Sunday, December 26, 2010

గిన్నిస్‌లోకి మన కూచిపూడి * ఒకే వేదికపై 2,800 కళాకారుల నృత్యానికి రికార్డు పుస్తకంలో చోటు

కొనియాడిన రాష్టప్రతి, గవర్నర్

కృష్ణా జిల్లాలో సుమారు 600 ఏళ్ల క్రితం పుట్టిన కూచిపూడి నృత్యం గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. సిలికానాంధ్ర, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన 2వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనంలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ‘హిందోళ థిల్లాన’ నృత్యాన్ని 2,800 కళాకారులు ఒకే వేదికపై నర్తించిన అద్భుత దృశ్యాన్ని గిన్నిస్ రికార్డు సంస్థ అధికార ప్రతినిధి తారికవర ప్రత్యక్షంగా వీక్షించారు.


రాష్టప్రతి ప్రతిభా పాటిల్ సహా వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శనను గిన్నిస్ రికార్డులోకి చేర్చుతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ప్రకటించడంతో స్టేడియం చప్పట్లతో మార్మోగింది. ఈ రసరమ్యమైన నృత్యాన్ని కీర్తించేందుకు తనకు మాటలు రావడం లేదని తారికవర వ్యాఖ్యానించారు. అనంతరం గిన్నిస్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలకు అందజేశారు. ఈ నృత్య సమ్మేళనంలో 15 దేశాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూచిపూడి ఆది గురువు పద్మ భూషణ్ వెంపటి చినసత్యంతోపాటు పద్మభూషణ్ యామినీ కృష్ణమూర్తి, పద్మశ్రీ డాక్టర్ కె.శోభానాయుడులను రాష్టప్రతి సత్కరించారు.


దేశానికే గర్వకారణం: ప్రతిభా పాటిల్


కూచిపూడి నృత్యం గిన్నిస్ రికారులోకి ఎక్కడం దేశానికే గర్వకారణమని రాష్టప్రతి ప్రతిభా పాటిల్ పేర్కొన్నారు. నృత్య సమ్మేనళం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజ రైన సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. భక్తి, అంకితభావం, పట్టుదలతో ఈ విజయం సాధించిన కళాకారులందరికీ అభినందనలు తెలియజేశారు. ఒకే వేదికపై ఇంత భారీ సంఖ్యలో కళాకారులు పాలుపంచుకోవడం గొప్ప విషయమని, కార్యక్రమం అద్భుతంగా జరిగిందని ప్రశంసించారు. 2,800 కళాకారులు పాల్గొన్నారని గిన్నిస్ రికార్డు సంస్థ ప్రతినిధి చెప్పారని, కానీ కేంద్ర మంత్రి పురందేశ్వరి పేరు కలిపి 2,801గా మార్పు చేస్తే బాగుంటుందని చమత్కరించారు.

తెలుగులో ప్రసంగించిన గవర్నర్...


ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన గవర్నర్ నరసింహన్ తెలుగులో ప్రసంగించి ప్రేక్షకులను ఆనందపర్చారు. ‘వేదికపై ఉన్న మహానుభావులు, వేదిక ముందున్న కళాకారులకు అభివందనం’ అని ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘కృష్ణపరమాత్ముడు విశ్వరూపం ప్రదర్శించినప్పుడు, ఆ దృశ్యాన్ని కేవలం అర్జునుడు ఒక్కడే చూసి మూర్చపోయాడు. అనంతరం లేచి కృష్ణపరమాత్ముడికి సాస్టాంగ నమస్కారం చేశాడు. ఈ రోజు కూచిపూడి నృత్య ప్రదర్శన తిలకించిన నాకు ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిలికానాంధ్రకు ధన్యవాదాలు తెలిపారు. కూచిపూడి నృత్యం గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు.


కూచిపూడి, యోగా తదితర సంస్కృతులను కాపాడుకోవడం మన బాధ్యతని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘనత సాధించిన కళాకారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల చెక్‌ను నిర్వాహకులకు అందజేశారు.


ముగింపు ఉత్సవంలో రాష్టప్రతి భర్త దేవీసింగ్ షెకావత్, కేంద్ర మంత్రి పురందేశ్వరి, మంత్రులు వట్టి వసంత్‌కుమార్, శ్రీధర్‌బాబు, డి.కె.అరుణ, మేయర్ కార్తీకరెడ్డి, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్, అధ్యక్షుడు చామర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. కూచిపూడి నృత్యం అనంతరం పద్మభూషణ్ డాక్టర్ రాజా, రాధారెడ్డిల బృందం ప్రదర్శించిన ‘శుభసంప్రతికం’ నృత్యప్రదర్శనను రాష్టప్రతి తిలకించారు.

