ఎలా నింపాలో దీనదయాళ్‌ సార్‌ మన కొండపల్లికి నేర్ఫారు. చుట్టూ వ్యాపించి ఉన్న కళాసంపద ఆయన కళాభిమానాన్ని తట్టిలేపింది. వేయిస్తంభాల గుడిలోని ప్రతిస్తంభం ఆయనకు రోజుకో పాఠం చెప్ఫింది. రామప్ఫ గుడి ఆయన్ని తన హృదయాంతరాలలో నింపుకుంది. ఆ గుడిలోని శిల్ప సౌందర్యం..శిల్పక్షేత్రాల శిల్ఫకళా సొగసులను సుదీర్ఘ, సునిశిత అధ్యయనంతో తన సొంతం చేసుకొన్న కొండపల్లి వాటినుంచి స్ఫూర్తిపొంది కొన్నివందల చిత్రాలతో ఆ శిల్ఫకళకు దర్ఫణం పట్టారు. శిల్ఫుల మనోగతాల్ని, వారి అభిరుచిలో తొంగిచూసిన ప్రత్యేకతల్ని, విశిష్టతల్ని తాను అవగతం చేసుకోవడమే కాక ప్రజాబాహుళ్యానికి చాటే ప్రయత్నం చేశారు.

seshagiri_pic2 

వరంగల్‌లో విద్యాభ్యాసం, చిత్రకళాభ్యాసం తర్వాత ఆయన హైదరాబాద్‌కు చేరుకొన్నారు. హైదరాబాద్‌ చిత్రకళాశాలలో డిప్లొమా పొందారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే ఆయనకి నవాజ్‌ మిహిది నవాజ్‌తో పరిచయం కలిగింది. కొండపల్లి చిత్రకళా ప్రతిభ గుర్తించిన నవాజ్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినిేకతనంలో అధునాతన చిత్రకళా రీతుల్ని అధ్యయనం చేయడంవల్ల తగిన ఫలితం ఉంటుందని సూచించి, సహకరించడంతో కొండపల్లి ‘శాంతినిేకతన్‌’లో ప్రవేశించారు. సర్వకళలకు పుట్టినిల్లయిన శాంతినిేకతన్‌లో అప్పుడు నంద్‌లాల్‌బోస్‌ చిత్రకళా విభాగంలో ఉండేవారు. ఆయన కొండపల్లి కళాప్రతిభని గుర్తించారు. పాటించాల్సిన జాగ్రత్తలేమిటో నేర్ఫారు. ఆయన నేర్ఫిన మెలకువలతో కొండపల్లి ప్రతిభ బాగా వికసించింది. అక్కడే ‘కుడ్య’ చిత్రలేఖనంలో కూడా కొండపల్లి ప్రత్యేక శిక్షణ పొందారు. 1950లో హైదరాబాద్‌లో చిత్ర కళాపోటీలు భారీఎత్తున జరిగాయి. అఖిలభారత స్థాయిలో జరిగిన ఆ పోటీల్లో కొండపల్లి చిత్రం ప్రథమ బహుమతి సొంతం చేసుకొంది. ఆ సభలో పాల్గొన్న అప్ఫటి మంత్రి, కొండపల్లి చిత్రాన్ని ప్రశంసించడమే కాక హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌‌స అండ్‌ క్రాఫ్ట్‌‌సలో అధ్యాపకుడిగా కొండపల్లి శేషగిరిరావు పేరును ప్రతిపాదించారు.

అలా ఉద్యోగం చేపట్టిన కొండపల్లి శేషగిరిరావు ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. ఆయన కళాత్మకత రాజకీయ నాయకులను విశేషంగా ఆకట్టుకోవడంతో హైదరాబాద్‌, బెంగళూరు, భావనగర్‌లలో జరిగిన ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలకు ద్వారాలు, వేదిక రూపకల్ఫన బాధ్యతలు కొండపలిే్లక అప్ఫగించారు. అవి అప్ఫటి ప్రధానమంత్రుల అభినందనలు అందుకొన్నాయి. అప్ఫటి ప్రభుత్వం చొరవతోనే ఆయన ‘‘లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్ర’’ అనే బృహత్తర చిత్రాన్ని చిత్రించారు. అది అనేక పర్యాయాలు రవీంద్రభారతి, తెలుగు లలిత కళాతోరణం వంటి వేదికల మీద జరిగిన కార్యక్రమాల్లో ప్రదర్శితమై ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఆయన ఉపాధ్యాయుడిగానే మిగిలిపోకుండా చిత్రకళా విస్తృతికి తానెంతో కృషిచేశారు. పత్రికల్లో విరివిగా వ్యాసాలు రాశారు. చిత్రకళకు సంబంధించిన దాని అనుబంధ కళలపై ఎన్నో గ్రంథాలు కూడా రాశారు. 1982లో ఉద్యోగ విరమణ అనంతరం కూడా తన దగ్గరకొచ్చే వారిని నిరాశపరచక మెలకువలన్నీ నేర్ఫారు. 1987 మే ఆరో తేదీన హైదరాబాద్‌లో ‘మాడపాటి సుకుమార్‌’ అవార్డు అందుకొన్న కొండపల్లి చిత్రకళా సాధన, బోధనల్లో ‘కొండపల్లి బొమ్మలంత’ సుస్థిర కీర్తిప్రతిష్టలను పొందారు.

మాస్కో, లండన్‌, అమెరికా దేశాలలో శేషగిరిరావు చిత్రాల ఆర్ట్‌ ఎగ్జిబిషన్లు జరిగాయి. లలిత కళా అకాడమీ ఫెలోషిప్‌ పొందిన శేషగిరిరావు తన జీవిత ధ్యేయం పౌరాణిక చిఙత్రాలను ఎంతో హృద్యంగా చిత్రీకరించడమేనంటారు. కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలానికి సంబంధించిన సుమనోహర చిత్రాలు శేషగిరిరావుకు ఎంతగానో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

-నండూరి రవిశంకర్‌

Wednesday, March 16, 2011

కూచిపూడికి వేదాంతం వెలుగులు!

కూచిపూడి నాట్యం అనగానే ఈ తరం వాళ్లకు ఖరీదైన ఆహార్యం, ఆర్భాటాలు కళ్ల ముందు పరుచుకుంటాయి. అరుదైన ఓ కళను ముందుతరాలకు నేర్పుదామనే ధోరణి కంటే ఏదో ఒక నాట్యం నేర్పితే పదిమందిలో పిల్లలకు పేరు వస్తుందన్న ఆలోచనే ఈ తరం వారిలో ఎక్కుగా కనిపిస్తున్నది. తెలుగువారి సొంతమైన కూడిపూడి నాట్య వికాసానికి సినీరంగ ప్రయోక్త వేదాంతం రాఘవయ్య చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన సేవల్ని ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం ఇది.
కూచిపూడి నేర్చుకునే ప్రతి కళాకారుడూ ఆడి, పాడగల ప్రావీణ్యం పెంచుకోవడంతో పాటు ఆడవేషం కట్టగలిగితేనే రాణిస్తారని నిరూపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి వేదాంతం రాఘవయ్య.

భారతీయ నృత్య సంప్రదాయాలలో అన్నింటికన్నా ప్రాచీనమైన యక్షగానం ఆధారంగా ఏర్పడిన కూచిపూడి విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు, ముందుతరాలకు అందించేందుకు పలువురు పెద్దలు ఎంతో కృషి చేశారు. అలాంటి వారిలో పేరెన్నిక గన్న వ్యక్తి వేదాంతం రాఘవయ్య.

