Monday, October 13, 2008

కొబ్బరి కోరాన్ని కనిపెట్టింది ఆడా? మగా? * ఈ కోరంను తొలిసారి తయారుచేసినవాడు ఐన్‌స్టీన్ కన్నా గొప్పవాడు.

కొబ్బరి కోరం -  కీర్తి స్తోత్రం

సత్యభామకు, రుక్మిణికి ప్రతి విషయంలోను పోటీనే. చీరలు, నగలు, అలంకరణలు- చివరకు వంటలో కూడా పోటీనే. కృష్ణుడు వస్తున్నాడంటే- సత్యభామ వంటశాల ఘుమఘుమలాడిపోయేది. మృష్ణాన్న భోజనానికి ఏర్పాట్లు జరిగేవి. విచిత్రానాలు, దేశవిదేశీ వంటకాలు చేయించేది. వడ్డించేది. కృష్ణుడు ఆనందంగా తినేవాడు. రుక్మిణి ఇంటిలో వంటే వేరుగా ఉండేది. ఎక్కువ రకాల వంటలు ఉండేవి కాదు. కాని కృష్ణుడు వచ్చినప్పుడల్లా రుక్మిణి కొబ్బరిని తురిమి, దానిలో ఇంగువ వేసిన తాళింపు పెట్టేది. ద్వారకంతా ఆ తాళింపుతో ఘుమఘుమలాడిపోయేది. కృష్ణుడు చాలా తృప్తిగా కొబ్బరి పచ్చడి తినేవాడట.

పై కథంతా పక్కనపెట్టండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పండి. రుక్మిణి ఇంట్లో కొబ్బరిని ఎలా కోరేవారు? నాకయితే- ఇప్పుడు మనం వాడే కోరంతోనే కొబ్బరిని తురిమేవారనిపిస్తుంది. రుబ్బురోలుకు బదులు మిక్సీ, కత్తిపీటకు బదులు చాకు ఇలా వంటింట్లో ఉండే ప్రతి వస్తువుకు ప్రత్యామ్నాయం ఉంది. కాని నాకు తెలిసి కొబ్బరి కోరానికి సరైన ఆధునిక ప్రత్యామ్నాయమే లేదు.

నా దృష్టిలో- ఈ కోరంను తొలిసారి తయారుచేసినవాడు ఐన్‌స్టీన్ కన్నా గొప్పవాడు. ఈ కాలంలో పుట్టి పేటెంట్‌లు సంపాదించుకొని ఉంటే- బిల్‌గేట్స్ కన్నా ఎక్కువ సంపాదించేవాడు. మన వంటింట్లో- ఒక మూల- అమాయకంగా ఏమీ తెలియనట్లు పడిఉంటే కోరంకు ఇంత సీను ఉందా? అని మీలో కొందరు ఆశ్చర్యపోవచ్చు. నాకు తెలిసి కనీసం వందేళ్ల నుంచి ఈ కొబ్బరి కోరం హవా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత వచ్చిన కట్టర్లు, గట్టుమీద పెట్టి కొబ్బరిని తురిమే సాధనాలు ఎంత వేగంగా వచ్చాయో..అంతే వేగంగా పోయాయి. ఇది మాత్రం ఇప్పటికీ వంటింట్లోతన రాజ్యాన్ని కొనసాగిస్తూనే ఉంది.

ముందర ద్వారక అన్నావు.. ఇప్పుడు వందేళ్ల నుంచి అంటున్నావు- లెక్కలు రావా అని మీలో కొందరు నన్ను అడగొచ్చు. ద్వారక గురించి కచ్చితంగా చెప్పలేను కాని వందేళ్ల క్రితం కొబ్బరి కోరం మాత్రం ఉందని ఢంకా భజాయించగలను. మా నాయనమ్మకు వంటింటి వారసత్వంగా ఆవిడ పుట్టింటివారు ఒక కొబ్బరి కోరాన్ని ఇచ్చారు. అది ఆవిడ చిన్నప్పటిదిట.

మా నాయనమ్మ 1910లో పుట్టింది. అంటే మా ఇంట్లో కొబ్బరి కోరానికి వందేళ్ల చరిత్ర ఉంది. అప్పటి నుంచి అప్రతిహతంగా పనిచేస్తూనే ఉంది. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. అన్ని ఆహార పదార్థాలలోకి కొబ్బరిని హ్యాండిల్ చేయటం చాలా కష్టం. కథంతా కొబ్బరికాయను కొట్టడంతోనే మొదలవుతుంది. మనిష్టం వచ్చినట్లు కొబ్బరికాయను కొడితే కుదరదు. కాయను సరిసమానంగా రెండు ముక్కలయ్యేలాగ కొట్టడం ఒక కళ. ఇలా పగిలితే అదృష్టం అని కూడా నమ్ముతారు.

