Thursday, March 17, 2011

చిత్తరాల పూలతోట

madhu-d1ఏడు పదుల వయసుకు దగ్గరౌతున్నా...ఆయన కుంచెకు వన్నె తగ్గదు...ఆయన చిత్రాలకు ఖ్యాతి తగ్గదు...పల్లె పడచుల పైట అందం...పైరగాలుల తన్మయత్వం...ఆత్మీయానుబంధాల మేళవం...అన్నీ కలగలిపితే తోట వైకుంఠం అవుతుంది. తెలంగాణ ప్రాంతానిేక తలమానికంగా భాసిల్లుతున్న తోటవైకుంఠం భావోద్వేగాలను పలికింపజేసే చిత్రాలకు చిరునామాగా చెబుతారు. ప్రఖ్యాత సామాజిక స్పృహ కలిగిన మేటిదర్శకుడు బి.నరసింగరావు తన చిత్రాలకు సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌ అంతా తోట వైకుంఠానిక అప్పగించేవారు. 1942లో కరీంనగర్‌లో పుట్టిన తోట వైకుంఠం చిత్రకళాకారుడిగా అనన్యసామాన్యమైన పేరును సంపాదించుకున్నారు.

కిరాణాకొట్టు నడిపిస్తూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్న సామాన్యమైన వ్యక్తి ఆయన తండ్రి. కరీంనగర్‌ జిల్లాకు చెందిన బూరుగుపల్లి ప్రాంతంలో పుట్టిన తోట వైకుంఠం చిన్నప్పటినుంచి కూడా సాదాసీదా జీవనాన్ని కొనసాగిస్తుండేవారు. చిన్నతనంనుంచి కూడా తోట వైకుంఠానికి తాను పుట్టిన ప్రాంతమన్నా...పల్లెవాతావరణమన్నా ఎంతో మక్కువ. అందుకే ఆయన గీసిన చిత్రాలలో ఆయనకున్న అభిరుచిని తెలియజేస్తాయి ఆ చిత్రాలు.

madhu-dతన అభిరుచికి తగినట్లుగానే విద్యను కూడా అదే మార్గంలో కొనసాగించారు వైకుంఠం. అందుకు తండ్రి కూడా ఎటువంటి అభ్యంతరమూ పెట్టలేదు. ఎటువంటి షరతులు కూడా విధించలేదు. కొడుకు ఇష్టప్రకారమే చదివించారు. తోట వైకుంఠం తన అభిరుచికి తగినట్లుగా ఫైన్‌ ఆర్ట్‌‌స, ఆర్కిటెక్చర్‌ కోర్సులను హైదరాబాద్‌లో పూర్తిచేశారు. ఫైన్‌ ఆర్ట్‌‌స విద్యార్థులకు బోధకునిగా కొన్ని విద్యాసంస్థలలో పనిచేశారు.

తెలంగాణ సంస్కృతి మనకు ఆయన చిత్రాలలో అణువణువూ స్మృజిస్తుంది. దాసి చిత్రానికిగాను వైకుంఠం కళాదర్శకునిగా పనిచేశారు. ఆ చిత్రానికి కేంద్రస్థాయిలో ఉత్తమ కళాదర్శకునిగా తోట వైకుంఠం అవార్డును అందుకోవడం విశేషం. ‘రంగుల కల’ చిత్రం ఓ చిత్రకారుని గురించిన అంశం. ఆ చిత్రాన్ని దర్శకుడు బి.నరసింగరావు ఎంతో హృద్యంగా తెరకెక్కించిన తీరు నభూతో నభవిష్యతి. ఇక ఆ చిత్రకారుడు గీసే బొమ్మలన్నీ సినిమా తెర వెనక గీసిన వ్యక్తి తోట వైకుంఠం. ఆ సినిమా కూడా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అందుకే నరసింగరావు తన ప్రతిచిత్రంలోనూ ఏదోఒకరకంగా తోట వైకుంఠం పాల్గొనేలా చేస్తారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. వైకుంఠానికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చెట్టూ పుట్టా తిరిగి కాయకష్టం చేసి అలసి, సొలసిన శ్రమజీవులు మానసిక విశ్రాంతిని, పొందడానికి కళలను నమ్ముకొని తెలంగాణలో వేలాది మంది కళాకారులు బ్రతుకు బండిని కొనసాగించేవారు. ఇలాంటి ప్రాశస్త్యం కల్గిన విశిష్ఠ కళలతో పరవశించే తెలంగాణ పల్లెల ప్రకృతి అందాలను తోట వైకుంఠం తన కుంచెతో మన మనసుల్లో నిలిచిపోతారు.