నిన్నటి తరం సినీ దర్శక, నిర్మాతగా మాత్రమే ఎక్కువ మందికి తెలిసిన ఈయన అద్భుతమైన కూచిపూడి నాట్యకారుడు. ఎన్నో అద్భుతమైన తెలుగు చిత్రాలను నిర్మించిన ఈయన కూచిపూడి కళ మరింత వికసించేందుకు ఎంతో కృషి చేశారు. ఆయన బహుముఖ కళా ప్రజ్ఞలో సినీనిర్మాణం, దర్శకత్వం, నృత ్యదర్శకత్వం, స్క్రీన్‌ప్లే, కథారచన, నటన వంటివి ఎన్నో ఉండడం విశేషం. ఆయన కళానైపుణ్యాలలో కూచిపూడి అంటే వేదాంతం వారికి ఎంతో మక్కువ. ఆ కళను మరింత సుసంపన్నం చేసి ముందుతరాలకు అందిం చాలని ఆశించారాయన.

తెల్ల తెర నుంచి వెండి తెర దాకా....
సంచార బృందాలతో పల్లె పల్లెల్లో వాడవాడల్లో ప్రదర్శించే భాగవతుల మేళా నుంచి కూచిపూడిగా పరివర్తనం చెందింది. కూచిపూడి పోకడల్ని ముందుగానే గమనించిన వేదాంతం రాఘవయ్య ప్రమాణికమైన ఆధునిక నృత్యరీతుల్ని, సిలబస్‌గా రూపొందించడానికి ఎంతో శ్రమించారు. 'దేవదాసు', సువర్ణసుందరి', స్వర్ణమంజరి' వంటి చక్కని చిత్రాల్ని రూపొందించడంతో పాటు 45 సినిమాల నిర్దేశకుడిగా తన ప్రతిభాసంపత్తి పంచి పెట్టారు.

రైతుబిడ్డ (1939)లో నటించిన రాఘవయ్య నాటి మద్రాస్‌లో వందలమందిని తన శిక్షణతో తొలితరం నర్తకులుగా తీర్చిదిద్దారు. కూచిపూడి అగ్రహారంలో విరిసిన 'యక్షగానం' కుసుమాన్ని ఆధునిక చిత్రసీమలో పరిమళించేలా చేశారు. 1934లో బందరు (మచిలీపట్నం)లో ఉద్దండ సంపాదకుడు, ముట్నూరి కృష్ణారావు వ్యాఖ్యానంతో విమలేంద్రు బోస్ చూపించిన విడివిడి నృత్యాంశాల్ని వేదికపై చూసిన రాఘవయ్య మృష్టాన్న భోజనం వంటి రూపకాల ముందు ఇవి చిరుతిళ్లలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

మారుతున్న కాలమాన పరిస్థితుల్ని చప్పున ఆకళింపు చేసుకున్న ఆయన చిత్రసీమలో తన నాట్యంతో కొత్త రీతులను పరిచయం చేశారు. కోట్లాది మంది తెల్లతెరపై రెండు రంగుల్లో మాత్రమే చూసిన నాట్యం రంగురంగుల్లో యక్షగానంలో కళకళలాడేలా చేశారు. వెంపటి పెదసత్యం, చిన సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి వంటివారు నృత్యంలో సత్తా చూపిస్తున్న కాలంలో వేదాంతం రాఘవయ్య నాట్యంతో పాటు సినిమా దర్శకుడిగా మహాప్రజ్ఞ కనబరిచారు. నెత్తి మీద నీళ్ల చెంబు, పదునైన అంచుల పళ్లెంపై పాదాలతో నర్తించే 'తరంగం' రాఘవయ్య శైలి 'రీతి'తో వందల మంది నర్తకులపై ప్రభావం చూపించింది.

రాఘవయ్య యుగం
1960వ దశకంలో జాతీయ స్థాయిలో కొందరు పెద్దలు కూచిపూడి నృత్యం కేవలం జానపదం, అందులో శాస్త్రీయత ఏమీ లేదని కొట్టిపారేసి చులకనగా చూసిన సందర్భం రాఘవయ్య ప్రజ్ఞకు సవాలు అయింది. అప్పుడు బండా కనకలింగేశ్వరరావు, ప్రొఫెసర్ విస్సా అప్పారావు, నటరాజ రామకృష్ణ వంటి వారు విరుచుకుపడి ఉద్యమంగా స్పందించారు. వారి వాదనలకు మద్దతుగా రాఘవయ్య అధ్యయన పత్రాలు, ప్రసంగాలతో అంతా తల వంచి మొక్కేలా చేశారు. కూచిపూడి గురువుల తరంలో తొట్టతొలిగా ప్రభుత్వం నుంచి భరత కళాప్రపూర్ణ బిరుదు సత్కారాల్ని అందుకోవడం కూచిపూడి వ్యాప్తికి దోహదం చేసింది.

పాతికేళ్ల వయసులో ఆయన పొందిన ఖ్యాతి 52వ ఏట మరణించే నాటికి వేలవేల మంది ఆయన అభిమానులుగా మారేలా చేసింది. సమగ్ర సంగీత, సాహిత్య రూపకంగా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఆస్వాదించే 'యక్షగానం'లో రాఘవయ్య తనదైన శైలి ముద్రతో జేజేలు అందుకున్నారు. మన నాట్య గురువుల బాణీలో కళాత్మకత వికసించేలా చేశారు. ప్రాచీన గ్రంథాలయాలు ప్రత్యేకించి తంజావూరులోని సరస్వతి మహల్‌లో మన నాట్యంపై ఉన్న మహత్తర గ్రంథాల్ని నాట్యాభిమానులకు అందేలా చేయాలని తపించారు. 1964లో రవీంద్రభారతి ప్రాంగణంలో జరిగిన అఖిల భారత నాట్యోత్సవంలో అధ్యక్షుడుగా ఆయన చెప్పినవి, సూచించినవి తరువాతి తరం వారికి ఆదర్శ పాఠాలు అయ్యాయి.

మార్గదర్శి
భరతనాట్యం, కథాకళి, కథక్, ఒడిస్సీ, మణిపూరి నాట్య సంప్రదాయాల్ని మాత్రమే ప్రదర్శిస్తే చాలదన్నారు. జానపద నృత్యాలు, ఎన్నెన్నో ప్రక్రియలు ఉన్నాయంటూ వాటిని రప్పించి, చూస్తే మన కూచిపూడి వాసి పెరుగుతుందని ఆయన చెప్పారు. ప్రభాకర నాట్యమండలిని స్థాపించి, జనం మెచ్చేలా కొత్త కొత్త ప్రక్రియల్ని అందించారు. ఆ రోజుల్లో వేదాంతం రాఘవయ్య రూపొందించిన 'హంటర్ డాన్స్' కొరియోగ్రఫీకి పాఠం లాంటిది అని గురువులు చెప్పుకొనేలా చేశారు.

అనార్కలి, బాలనాగమ్మ, రహస్యం సినిమాల్లోని కోరాడ నరసింహరావు, గిరిజా కల్యాణం వంటివి అన్ని వర్గాల వారు అద్భుతం అంటూ మెచ్చుకుంటూ చూసినవే! భరతనాట్యంలో గోపీనాథ్‌ల వంటి వారు ప్రవేశపెట్టిన ఆధునీకరణ సంస్కరణల వంటివి రాఘవయ్య ద్వారా కూచిపూడిని ప్రభావితం చేశాయి. సాధన, శిక్షణ, ప్రదర్శన వంటి రంగాల్లో వేదాంతం వారి ఒరవడి పలువురు గురువులకు అడుగుజాడ అయింది.