పరదేశీ... తకిట తథిమి

లంకాద్వీప కాంతి రువిని సిల్వామన పక్కింటమ్మాయిలా కనిపించే రువిని సిల్వా శ్రీలంకలోని కేండీ ప్రాంతంలో పుట్టిపెరిగింది. 'నాన్న సునీల్ సిల్వా ప్లాంటేషన్ మేనేజర్. అమ్మ విజయరత్న. నేను చిన్నప్పుడు బాగా డ్యాన్స్ చేసేదాన్ని. అలాగని నర్తకిగా కెరీర్ ఎంచుకుని స్థిరపడాలని మాత్రం అనుకోలేదు. మా అమ్మకు ఆసక్తి ఉన్నా, నాట్యం అభ్యసించడాన్ని అప్పట్లో అమ్మమ్మతో సహా అందరూ వ్యతిరేకించారట.

కానీ మా అమ్మ నన్ను ప్రోత్సహించింది. ఆమె చేయలేనిదాన్ని నేను చేస్తానని అమ్మకు నేను మాటిచ్చాను. అక్కడి విద్యావిధానంలో ఏదో ఒక కళారూపాన్ని అభ్యసించడం తప్పనిసరి. వాటికి ప్రత్యేకంగా మార్కులుంటాయి. అలా నేను మూడేళ్లపాటు భరతనాట్యాన్ని అభ్యసించాను..' అంటున్న రువిని సిల్వా శ్రీలంక జాతీయ నృత్యం కేండియన్ కూడా బాగా చేస్తుంది. యూనివర్సిటీల వెతుకుతున్నప్పుడు రవీంద్రుడి విశ్వభారతి పరిచయమయింది ఆమెకు.

మూడున్నరేళ్ల క్రితం అక్కడ చేరి మణిపురిని అభ్యసించడం మొదలుపెట్టింది. త్వరలోనే మెళకువలను ఒంటపట్టించుకున్న రువిని ప్రదర్శనలు ఇస్తూ అనేక దేశాలు తిరిగింది. ఎన్నో అవార్డులను అందుకుంది. 'దక్షిణాది సంస్కృతి చాలావరకూ నాకు పరిచయమైనదిగానే అనిపిస్తుంది. ఎటొచ్చీ మాకిన్ని పండగలూ పూజలూ ఉండవంతే. ఏప్రిల్ 14 సంవత్సరాది, మేలో బుద్ధజయంతి - అంతే మేం చే సుకునే పండగలు..' అంటూ ముగించిన రువిని సిల్వా ఒక ద్వీప దీప్తిని తన నాట్యంతో అందరి మనసుల్లోనూ నింపింది.

ఇంద్రధనస్సు వెలుగు ఇరినా కొమిస్సరొవా
ఇరినా ఒడిస్సీ నృత్యం చేస్తున్నప్పుడు ఆమె కళ్లలోని కాంతి ఆమె ధరించిన వెండి ఆభరణాల మిలమిలలతో పోటీపడుతుంటుంది. 'భారతీయ సంప్రదాయ నృత్యాల్లో ఒకటయిన ఒడిస్సీని నేను నేర్చుకుంటాననిగానీ, ప్రద ర్శనలిస్తాననిగానీ ఎప్పుడూ అనుకోలేదసలు..' అనే ఇరినా మాస్కోలో ఒక నేస్తం బలవంత ం చేస్తే ఒడిస్సీ నృత్య ప్రదర్శనను సరదాగా చూసింది. అది ఆమె మనసులో నాటుకుపోయింది. ఆ తర్వాత గురువు సుజాత మహాపాత్ర దగ్గర చేరి శ్రద్ధగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఎనిమిదేళ్ల నుంచీ అభ్యసిస్తున్న ఇరీనా ప్రస్తుతం మాస్కోలో జూనియర్ విద్యార్థులకు శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగింది. ప్రతి ఏడాదీభువనేశ్వర్‌కు వ చ్చి కొన్ని రోజులుండి తన నాట్యానికి మెరుగులు దిద్దుకునే ఆమె ఇంగ్లీష్ అధ్యాపకురాలు, అనువాదకురాలు కూడా.