తమ ఆడ పిల్లలకు కొబ్బరికాయను ఎలా కొట్టాలో నేర్పే అమ్మలు గతంలో అనేక మంది ఉండేవారు. ఇక కొట్టిన తర్వాత వచ్చే సమస్యలు అనేకం. కొబ్బరి చెక్క అర్థచంద్రాకారంలో ఉంటుంది. దీని నుంచి ముక్క తీయటం కష్టం. ఆ ముక్క కూడా లావుగా గట్టిగా ఉంటుంది. మొదటిరోజు ముక్క పచ్చిగా ఉంటుంది. చాకుతో తీసినా ఒక పట్టాన రాదు. అటువంటప్పుడు మనం కొబ్బరి కోరాన్ని శరణు వేడాల్సిందే. ఒకవేళ ఇంత శ్రమ ఎందుకు అనుకొని, బలవంతంగా కొబ్బరి ముక్కలను బయటకు తీసి మిక్సీలో వేశామా.

. ఆ తురుము చాలా సన్నగా, పొడిపొడిగా అయిపోతుంది. అంటే తురుము సరైన సైజులో ఉండాలన్నా కొబ్బరి కోరం అవసరమే. ఇదంతా చదివిన తరువాత మాకు అంత అవసరం ఏముంది? సూపర్‌మార్కెట్‌లో నుంచి కొనుక్కొస్తామంటున్నారా- అక్కడ మీకు దొరికేది నూనె తీసేసి, ఎటువంటి తేమ లేకుండా చేసిన కొబ్బరి తురుము. అసలు కొబ్బరికి, నూనె లేని కొబ్బరికి మధ్య రుచిలో చాలా తేడా ఉంటుంది. అందుకని అసలు సిసలైన రుచులు కావాలనుకొనే వారు కొబ్బరి కోరానికి ఓటు వేయాల్సిందే.

కేవలం రుచి విషయంలోనే కాదు- మన జీవన శైలిలో వచ్చిన మార్పులను కూడా కోరం స్పష్టంగా చూపిస్తుంది. ఒకప్పుడు నేల మీద పీటలు వేసుకొని కూర్చుని భోజనాలు చేసేవారు. వంట వండేటప్పుడు కూడా నేల మీదే కూర్చునేవారు. ఇప్పటిలా గ్యాస్‌గట్టులు, భోజన బల్లలు లేవు మరి. కొబ్బరి కోరాలంటే కూడా నేల మీద కూర్చోవాల్సిందే. ఈ కోరాన్ని విరివిగా వాడే రోజుల్లో ఆడవాళ్లు ఎంత ఆరోగ్యంగా ఉండేవారో.. ఒక్కసారి ఆలోచించండి.

అప్పుడు, ఇప్పుడు- పండగ రోజులు వచ్చాయంటే చాలు ఇంట్లో కొబ్బరి చెక్కలు దొర్లుతూనే ఉంటాయి. మనం దేవుడికి కొట్టినవి కావచ్చు. నోములు, వ్రతాలు, పేరంటాలలో వచ్చినవి కావచ్చు. ఇరుగు పొరుగు వారు ఎక్కువయిపోయాయని పంచినవి కావచ్చు. వీటితో కొబ్బరి లౌజో, కజ్జికాయలో చేసుకోవాలంటే కోరం వాడక తప్పదు. ఇంత పని చేసే కొబ్బరి కోరానికి ఎంత పటిష్ఠమైన డిజైన్ అంటే- వందేళ్లయినా దానిలో మార్పు లేదు. ఎన్ని కొత్త రకాలు వచ్చినా పాత డిజైన్‌ను మాత్రం కొట్టలేకపోయాయి.

చివరగా ఒక మాట. ఈ కోరాన్ని అలవాటు లేకుండా ఎవరు పడితే వారు వాడలేరు. దానికి కూడా కొంత నైపుణ్యం కావాలి. లేకపోతే చేయి చెక్కుకుపోతుంది. ఒకసారి ఇదంతా చెబితే- ఒక మిత్రుడు- కొబ్బరి కోరాన్ని కనిపెట్టింది ఆడా? మగా? అని సూటిగా అడిగాడు. అప్పుడైతే సమాధానం చెప్పలేదు కానీ ఇప్పుడు చెబుతున్నా. కొబ్బరికోరం డిజైన్ చేసింది ఆడవాళ్లే అయిఉంటారు. దీనికి కారణం చాలా సింపుల్. మగవాళ్లలాగే కొబ్బరి కూడా చాలా సంక్లిష్టమైన సబ్జెక్ట్. అన్నిటికీ పనికొస్తుంది. దేనికీ పనికిరాదన్నట్లుంటుంది. అంత క్లిష్టమైన దాన్ని కోరుగా మార్చగలిగిన శక్తి ఆడవాళ్లకే ఉంది! మీరేమంటారు? 
- ఒక గోవిందు