తనయుడి తపన
ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న రాఘవయ్య కుమారుడు రామచంద్ర వరప్రసాద్ తమ పెద్దల బాణీలను దృశ్య మాధ్యమంలో అందుబాటులోకి తేవాలని పరితపిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా పద్మభూషణ్ వెంపటి చిన సత్యం నిర్వహించే కూచిపూడి ఆర్ట్ అకాడమీలో అధ్యాపక కళాకారుడిగా ఉన్న రాము పాత కొత్తల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోని కళారూపాల్లో మేటిగా చెప్పుకోదగ్గ 'యక్షగానం' దాదాపుగా కనుమరుగైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందుతరాల వారికి మన నృత్య నాటకాల వైభవం తెలియాలంటే ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో 'డాక్యుమెంటేషన్' అవసరమని సూచిస్తున్నారు. 36 దాకా లెక్కకు వచ్చే కూచిపూడి యక్షగానాలు ఇప్పుడు కొద్దిమందికి కూడా తెలియకుండా పోయాయంటున్నారు. వేదాంతం రాఘవయ్య కుమారుడిగా 45 ఏళ్ల పైబడిన నాట్యరంగ అనుభవంతో ఉదాత్తమైన కళారంగ సమాచారం, తండ్రి కృషిని దృశ్యమాధ్యమంగా నిక్షిప్తం చేయాలని తలపెట్టారు. సినిమా ప్రముఖుడిగా తన తండ్రిని తలచుకునేవారికి ఆయన నాట్యవ్యాప్తి కోసం పడ్డ ఆరాటం, తపన అందించిన మెళకువలు అన్నీ తెలియజెప్పాలని ఉందంటున్నారు. ఈ రంగంలో ఆసక్తి కలవారు ఇంకా వివరాలు, జ్ఞాపకాల కోసం చె న్నైలోని రామును 94448 53333 ఫోన్‌నంబర్‌లో సంప్రదించవచ్చు.
- జిఎల్ఎన్ మూర్తి

Sunday, January 23, 2011

టీవీల్లో చేస్తే మర్యాద .... మేం చేస్తే అమర్యాదా .. ?

ఇన్నేళ్ల తరువాత మీరెరిగిన జీవితం ఎలా వుందని ఆమెని ప్రశ్నిస్తే? తడుముకోకుండా 'ముళ్లకంప భోగం' అని సమాధానమిచ్చారు. దానిని మరింత వివరంగా చెబుతూ'ముళ్లకంపలో చిక్కుకుంటే రక్తాలు కారతాయండీ. భరించలేని బాధ పెడుతుందండీ. అలాగని చావు కూడా రాదండీ. భరించాలండీ' అంటారు. ఆరుతరాల కళావంతుల కుటుంబ వారసత్వంలో గొల్లకలాపం, భామా కలాపాలు తెలిసిన ఆఖరి కళాకారిణి అన్నాబత్తుల లక్ష్మీ మంగతాయారు. కలాప సంప్రదాయాలపై హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్జాతీయసదస్సుకు ఆమె హాజరయ్యారు. కలాపాలు నేర్చుకున్న తీరు నుంచి సమాజంలో భోగంఆటలు రద్దుచేశాక మారిన పరిస్థితుల వరకు చాలా విషయాలపై మాట్లాడారు...

మాది తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని ఉమ్మిడివరం గ్రామం. అక్కడి ఉమాసూరేశ్వరస్వామి ఆలయంలో మా వాళ్లంతా ఆలయ నర్తకీమణులు. అందులో ఆరుతరాల వారసత్వం మాది. మా అమ్మమ్మ బుల్లివేంకటరత్నం చనిపోయేవరకు ఆ దేవుని సేవలోనే వున్నారు. అప్పట్లో అలా సేవలో వుండేవారిని పెద్ద బుల్లి, చిన్న బుల్లి అని పిలిచేవారు. ఆమె దగ్గరి నుంచి మా అమ్మ అన్నాబత్తుల సత్యభామ వెంగమాంబ రాసిన గొల్లకలాపాన్ని నేర్చుకున్నారు. దీంతోపాటు భామాకలాపం అభ్యసించారు.

అప్పట్లో ఏటా ఐదురోజులు సూరేశ్వరస్వామి కల్యాణోత్సవం జరిగేది. ఐదు రోజులూ కార్యక్రమాలు వుండేవి. కుంభహారతి, పుష్పవర్ణం మా అమ్మమ్మ జరిపేది. స్వామి రథోత్సవంలో కళావంతుల కార్యక్రమాలు వుండేవి. రథానికి ముందు మందబయలు ఏర్పాటు చేసేవారు. కాగడాలతో అందరూ చుట్టూ నిల్చుంటే క్షేత్రయ్య పదాల నుంచి జావళీల వరకు అన్నిటినీ ప్రదర్శించడం ఆనవాయితీ. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం. వాటిల్లోనే గొల్లకలాపం, భామా కలాపం వుండేవి. దేవుని మాన్యంలో దాదాపు వంద కళావంతుల కుటుంబాలకు 25 ఎకరాలు ఇచ్చారు. అప్పుడు చాకలిమాన్యం, మంగలి మాన్యం కూడా వుండేవి. తరువాత కాలంలో దేవదాసి వ్యవస్థను రద్దుచేశాక భూస్వాములు, పెత్తందారులు వాటిని అమ్మించేసి తామే కొనుక్కున్నారు. కళావంతుల పరిస్థితి దారుణమైపోయింది.

సూర్యుడు మేల్కొన్న రోజులు...
కలాపాలను నేర్చుకోవడానికి కఠోర శ్రమ చేయాల్సిందే. మా అమ్మే నా గురువు. ఆమె మమ్మల్ని వేకువజామున నిద్రలేపేవారు. దానికి సమయం ఏమీ లేదు. పడుకున్న తరువాత ఏ జామున మెలకువ వస్త్తే అప్పటి నుంచి అభ్యాసం జరగాల్సిందే. శరీరానికి పూర్తిగా తైలం రాసేవారు. ఒక్కోసారి తైలం పూతకే గంట పట్టేది. ఆ తరువాత మొగ్గలు వేయించేవారు. దేహం రాటుదేలాలి మరి. గట్టిపడాలి. పురుషుని సామర్థ్యానికి సమానం కావాలి. దాదాపు మూడు గంటలకు పైగా ప్రదర్శనలివ్వాలి. ఒక్కోసారి రాత్రంతా కార్యక్రమాలు వుంటాయి. అంతేకాదు కల్యాణోత్సవాల్లో వరుసగా కలాపాలు వుంటాయి. ఇదంతా తట్టుకోవడానికి ఆ శ్రమ అవసరం.

మొదటి ఐదు సంవత్సరాలూ ఇదే దినచర్య. ఆ సమయంలో శరీరంతో సంబంధం లేకుండా కొ న్ని భాగాలు(మెడ, కళ్లు వగైరా) కదపడం కూడా నేర్పుతారు. అప్పుడే అడవిసాము నేర్పించారు. ఐదు సంవత్సరాల తరువాత గొల్లకలాపం, భామాకలాపం, జావళీలు, క్షేత్రయ్య పదాలు నేర్పించేవారు. ఏడు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఇవన్నీ వచ్చేసేవి. ఆపై వీటిని కల్యాణోత్సవాల్లో ప్రదర్శించాలి. ఇప్పుడైతే గానం ఒకరిది, నృత్యం ఇంకొరిది. కానీ అప్పుడు రెండూ నృత్యకారిణే చేయాలి.