చందన పరిమళం మాళవిక వెంకటసుబ్బయ్య
పేరు చూసినా, ఆమెను చూసినా అచ్చ తెలుగమ్మాయనే అనుకుంటారందరూ. కన్నడ కస్తూరి సౌరభాలను వెదజల్లే మాళవిక "నా తల్లిదండ్రులిద్దరూ రంగస్థలం మీద రాణించిన వారే. నా తోబుట్టువులకు కూడా థియేటర్ ఆర్ట్స్‌తో మంచి పరిచయం ఉంది. దానివల్ల చిన్నప్పటి నుంచీ నాకు ఈ కళతో అనుబంధం ఉంది. ఎనిమిదేళ్ల నుంచి నాకు నాట్య శిక్షణ ఆరంభమయింది...' అని చెప్పారు. అదే మొదటి అడుగుగా వేసిన మాళవిక బెంగళూరులోని లలితా శ్రీనివాసన్ శిక్షణలో మైసూరు బాణీకి చెందిన చక్కటి భరతనాట్య నర్తకిగా రూపొందింది.

భారతీయ జానపద నృత్యాల గురించి కూడా బాగా చదువుకున్న ఆమె హైదరాబాద్ వచ్చి పసుమర్తి వెంకటేశ్వరశర్మ శిష్యరికంలో కూచిపూడినీ అభ్యసించింది. 'ఇప్పటికి లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చాను. ప్రతి ప్రదర్శన తర్వాత ప్రేక్షకులు వచ్చి తమ అభిప్రాయాలను చెబుతున్నప్పుడు ఉద్వేగంగా ఉంటుంది. కళ అనేది 'వన్ వే' కాదు. నేనేం చేస్తున్నానో దాన్ని అర్థం చేసుకుని అనుభూతి చెందే వీక్షకులను కలిసినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది... వాళ్ల ప్రోత్సహం, అభినందనలే కళాకారులకు ఊపిరి పోస్తాయి..' అని చిరునవ్వుతో చెబుతారు.

తెలుగు కుటుంబంలో మెట్టిన మాళవిక ఆరేళ్లుగా కెనడాలోని ఎడ్మాంటన్‌లో ఉంటూ 'నాట్యమ్ డ్యాన్స్ అకాడమీ'ని నిర్వహిస్తున్నారు. 'కెనడా అనేక సంస్కృతుల సంగమం. అక్కడివారికి భాష తెలియకపోయినా సరే, మన సంప్రదాయ నృత్యాలను కళ్లార్పకుండా చూస్తారు. చాలా గౌరవిస్తారు. ప్రదర్శనకు ముందు దానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తే జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారు. ఎన్నారైలయితే చాలా సీరియస్‌గా నేర్చుకుంటారు..' అంటున్న మాళవిక తన నాట్యంతో విశాఖను మంత్రించారంటే నమ్మండి.

ప్రేమతత్వమే ఆమె నృత్యం - వార్దా రిహాబ్
'బంగ్లాదేశ్ ముస్లిం దేశమే కావొచ్చు. ఆంక్షల పరదాలు ఎక్కువే ఉండొచ్చు. కానీ వాటి వెనుక ప్రతిభ కలిగిన ఎందరో బాలికలున్నారు.. అవకాశం వస్తే వాళ్లు చెయ్యలేనిది లేదు. వారిని వెలుగులోకి తేవాలన్నదే నా కల' అంటున్నప్పుడు వార్దా రిహాబ్ కళ్లలోని మైమరుపును చూడాల్సిందే. ఆమె తల్లి డాక్టర్. చాలా ఏళ్లక్రితం ఉదయ్‌శంకర్ బృందం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నప్పుడు ఆమెను చూసి వారు తమ బృందంలోకి రమ్మని అడిగారట. కాని సంప్రదాయం ఆమెను అటువైపు అడుగెయ్యకుండా ఆపింది.

'నాకో కూతురు పుడితే ఆమె తప్పకుండా డ్యాన్స్ చేస్తుంది' అని అప్పుడే నిర్ణయించుకున్నారామె. అందువల్లే వార్దాను చిన్నప్పుడే డ్యాన్స్ స్కూల్లో చేర్పించారు ఆమె తల్లి. ప్రసిద్ధ బంగ్లాదేశీ నర్తకి, కొరియోగ్రాఫరయిన షర్మిలా బెనర్జీ శిష్యరికంలో మణిపురి మణిపూసగా ప్రకాశించింది వార్దా రిహాబ్. 'తాండవం, లాస్యం - రెండూ ఏక సమయంలో చెయ్యగలిగే విధానం మరే నాట్య సంప్రదాయంలోనూ లేదు. మణిపురిలో ఉన్న ఈ విశిష్టత నన్ను కట్టి పడేసింది...' అంటున్నారామె.