నండూరి రవిశంకర్‌

Wednesday, March 16, 2011

కూచిపూడికి వేదాంతం వెలుగులు!

కూచిపూడి నాట్యం అనగానే ఈ తరం వాళ్లకు ఖరీదైన ఆహార్యం, ఆర్భాటాలు కళ్ల ముందు పరుచుకుంటాయి. అరుదైన ఓ కళను ముందుతరాలకు నేర్పుదామనే ధోరణి కంటే ఏదో ఒక నాట్యం నేర్పితే పదిమందిలో పిల్లలకు పేరు వస్తుందన్న ఆలోచనే ఈ తరం వారిలో ఎక్కుగా కనిపిస్తున్నది. తెలుగువారి సొంతమైన కూడిపూడి నాట్య వికాసానికి సినీరంగ ప్రయోక్త వేదాంతం రాఘవయ్య చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన సేవల్ని ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం ఇది.
కూచిపూడి నేర్చుకునే ప్రతి కళాకారుడూ ఆడి, పాడగల ప్రావీణ్యం పెంచుకోవడంతో పాటు ఆడవేషం కట్టగలిగితేనే రాణిస్తారని నిరూపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి వేదాంతం రాఘవయ్య.

భారతీయ నృత్య సంప్రదాయాలలో అన్నింటికన్నా ప్రాచీనమైన యక్షగానం ఆధారంగా ఏర్పడిన కూచిపూడి విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు, ముందుతరాలకు అందించేందుకు పలువురు పెద్దలు ఎంతో కృషి చేశారు. అలాంటి వారిలో పేరెన్నిక గన్న వ్యక్తి వేదాంతం రాఘవయ్య.

నిన్నటి తరం సినీ దర్శక, నిర్మాతగా మాత్రమే ఎక్కువ మందికి తెలిసిన ఈయన అద్భుతమైన కూచిపూడి నాట్యకారుడు. ఎన్నో అద్భుతమైన తెలుగు చిత్రాలను నిర్మించిన ఈయన కూచిపూడి కళ మరింత వికసించేందుకు ఎంతో కృషి చేశారు. ఆయన బహుముఖ కళా ప్రజ్ఞలో సినీనిర్మాణం, దర్శకత్వం, నృత ్యదర్శకత్వం, స్క్రీన్‌ప్లే, కథారచన, నటన వంటివి ఎన్నో ఉండడం విశేషం. ఆయన కళానైపుణ్యాలలో కూచిపూడి అంటే వేదాంతం వారికి ఎంతో మక్కువ. ఆ కళను మరింత సుసంపన్నం చేసి ముందుతరాలకు అందిం చాలని ఆశించారాయన.

తెల్ల తెర నుంచి వెండి తెర దాకా....
సంచార బృందాలతో పల్లె పల్లెల్లో వాడవాడల్లో ప్రదర్శించే భాగవతుల మేళా నుంచి కూచిపూడిగా పరివర్తనం చెందింది. కూచిపూడి పోకడల్ని ముందుగానే గమనించిన వేదాంతం రాఘవయ్య ప్రమాణికమైన ఆధునిక నృత్యరీతుల్ని, సిలబస్‌గా రూపొందించడానికి ఎంతో శ్రమించారు. 'దేవదాసు', సువర్ణసుందరి', స్వర్ణమంజరి' వంటి చక్కని చిత్రాల్ని రూపొందించడంతో పాటు 45 సినిమాల నిర్దేశకుడిగా తన ప్రతిభాసంపత్తి పంచి పెట్టారు.