ఊరికి నిప్పంటుకుంది...
గొల్లకలాపం ఆడటంలో మా అమ్మమ్మకు ఎంతో పేరుంది. అందులో ఆమెకు దివ్యత్వం వుందనేవారు. దానికి ఒకటి రెండు నిదర్శనాలు కూడా వున్నాయి. వండ్ర అనే గ్రామంలో దేవుని మాన్యం కింద ఎకరా భూమి మాకిచ్చారట. ఆ ఊళ్లో దేవుని పెళ్లికి, ఇతర శుభకార్యాలకు మా అమ్మమ్మ గొల్లకలాపం ఆడేది. ఒక సంవత్సరం అమ్మమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వండ్రలో గొల్లకలాపం ఆడలేదు. కొన్నిరోజులయ్యాక ఆ ఊరు అగ్నికి ఆహుతైపోయింది.

దానికి కారణం గొల్లకలాపం ప్రదర్శించకపోవడమనే నమ్మకం ఆ ప్రజల్లో కలిగింది. ఆ తరువాత సంవత్సరం అమ్మమ్మ ఆడింది. కొన్నాళ్లకు అమ్మమ్మ వెళ్లలేని పరిస్థితులొచ్చాక గొల్లకలాపం..గొల్లకలాపం అంటూ నాలుగు మాట అక్కడ చెప్పేవారట. మేజువాణి, భోగం ఆటలను అమ్మమ్మ ముందే వదిలేసింది. గొల్లకలాపం, భామాకలాపం పై ఎక్కువ ఆసక్తి చూపేది. అమ్మమ్మకు ఆఖరి రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నంచి పతకాలు అందాయి. 1978లో అమ్మమ్మ చనిపోయింది. మేము అంతటితో కలాపాలను విడిచిపెట్టేసి, తాళం, గజ్జలను పెట్టెలో పెట్టేశాము.

నృత్యనికేతన్‌తో మళ్లీ ఆరంభం...
గొల్లకలాపం పూర్తిగా వేదాంతపరమైనది. ఇందులో జ్ఞానం, విజ్ఞానం రెండూ వుంటాయి. గొల్లభామ, బ్రాహ్మణునికి మధ్య సంవాదమే గొల్లకలాపం. బ్రహ్మజ్ఞానం పొందడానికి ఏంచేయాలనేది చెప్పడంతోపాటు పిండోత్పత్తిశాస్త్రం కూడా ఈ కలాపంలో వుంటుంది. రెండు వందల సంవత్సరాల క్రితమే వెంగమాంబ దీనిని రాయడం ఒక అద్భుతం. దీనిని ఆడటానికి ఎంతో సహనం, ఓపిక కావాలి. ఆపై ఆదరించాలి. ఇవి రెండూ కొరవడి కలపాలను వదిలేశాము.

1985లో కళాకృష్ణ వచ్చి కలాపాలను ఎవరికైనా నేర్పాలని, వాటి అవసరం వుందని చెప్పారు. అలా నృత్యనికేతన్ మొదలు పెట్టాము. దాదాపు మూడు వందల మందికి ఈ కలాపాలను నేర్పించాము. కానీ ఇప్పుడు ఎంతమంది వాటిని ప్రదర్శిస్తున్నారు, వారికి పదాలపై, జావళీలపై ఎంత అవగాహన వుందని ప్రశ్నిస్తే మాత్రం నిరాశే మిగులుతుంది. ఒకసారి మా దగ్గర నేర్చుకున్నవారు నారాయణపేటలో గొల్లకలాపం ప్రదర్శించారు. అది టీవీలో చూసి మా అమ్మ బాధపడింది.

సంపూర్ణంగా నేర్చుకోమనీ, ఇంకా అభ్యాసం అవసరమనీ, అసంపూర్ణ ప్రదర్శన ఇవ్వడం కళకు అన్యాయమనీ...అంచేత గొల్లకలాపాన్ని ప్రదర్శించవద్దని ఉత్తరం కూడా రాసింది. 2008లో అనుకుంటా ఒకసారి వరంగల్‌లో ఒక సదస్సుపెట్టారు. అక్కడితో అయిపోయింది. మా కళను తమదిగా చెప్పుకుంటూ చాలామంది ఇప్పుడు లాభపడుతున్నా కనీసం కళాకారుల గుర్తింపుకార్డులు సైతం పొందని దురదృష్టం మాది. గత ఏడాది 'శతరూప' అంటూ రాజధానిలో కళలను ప్రోత్సహించే కార్యక్రమం పెట్టారు. అప్పుడూ మేము గుర్తురాలేదు.

ఆకలి భోగం వద్దన్న వాళ్లు...
వివాహాల్లోనూ, వేడుకల్లోనూ కళావంతులు భోగం ఆటలు, మేజువాణిలు ఆడేవారు. మేజువాణిలో పదిమంది వేదికపై వుంటే, ఇద్దరు ముందుకు వచ్చి నాట్యం చేసేవారు. అప్పుడే ఎంకిపాటలు, టుమ్రీలు, జావళీలు, క్షే త్రయ్య పదాలు ఆడేవారు. కొంతమంది కుర్రాళ్లు ఏదైనా సినిమా పాటలకు ఆడమనేవారు. అదంతా ఆకలి తీర్చుకోవడానికే ఆడేవారు. మగాళ్లంతా కలసి దానిని వద్దన్నారు. సమాజానికి చెడు అన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి. టీవీల్లో షోలు, డాన్సులు అంటూ అదే ఓపెన్‌గా చేస్తున్నారు.

అంతకంటే ఎక్కువగా హీరోయిన్లను అనుకరిస్తూ, ఇంకా కురచ దుస్తులు ధరించి డాన్సులు చేస్తుంటే దానికి సమాజంలో పేరున్న వారంతా న్యాయనిర్ణేతలుగా వుంటున్నారు. వేలవేల రూపాయలు ఇస్తున్నారు. ఇదేమి న్యాయం?... సమాజం ఇప్పుడు చెడిపోదా?... కళావంతుల మాన్యాలు దోచుకున్నారు. చిన్న చూపు చూశారు. అప్పటి కళావంతుల నృత్యాలకు పేర్లు మార్చి, పద్ధతులు మార్చి వేలు వేలు సంపాదించుకుంటున్నారు. సమాజం ఇప్పుడు చెడిపోదా?...

సమాజం ద్వంద్వ వైఖరులపై లక్ష్మీమంగతాయారు ఎక్కుపెట్టిన ప్రశ్నలివి. జవాబులు చెప్పడం మనందరి బాధ్యత.

బల్లెడ నారాయణ మూర్తి, ఫొటోలు: భాస్కర్

Sunday, December 26, 2010

గిన్నిస్‌లోకి మన కూచిపూడి * ఒకే వేదికపై 2,800 కళాకారుల నృత్యానికి రికార్డు పుస్తకంలో చోటు

కొనియాడిన రాష్టప్రతి, గవర్నర్

కృష్ణా జిల్లాలో సుమారు 600 ఏళ్ల క్రితం పుట్టిన కూచిపూడి నృత్యం గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. సిలికానాంధ్ర, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన 2వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనంలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ‘హిందోళ థిల్లాన’ నృత్యాన్ని 2,800 కళాకారులు ఒకే వేదికపై నర్తించిన అద్భుత దృశ్యాన్ని గిన్నిస్ రికార్డు సంస్థ అధికార ప్రతినిధి తారికవర ప్రత్యక్షంగా వీక్షించారు.


రాష్టప్రతి ప్రతిభా పాటిల్ సహా వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శనను గిన్నిస్ రికార్డులోకి చేర్చుతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ప్రకటించడంతో స్టేడియం చప్పట్లతో మార్మోగింది. ఈ రసరమ్యమైన నృత్యాన్ని కీర్తించేందుకు తనకు మాటలు రావడం లేదని తారికవర వ్యాఖ్యానించారు. అనంతరం గిన్నిస్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలకు అందజేశారు. ఈ నృత్య సమ్మేళనంలో 15 దేశాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూచిపూడి ఆది గురువు పద్మ భూషణ్ వెంపటి చినసత్యంతోపాటు పద్మభూషణ్ యామినీ కృష్ణమూర్తి, పద్మశ్రీ డాక్టర్ కె.శోభానాయుడులను రాష్టప్రతి సత్కరించారు.


దేశానికే గర్వకారణం: ప్రతిభా పాటిల్


కూచిపూడి నృత్యం గిన్నిస్ రికారులోకి ఎక్కడం దేశానికే గర్వకారణమని రాష్టప్రతి ప్రతిభా పాటిల్ పేర్కొన్నారు. నృత్య సమ్మేనళం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజ రైన సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. భక్తి, అంకితభావం, పట్టుదలతో ఈ విజయం సాధించిన కళాకారులందరికీ అభినందనలు తెలియజేశారు. ఒకే వేదికపై ఇంత భారీ సంఖ్యలో కళాకారులు పాలుపంచుకోవడం గొప్ప విషయమని, కార్యక్రమం అద్భుతంగా జరిగిందని ప్రశంసించారు. 2,800 కళాకారులు పాల్గొన్నారని గిన్నిస్ రికార్డు సంస్థ ప్రతినిధి చెప్పారని, కానీ కేంద్ర మంత్రి పురందేశ్వరి పేరు కలిపి 2,801గా మార్పు చేస్తే బాగుంటుందని చమత్కరించారు.

తెలుగులో ప్రసంగించిన గవర్నర్...


ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన గవర్నర్ నరసింహన్ తెలుగులో ప్రసంగించి ప్రేక్షకులను ఆనందపర్చారు. ‘వేదికపై ఉన్న మహానుభావులు, వేదిక ముందున్న కళాకారులకు అభివందనం’ అని ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘కృష్ణపరమాత్ముడు విశ్వరూపం ప్రదర్శించినప్పుడు, ఆ దృశ్యాన్ని కేవలం అర్జునుడు ఒక్కడే చూసి మూర్చపోయాడు. అనంతరం లేచి కృష్ణపరమాత్ముడికి సాస్టాంగ నమస్కారం చేశాడు. ఈ రోజు కూచిపూడి నృత్య ప్రదర్శన తిలకించిన నాకు ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిలికానాంధ్రకు ధన్యవాదాలు తెలిపారు. కూచిపూడి నృత్యం గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు.


కూచిపూడి, యోగా తదితర సంస్కృతులను కాపాడుకోవడం మన బాధ్యతని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘనత సాధించిన కళాకారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల చెక్‌ను నిర్వాహకులకు అందజేశారు.


ముగింపు ఉత్సవంలో రాష్టప్రతి భర్త దేవీసింగ్ షెకావత్, కేంద్ర మంత్రి పురందేశ్వరి, మంత్రులు వట్టి వసంత్‌కుమార్, శ్రీధర్‌బాబు, డి.కె.అరుణ, మేయర్ కార్తీకరెడ్డి, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్, అధ్యక్షుడు చామర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. కూచిపూడి నృత్యం అనంతరం పద్మభూషణ్ డాక్టర్ రాజా, రాధారెడ్డిల బృందం ప్రదర్శించిన ‘శుభసంప్రతికం’ నృత్యప్రదర్శనను రాష్టప్రతి తిలకించారు.

పరదేశీ... తకిట తథిమి

లంకాద్వీప కాంతి రువిని సిల్వామన పక్కింటమ్మాయిలా కనిపించే రువిని సిల్వా శ్రీలంకలోని కేండీ ప్రాంతంలో పుట్టిపెరిగింది. 'నాన్న సునీల్ సిల్వా ప్లాంటేషన్ మేనేజర్. అమ్మ విజయరత్న. నేను చిన్నప్పుడు బాగా డ్యాన్స్ చేసేదాన్ని. అలాగని నర్తకిగా కెరీర్ ఎంచుకుని స్థిరపడాలని మాత్రం అనుకోలేదు. మా అమ్మకు ఆసక్తి ఉన్నా, నాట్యం అభ్యసించడాన్ని అప్పట్లో అమ్మమ్మతో సహా అందరూ వ్యతిరేకించారట.

కానీ మా అమ్మ నన్ను ప్రోత్సహించింది. ఆమె చేయలేనిదాన్ని నేను చేస్తానని అమ్మకు నేను మాటిచ్చాను. అక్కడి విద్యావిధానంలో ఏదో ఒక కళారూపాన్ని అభ్యసించడం తప్పనిసరి. వాటికి ప్రత్యేకంగా మార్కులుంటాయి. అలా నేను మూడేళ్లపాటు భరతనాట్యాన్ని అభ్యసించాను..' అంటున్న రువిని సిల్వా శ్రీలంక జాతీయ నృత్యం కేండియన్ కూడా బాగా చేస్తుంది. యూనివర్సిటీల వెతుకుతున్నప్పుడు రవీంద్రుడి విశ్వభారతి పరిచయమయింది ఆమెకు.

మూడున్నరేళ్ల క్రితం అక్కడ చేరి మణిపురిని అభ్యసించడం మొదలుపెట్టింది. త్వరలోనే మెళకువలను ఒంటపట్టించుకున్న రువిని ప్రదర్శనలు ఇస్తూ అనేక దేశాలు తిరిగింది. ఎన్నో అవార్డులను అందుకుంది. 'దక్షిణాది సంస్కృతి చాలావరకూ నాకు పరిచయమైనదిగానే అనిపిస్తుంది. ఎటొచ్చీ మాకిన్ని పండగలూ పూజలూ ఉండవంతే. ఏప్రిల్ 14 సంవత్సరాది, మేలో బుద్ధజయంతి - అంతే మేం చే సుకునే పండగలు..' అంటూ ముగించిన రువిని సిల్వా ఒక ద్వీప దీప్తిని తన నాట్యంతో అందరి మనసుల్లోనూ నింపింది.