రైతుబిడ్డ (1939)లో నటించిన రాఘవయ్య నాటి మద్రాస్‌లో వందలమందిని తన శిక్షణతో తొలితరం నర్తకులుగా తీర్చిదిద్దారు. కూచిపూడి అగ్రహారంలో విరిసిన 'యక్షగానం' కుసుమాన్ని ఆధునిక చిత్రసీమలో పరిమళించేలా చేశారు. 1934లో బందరు (మచిలీపట్నం)లో ఉద్దండ సంపాదకుడు, ముట్నూరి కృష్ణారావు వ్యాఖ్యానంతో విమలేంద్రు బోస్ చూపించిన విడివిడి నృత్యాంశాల్ని వేదికపై చూసిన రాఘవయ్య మృష్టాన్న భోజనం వంటి రూపకాల ముందు ఇవి చిరుతిళ్లలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

మారుతున్న కాలమాన పరిస్థితుల్ని చప్పున ఆకళింపు చేసుకున్న ఆయన చిత్రసీమలో తన నాట్యంతో కొత్త రీతులను పరిచయం చేశారు. కోట్లాది మంది తెల్లతెరపై రెండు రంగుల్లో మాత్రమే చూసిన నాట్యం రంగురంగుల్లో యక్షగానంలో కళకళలాడేలా చేశారు. వెంపటి పెదసత్యం, చిన సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి వంటివారు నృత్యంలో సత్తా చూపిస్తున్న కాలంలో వేదాంతం రాఘవయ్య నాట్యంతో పాటు సినిమా దర్శకుడిగా మహాప్రజ్ఞ కనబరిచారు. నెత్తి మీద నీళ్ల చెంబు, పదునైన అంచుల పళ్లెంపై పాదాలతో నర్తించే 'తరంగం' రాఘవయ్య శైలి 'రీతి'తో వందల మంది నర్తకులపై ప్రభావం చూపించింది.

రాఘవయ్య యుగం
1960వ దశకంలో జాతీయ స్థాయిలో కొందరు పెద్దలు కూచిపూడి నృత్యం కేవలం జానపదం, అందులో శాస్త్రీయత ఏమీ లేదని కొట్టిపారేసి చులకనగా చూసిన సందర్భం రాఘవయ్య ప్రజ్ఞకు సవాలు అయింది. అప్పుడు బండా కనకలింగేశ్వరరావు, ప్రొఫెసర్ విస్సా అప్పారావు, నటరాజ రామకృష్ణ వంటి వారు విరుచుకుపడి ఉద్యమంగా స్పందించారు. వారి వాదనలకు మద్దతుగా రాఘవయ్య అధ్యయన పత్రాలు, ప్రసంగాలతో అంతా తల వంచి మొక్కేలా చేశారు. కూచిపూడి గురువుల తరంలో తొట్టతొలిగా ప్రభుత్వం నుంచి భరత కళాప్రపూర్ణ బిరుదు సత్కారాల్ని అందుకోవడం కూచిపూడి వ్యాప్తికి దోహదం చేసింది.

పాతికేళ్ల వయసులో ఆయన పొందిన ఖ్యాతి 52వ ఏట మరణించే నాటికి వేలవేల మంది ఆయన అభిమానులుగా మారేలా చేసింది. సమగ్ర సంగీత, సాహిత్య రూపకంగా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఆస్వాదించే 'యక్షగానం'లో రాఘవయ్య తనదైన శైలి ముద్రతో జేజేలు అందుకున్నారు. మన నాట్య గురువుల బాణీలో కళాత్మకత వికసించేలా చేశారు. ప్రాచీన గ్రంథాలయాలు ప్రత్యేకించి తంజావూరులోని సరస్వతి మహల్‌లో మన నాట్యంపై ఉన్న మహత్తర గ్రంథాల్ని నాట్యాభిమానులకు అందేలా చేయాలని తపించారు. 1964లో రవీంద్రభారతి ప్రాంగణంలో జరిగిన అఖిల భారత నాట్యోత్సవంలో అధ్యక్షుడుగా ఆయన చెప్పినవి, సూచించినవి తరువాతి తరం వారికి ఆదర్శ పాఠాలు అయ్యాయి.