ఇంద్రధనస్సు వెలుగు ఇరినా కొమిస్సరొవా
ఇరినా ఒడిస్సీ నృత్యం చేస్తున్నప్పుడు ఆమె కళ్లలోని కాంతి ఆమె ధరించిన వెండి ఆభరణాల మిలమిలలతో పోటీపడుతుంటుంది. 'భారతీయ సంప్రదాయ నృత్యాల్లో ఒకటయిన ఒడిస్సీని నేను నేర్చుకుంటాననిగానీ, ప్రద ర్శనలిస్తాననిగానీ ఎప్పుడూ అనుకోలేదసలు..' అనే ఇరినా మాస్కోలో ఒక నేస్తం బలవంత ం చేస్తే ఒడిస్సీ నృత్య ప్రదర్శనను సరదాగా చూసింది. అది ఆమె మనసులో నాటుకుపోయింది. ఆ తర్వాత గురువు సుజాత మహాపాత్ర దగ్గర చేరి శ్రద్ధగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఎనిమిదేళ్ల నుంచీ అభ్యసిస్తున్న ఇరీనా ప్రస్తుతం మాస్కోలో జూనియర్ విద్యార్థులకు శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగింది. ప్రతి ఏడాదీభువనేశ్వర్‌కు వ చ్చి కొన్ని రోజులుండి తన నాట్యానికి మెరుగులు దిద్దుకునే ఆమె ఇంగ్లీష్ అధ్యాపకురాలు, అనువాదకురాలు కూడా.

చందన పరిమళం మాళవిక వెంకటసుబ్బయ్య
పేరు చూసినా, ఆమెను చూసినా అచ్చ తెలుగమ్మాయనే అనుకుంటారందరూ. కన్నడ కస్తూరి సౌరభాలను వెదజల్లే మాళవిక "నా తల్లిదండ్రులిద్దరూ రంగస్థలం మీద రాణించిన వారే. నా తోబుట్టువులకు కూడా థియేటర్ ఆర్ట్స్‌తో మంచి పరిచయం ఉంది. దానివల్ల చిన్నప్పటి నుంచీ నాకు ఈ కళతో అనుబంధం ఉంది. ఎనిమిదేళ్ల నుంచి నాకు నాట్య శిక్షణ ఆరంభమయింది...' అని చెప్పారు. అదే మొదటి అడుగుగా వేసిన మాళవిక బెంగళూరులోని లలితా శ్రీనివాసన్ శిక్షణలో మైసూరు బాణీకి చెందిన చక్కటి భరతనాట్య నర్తకిగా రూపొందింది.

భారతీయ జానపద నృత్యాల గురించి కూడా బాగా చదువుకున్న ఆమె హైదరాబాద్ వచ్చి పసుమర్తి వెంకటేశ్వరశర్మ శిష్యరికంలో కూచిపూడినీ అభ్యసించింది. 'ఇప్పటికి లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చాను. ప్రతి ప్రదర్శన తర్వాత ప్రేక్షకులు వచ్చి తమ అభిప్రాయాలను చెబుతున్నప్పుడు ఉద్వేగంగా ఉంటుంది. కళ అనేది 'వన్ వే' కాదు. నేనేం చేస్తున్నానో దాన్ని అర్థం చేసుకుని అనుభూతి చెందే వీక్షకులను కలిసినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది... వాళ్ల ప్రోత్సహం, అభినందనలే కళాకారులకు ఊపిరి పోస్తాయి..' అని చిరునవ్వుతో చెబుతారు.

తెలుగు కుటుంబంలో మెట్టిన మాళవిక ఆరేళ్లుగా కెనడాలోని ఎడ్మాంటన్‌లో ఉంటూ 'నాట్యమ్ డ్యాన్స్ అకాడమీ'ని నిర్వహిస్తున్నారు. 'కెనడా అనేక సంస్కృతుల సంగమం. అక్కడివారికి భాష తెలియకపోయినా సరే, మన సంప్రదాయ నృత్యాలను కళ్లార్పకుండా చూస్తారు. చాలా గౌరవిస్తారు. ప్రదర్శనకు ముందు దానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తే జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారు. ఎన్నారైలయితే చాలా సీరియస్‌గా నేర్చుకుంటారు..' అంటున్న మాళవిక తన నాట్యంతో విశాఖను మంత్రించారంటే నమ్మండి.

ప్రేమతత్వమే ఆమె నృత్యం - వార్దా రిహాబ్
'బంగ్లాదేశ్ ముస్లిం దేశమే కావొచ్చు. ఆంక్షల పరదాలు ఎక్కువే ఉండొచ్చు. కానీ వాటి వెనుక ప్రతిభ కలిగిన ఎందరో బాలికలున్నారు.. అవకాశం వస్తే వాళ్లు చెయ్యలేనిది లేదు. వారిని వెలుగులోకి తేవాలన్నదే నా కల' అంటున్నప్పుడు వార్దా రిహాబ్ కళ్లలోని మైమరుపును చూడాల్సిందే. ఆమె తల్లి డాక్టర్. చాలా ఏళ్లక్రితం ఉదయ్‌శంకర్ బృందం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నప్పుడు ఆమెను చూసి వారు తమ బృందంలోకి రమ్మని అడిగారట. కాని సంప్రదాయం ఆమెను అటువైపు అడుగెయ్యకుండా ఆపింది.

'నాకో కూతురు పుడితే ఆమె తప్పకుండా డ్యాన్స్ చేస్తుంది' అని అప్పుడే నిర్ణయించుకున్నారామె. అందువల్లే వార్దాను చిన్నప్పుడే డ్యాన్స్ స్కూల్లో చేర్పించారు ఆమె తల్లి. ప్రసిద్ధ బంగ్లాదేశీ నర్తకి, కొరియోగ్రాఫరయిన షర్మిలా బెనర్జీ శిష్యరికంలో మణిపురి మణిపూసగా ప్రకాశించింది వార్దా రిహాబ్. 'తాండవం, లాస్యం - రెండూ ఏక సమయంలో చెయ్యగలిగే విధానం మరే నాట్య సంప్రదాయంలోనూ లేదు. మణిపురిలో ఉన్న ఈ విశిష్టత నన్ను కట్టి పడేసింది...' అంటున్నారామె.

ఐసీసీఆర్ ఢాకాలో నియమించిన గురు కళావతి దగ్గర వార్దా పంగ్ (మృదంగం), థాన్ తా (మణిపురి మార్షల్ ఆర్ట్)లలో ప్రావీణ్యం సంపాదించింది. ఐసీసీఆర్ ఉపకారవేతనంతో రవీంద్రభారతి విశ్వవిద్యాలయంలో చేరిన ఈ కళాకారిణి అందులో బంగారు పతకాన్నీ సాధించింది. ఢాకా యూనివర్సిటీలో ఎంబీయే చేసిన వార్దాకు అక్కడ నాట్య విభాగాన్ని నెలకొల్పాలనేది ధ్యేయం. రాధాకృష్ణుల ప్రణయాన్ని ఆమె అభినయిస్తున్నప్పుడు అచ్చంగా బృందావనమే కళ్లకు కట్టింది విశాఖ ప్రేక్షకులకు.

కూచిపూడి కుందనం మంగళ
మూడేళ్ల వయసు నుంచే కూచిపూడి నేర్చుకుంటున్న మంగళ మద్దాలి పదహారణాల తెలుగమ్మాయి. తొమ్మిదేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లిపోయినా అక్కడ కూడా తన సాధనను ఆపలేదామె. కొమండూరి రేవతి, వెంపటి రవి శంకర్‌ల శిష్యరికంలో అనేక ప్రదేశాలు పర్యటించి ప్రదర్శనలిచ్చిన మంగళ 'వారిని చూస్తూ నేను చాలా నేర్చుకున్నాను. ఒక నర్తకిగా వేదిక మీద నన్ను నేను ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి, ఒక వ్యక్తిగా ఎలా మసలుకోవాలి... వంటివెన్నో విషయాలను నేను గ్రహించగలిగాను' అంటారామె వినయంగా.

'అక్కడ సంప్రదాయ కళారూపాలకు చాలా ప్రాధాన్యమిస్తారు. కానీ వాటికి పుట్టినిల్లు ఈ దేశం. సంగీతనాట్యాలకు సంబంధించి ఇక్కడ గొప్ప వారసత్వ సంపద ఉంది. దురదృష్టవశాత్తూ దాన్ని నిర్లక్షయం చేసేవారే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు..' అని బాధపడుతున్న మంగళ వయసు చాలా చిన్నది, ఆలోచన పెద్దది. పద్మభూషణ్ వెంపటి చిన సత్యంతో కలిసి అమెరికాలోని నలభై నగరాల్లో ప్రదర్శనల్లో పాల్గొన్న మంగళ నాలుగేళ్ల క్రితం ఇక్కడ కూచిపూడి మహోత్సవంలోనూ తన కళను ప్రదర్శించింది.

ఇంటర్వ్యూలు : అరుణ పప్పు, విశాఖపట్నం
ఫోటోలు : వై. రామకృష్ణ

Friday, October 1, 2010

అమెరికా కంపెనీకి చిక్కిన... అప్పడాల కథ

కథ: కప్పడాలు
రచయిత: తోలేటి జగన్మోహనరావు


గన్ ప్రేమలో పడ్డాడు. గన్ అసలు పేరు గన్ కాదు. గణేష్. ఢిల్లీలో డాండూమ్ అని చదివేసి అమెరికా బాస్‌ల కింద పని చేయడం మొదలుపెట్టాక గణేష్ కాస్తా గన్‌గా మారిపోయాడు. కుర్రాడు కత్తి. మహా చురుకు. కుదురంటే బెరుకు.
ఇంత స్పీడు మీద ఉన్న కుర్రాడు సహజంగానే ప్రేమలో పడతాడు. పడ్డాడు. ఢాం. అమ్మాయి తండ్రి అతగాణ్ణి పిలిచి- నాయనా ప్రేమ సరే, నీ ప్రయోజకత్వం నిరూపించుకో. అప్పుడే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా. నీకు ఒక సంవత్సరం గడువు అని మరోచరిత్ర లెవల్లో ప్రామిస్ చేస్తాడు.

సాధారణంగా ప్రేమించేవాళ్లు అమ్మాయితో పాటు అమ్మాయి బ్యాక్‌గ్రౌండు, ఆ అమ్మాయి యిలాకా, తాలూకా, తండ్రి ఏం పని చేస్తాడు, ఏమి ఆస్తిపాస్తులు ఉన్నాయి... ఒకసారి కాకపోయినా ఒకసారైనా చూసుకుంటాడు.
కాని, మన గన్ చూసుకోడు.

కెరీర్‌లో దూకుతాడు. బుల్లెట్‌లా దూసుకుపోతాడు. అమెరికా కంపెనీ ‘కెప్సీ’ భారత్‌లో అడుగుపెట్టి ‘అప్పడాల’ వ్యాపారం చేద్దామని నిర్ణయించుకుంటే దాని లోకల్ శాఖకు మనవాడే సుప్రీమ్ అవుతాడు. అప్పటికే అంధ్రదేశంలో ‘గణేష్’ అనే కంపెనీ అప్పడాల రంగంలో నంబర్ వన్‌గా ఉంటుంది. దానిని తన కెప్సీతో గన్ దెబ్బ కొడతాడు. తనవి అప్పడాలు కావనీ కప్పడాలని ప్రకటనలతో ఊదరగొడతాడు. చేతితో చేసే అప్పడాల వల్ల టైఫాయిడ్, కలరా, మలేరియా, ఎయిడ్స్ కూడా వస్తాయని ప్రచారం చేస్తాడు.

జనమంతా అప్పడాలు మానేసి కప్పడాలు తినడం మొదలెడతారు.
కెప్సీతో పోరాడలేక ఆఖరుకు గణేష్ కంపెనీ చేతులెత్తేసి మూతపడుతుంది.
గన్ ఇప్పుడు విజేత. ఆ విజయోత్సాహంతో మామగారి దగ్గరకు వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడబోతాడు. కాని అప్పటికే మామగారు వ్యాపారంలో చితికిపోయి ఉంటారు. కట్నకానుకలు యిచ్చే పరిస్థితిలో లేనని కాబోయే అల్లుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటారు.
గన్ ఇవి పట్టించుకోడు. తనకు కావల్సింది కట్నం కాదని కన్య అని చెబుతాడు.
మామగారు సంతోషపడతారు. అందరూ భోజనాలకు కూర్చుంటారు. పనిమనిషి పెరుమాళ్లు యధావిధిగా సాంబారుతో పాటు అప్పడాలు తెస్తాడు. గన్ ఉలిక్కిపడతాడు. ఏమిటి యింకా మీరు అప్పడాలే తింటున్నారా, మా కంపెనీ వారి కప్పడాలు తినడం లేదా అంటాడు.

మామగారి భృకుటి ముడిపడుతుంది. ఇంతకూ నువ్వు చేసే పని ఏమిటి అంటారు. కప్పడాల మార్కెటింగ్ అని చెబుతాడు గన్.
అంతే. మామగారు లేచి గన్ మీద గన్ ఎక్కుపెడతారు. పెరుమాళ్లు సాంబారు బకెట్‌ను గన్ మీద కుమ్మరించడానికి సిద్ధమవుతాడు. పనివాళ్లు అతని వైపు దూసుకువస్తారు. గన్ జరిగిందేమిటో అర్థంగాక కన్నుతప్పి చావు లొట్టబోయి బయటపడతాడు.

ఇంతకు సంగతి ఏమిటి? కప్పడాల దెబ్బకు మూతబడ్డ అప్పడాల కంపెనీ ‘గణేష్’ ఈ మామగారిదే.
రచయిత తోలేటి జగన్మోహనరావు 2001లో ఈ కథ రాశారు. మల్టీనేషనల్ కంపెనీలు ఆఖరుకు ఉప్పూ పప్పుల్లో కూడా అడుగుపెట్టి భారతీయ సంప్రదాయ మార్కెట్‌ను ఎలా ధ్వంసం చేయబోతున్నాయో ఈ కథలో వ్యంగ్యంగా, హాస్యంగా ఎత్తి చూపించారు. ఆయన ఊహించినట్టుగానే అలాంటి కంపెనీలు భారత్‌లో అడుగుపెట్టాయి. చినచేపను పెదచేప మింగినట్టుగా చిన్న చిన్న చిల్లరకొట్లను పెద్దపెద్ద మాల్స్ మింగుతున్నాయి.

ఈ కథ చదువుతున్నంత సేపూ నవ్వు వస్తుంది. కాని, ఆఖరున కళ్లు తుడుచుకుంటే కన్నీళ్లు చేతికి తగులుతాయి.
ఈ కథ ఒక హెచ్చరిక. వర్తమాన విషాదం. ఏడవలేక నవ్వడం.

తోలేటి జగన్మోహనరావు : ప్రసిద్ధ తెలుగు కథకుడు. ‘తోలేటి జగన్మోహనరావు కథలు’ పేరుతో సంపుటి వెలువరించారు. ఢిల్లీలో కేంద్ర సర్వీసులలో పని చేసి, రిటైరై, ప్రస్తుతం ఢిల్లీలోనే విశ్రాంత జీవనం గడుపుతున్నారు.

శమంతకమణి ఎవరో కాదు ...మన సూరమ్మే!