మార్గదర్శి
భరతనాట్యం, కథాకళి, కథక్, ఒడిస్సీ, మణిపూరి నాట్య సంప్రదాయాల్ని మాత్రమే ప్రదర్శిస్తే చాలదన్నారు. జానపద నృత్యాలు, ఎన్నెన్నో ప్రక్రియలు ఉన్నాయంటూ వాటిని రప్పించి, చూస్తే మన కూచిపూడి వాసి పెరుగుతుందని ఆయన చెప్పారు. ప్రభాకర నాట్యమండలిని స్థాపించి, జనం మెచ్చేలా కొత్త కొత్త ప్రక్రియల్ని అందించారు. ఆ రోజుల్లో వేదాంతం రాఘవయ్య రూపొందించిన 'హంటర్ డాన్స్' కొరియోగ్రఫీకి పాఠం లాంటిది అని గురువులు చెప్పుకొనేలా చేశారు.

అనార్కలి, బాలనాగమ్మ, రహస్యం సినిమాల్లోని కోరాడ నరసింహరావు, గిరిజా కల్యాణం వంటివి అన్ని వర్గాల వారు అద్భుతం అంటూ మెచ్చుకుంటూ చూసినవే! భరతనాట్యంలో గోపీనాథ్‌ల వంటి వారు ప్రవేశపెట్టిన ఆధునీకరణ సంస్కరణల వంటివి రాఘవయ్య ద్వారా కూచిపూడిని ప్రభావితం చేశాయి. సాధన, శిక్షణ, ప్రదర్శన వంటి రంగాల్లో వేదాంతం వారి ఒరవడి పలువురు గురువులకు అడుగుజాడ అయింది.

తనయుడి తపన
ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న రాఘవయ్య కుమారుడు రామచంద్ర వరప్రసాద్ తమ పెద్దల బాణీలను దృశ్య మాధ్యమంలో అందుబాటులోకి తేవాలని పరితపిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా పద్మభూషణ్ వెంపటి చిన సత్యం నిర్వహించే కూచిపూడి ఆర్ట్ అకాడమీలో అధ్యాపక కళాకారుడిగా ఉన్న రాము పాత కొత్తల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోని కళారూపాల్లో మేటిగా చెప్పుకోదగ్గ 'యక్షగానం' దాదాపుగా కనుమరుగైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందుతరాల వారికి మన నృత్య నాటకాల వైభవం తెలియాలంటే ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో 'డాక్యుమెంటేషన్' అవసరమని సూచిస్తున్నారు. 36 దాకా లెక్కకు వచ్చే కూచిపూడి యక్షగానాలు ఇప్పుడు కొద్దిమందికి కూడా తెలియకుండా పోయాయంటున్నారు. వేదాంతం రాఘవయ్య కుమారుడిగా 45 ఏళ్ల పైబడిన నాట్యరంగ అనుభవంతో ఉదాత్తమైన కళారంగ సమాచారం, తండ్రి కృషిని దృశ్యమాధ్యమంగా నిక్షిప్తం చేయాలని తలపెట్టారు. సినిమా ప్రముఖుడిగా తన తండ్రిని తలచుకునేవారికి ఆయన నాట్యవ్యాప్తి కోసం పడ్డ ఆరాటం, తపన అందించిన మెళకువలు అన్నీ తెలియజెప్పాలని ఉందంటున్నారు. ఈ రంగంలో ఆసక్తి కలవారు ఇంకా వివరాలు, జ్ఞాపకాల కోసం చె న్నైలోని రామును 94448 53333 ఫోన్‌నంబర్‌లో సంప్రదించవచ్చు.
- జిఎల్ఎన్ మూర్తి