‘రాయడానికి కలానికి చిక్కని గొప్పతనమే గొప్పతనం’ అనే చలం మాటలు ఆయన కథలకూ వర్తిస్తాయి.
మన తృప్తి కోసం మళ్లీ మళ్లీ చెప్పుకోవడమేగానీ ఆ మహా రచయిత కథల గొప్పతనం ఏ కలానికి చిక్కుతుంది?! ‘శమంతకమణితో ఇంటర్‌వ్యూ’ కథ ఏ సంవత్సరంలో చలం రాశారో తెలియదుగానీ ఏ సంవత్సరం చదివినా ఆ సంత్సరం రాసిన కథగా తాజాగా చదివిస్తుంది. వర్తమానానికి పట్టిన నిలువెత్తు అద్దంలానే ఉంటుంది. చలం కాలాతీత కథల్లో ఇదొకటి.
శమంతకమణి ఎవరు? కథానాయకి.

తెనాలికి చెందిన సూరమ్మ సినిమాఫీల్డ్‌కు వెళ్లి శమంతకమణిగా మారుతుంది. లెక్కకు అందని డబ్బు,పేరు ప్రఖ్యాతులు గడిస్తుంది. కీర్తిని, డబ్బును వెతుక్కుంటూ వెళ్లినవారు వెనక్కి తిరిగి రావడమనేది ఉంచదు. ఇది లోకరీతి. బలంగా స్థిరపడిన ఇట్లాంటి లోకరీతిని కాలదన్ని రంగుల లోకాన్ని, కీర్తిని, డబ్బును వదిలేసి ఒకానొకరోజు సొంతూరు తెనాలికి వచ్చి స్థిరపడుతుంది శమంతకమణి.

లోకం మూకుమ్మడిగా ముక్కు మీద వేలేసుకుంటుంది.
శమంతకమణి మనసు మారడానికి కారణం ఏమిటి?
ప్రేమ విరహం అంటారు కొంతమంది. వైరాగ్యమంటారు మరి కొందరు. సుబ్బారావు స్నేహితుడైన రచయిత మాటల్లో కథ నడుస్తుంది. శమంతకమణి తెనాలికి వచ్చి స్థిరపడడానికి గల కారణాలను రకరకాలుగా ఊహించుకోవడం కంటే ఆమెనే అడిగితే సరిపోతుంది కదా అని ఇద్దరూ శమంతకమణి ఇంటికి బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక-‘‘శమంతకమణి ఉందా?’’ అని ఇంటిదగ్గర కనిపించిన అబ్బాయిని అడుగుతాడు సుబ్బారావు.

‘‘ఎవరు ఆమె?’’ అని తెల్లబోతాడు ఆ కుర్రాడు.
‘‘సూరమ్మ ఉందా?’’ అని అడుగుతాడు సుబ్బారావు మళ్లీ.
‘‘ఉంది’’ అని చెబుతాడు అతను. ఈ దృశ్యంతో అర్థమయ్యే విషయం ఏమిటంటే శమంతకమణి ఇకముందు ఆ పేరుతో బతకదల్చుకోలేదని మళ్లీ సూరమ్మగానే బతకదల్చుకుందని. సూరమ్మ ఇక సినిమాల్లో నటించదు. జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇవ్వదు. స్థలాలు కొనదు. తననెవరూ ఫోటోలు తీసుకోనివ్వదు.

సుబ్బారావు స్నేహితుడు అంటే మనకు కథ చెప్పే రచయిత... సూరమ్మ చిన్నతనంలో ఉండగా ఎత్తుకొని ఆడించాడు. చాలా చాలా కాలం తరువాత సూరమ్మను చూసినప్పుడు ఎత్తుకొని ఆడించిన సూరమ్మ గుర్తుకు రాదు. ఆమె ముఖంలో అందం కంటే స్థిమితమూ, విజ్ఞానం ఎక్కువ కనిపిస్తాయి. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ అప్పుడు ‘వేదాంతసార సంగ్రహం’ చదువుతూ కనపిస్తుంది. ఎక్కడి గ్లామర్ ఫీల్డ్? ఎక్కడి వేదాంతం!!

‘‘మీరిప్పుడు వేదాంత పుస్తకాలు రాస్తున్నారట కదా’’ అని ఆ మాజీ తార అడిగితే - ‘‘నువ్విప్పుడు వేదాంతం చదువుతున్నట్లే’’ అని చెబుతాడు సుబ్బారావు స్నేహితుడు. కొద్దిసేపటి తరువాత వచ్చిన విషయంలోకి దిగుతాడు.
‘‘నువ్వు అంత అకస్మాత్తుగా సినిమాల్ని వదిలి వచ్చేశావు. వేదాంతమా?’’ అని అడుగుతాడు.
‘‘వేదాంతం కాదుగానీ, చాలా వరకు విరక్తి’’ అంటుంది సూరమ్మ. ఆ విరక్తి రహస్యమేమిటో మాత్రం అప్పుడు చెప్పదు. మెల్లిగా కదిలే సంభాషణల్లో ఒక చోట చెబుతుంది ఇలా:

‘‘సంసారం, బంధువులు, స్నేహితులూ అందరూ డబ్బు కోసం ఆశ్రయించేవారే. మొగవాళ్లకి ఫరవాలేదనుకుంటాను. స్ర్తీకి మాత్రం తక్కిన స్ర్తీలూ విరోధులే. అందం ఉన్న తారకి ఆ అందం వల్లనే విరోధులు, మిత్రులూ. అందం లేని నా బోటి దానికి అదీ లేదు’’.

శమంతకమణి ఎలియాస్ సూరమ్మ అశాంతి, ఒంటరితనం, ఆత్మ నలిగిన చప్పుడు కేవలం చలం కథ మాత్రమేనా? హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్... గుర్తుకు తెచ్చుకుందాం ఒక్కసారి....శమంతకమణిగా మారిన సూరమ్మలు, సూరమ్మగా మారిన శమంతకమణులు!!

Thursday, September 30, 2010

చిరు కవితలు

మా ఊరికి విమానమొచ్చింది
నిన్నే కూలిపడింది మరి!

మా చెరువుకు స్నేహాలెక్కువ
ఊళ్లోని మురుగు దారులన్నీ దానివైపే!

మా సర్పంచ్ చాలా పొదుపరి
ప్రభుత్వ డబ్బు అసలు ఖర్చేపెట్టడు!

వాడు మంచి ఆర్టిస్టు
భార్యను ఇట్టే నమ్మించేస్తాడు.

గోదావరి ఒంటరయ్యింది
పుష్కరాలు అయిపోయాయిగా.

కుండ గుండె పగిలింది
ఫ్రిజ్‌ను చూసి.

నేనూ గొప్ప పాటగాడ్నే
వినేవారుంటే!

మా తాతా చిన్నపిల్లాడే
పళ్లు లేవుగా!

ముందు దాని కడుపులో
పడితేగాని మనకు టీ దొరకదు
టీకప్పు!

చేతిదెంత ఉదారగుణం
తాను తినకుండా
నోటికందిస్తోంది ఆహారం.

గాలి - నీటి వైరం
తుపాను!

ఆకాశవాణి కన్నా
టేప్ రికార్డరే బెస్టు
మాట వింటుంది!

దుఃఖానికి ఫ్రమ్ అడ్రస్
దురాశ!

చెట్టుకాండం కట్టుకుంది
బెరడనే పట్టు చీరని!

- వి.ప్రభాకర్