ఐసీసీఆర్ ఢాకాలో నియమించిన గురు కళావతి దగ్గర వార్దా పంగ్ (మృదంగం), థాన్ తా (మణిపురి మార్షల్ ఆర్ట్)లలో ప్రావీణ్యం సంపాదించింది. ఐసీసీఆర్ ఉపకారవేతనంతో రవీంద్రభారతి విశ్వవిద్యాలయంలో చేరిన ఈ కళాకారిణి అందులో బంగారు పతకాన్నీ సాధించింది. ఢాకా యూనివర్సిటీలో ఎంబీయే చేసిన వార్దాకు అక్కడ నాట్య విభాగాన్ని నెలకొల్పాలనేది ధ్యేయం. రాధాకృష్ణుల ప్రణయాన్ని ఆమె అభినయిస్తున్నప్పుడు అచ్చంగా బృందావనమే కళ్లకు కట్టింది విశాఖ ప్రేక్షకులకు.

కూచిపూడి కుందనం మంగళ
మూడేళ్ల వయసు నుంచే కూచిపూడి నేర్చుకుంటున్న మంగళ మద్దాలి పదహారణాల తెలుగమ్మాయి. తొమ్మిదేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లిపోయినా అక్కడ కూడా తన సాధనను ఆపలేదామె. కొమండూరి రేవతి, వెంపటి రవి శంకర్‌ల శిష్యరికంలో అనేక ప్రదేశాలు పర్యటించి ప్రదర్శనలిచ్చిన మంగళ 'వారిని చూస్తూ నేను చాలా నేర్చుకున్నాను. ఒక నర్తకిగా వేదిక మీద నన్ను నేను ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి, ఒక వ్యక్తిగా ఎలా మసలుకోవాలి... వంటివెన్నో విషయాలను నేను గ్రహించగలిగాను' అంటారామె వినయంగా.

'అక్కడ సంప్రదాయ కళారూపాలకు చాలా ప్రాధాన్యమిస్తారు. కానీ వాటికి పుట్టినిల్లు ఈ దేశం. సంగీతనాట్యాలకు సంబంధించి ఇక్కడ గొప్ప వారసత్వ సంపద ఉంది. దురదృష్టవశాత్తూ దాన్ని నిర్లక్షయం చేసేవారే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు..' అని బాధపడుతున్న మంగళ వయసు చాలా చిన్నది, ఆలోచన పెద్దది. పద్మభూషణ్ వెంపటి చిన సత్యంతో కలిసి అమెరికాలోని నలభై నగరాల్లో ప్రదర్శనల్లో పాల్గొన్న మంగళ నాలుగేళ్ల క్రితం ఇక్కడ కూచిపూడి మహోత్సవంలోనూ తన కళను ప్రదర్శించింది.

ఇంటర్వ్యూలు : అరుణ పప్పు, విశాఖపట్నం
ఫోటోలు : వై. రామకృష్ణ

Thursday, December 9, 2010

జానపద నజరాన .... చెక్కభజన

సంప్రదాయ ఉత్సవాలు, కార్యక్రమాలలో దేవుని ఊరేగింపు జరిపేటప్పుడు చెక్కభజన బృందం చేసే భజనలు ఆ కార్యక్రమాన్ని రక్తికట్టిస్తారు. చెక్కభజనను ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారు కంచెర్ల గోపన్న. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాంతానికి చెందిన రామదాసుగా ప్రసిద్దుడైన గోపన్న కీర్తనలు భజన సంప్రదాయానికి చెందినవి. భజనల్లో పండరి భజన, చెక్కభజన, కులుకు భజన వంటివి అనేకం. వీటిలో చెక్కభజన ప్రఖ్యాతిగాంచింది. ఇందులో నృత్యంకూడ ఉండడంచేత ఇది మరింత కళాత్మకతను కలిగి ఉంది.

janapadaluప్రకృతిలోని వస్తువులను వాడుకుని వాటి ద్వారా సంగీతాన్ని సృష్టించుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ తానే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా ఉల్లాసవంతమైన ప్రపంచంలోనికి తీసుకుపోగలగే లక్షణం ఒక్క జానపదుడికే సొంతం. ఈ లక్షణం చెక్కభజనలో కనిపిస్తుంది. కర్రముక్కలకు తాళాలు జోడించి వాటితో లయను సృష్టించడం, సామూహికంగా అడుగులు వేయడం చెక్కభజనలో కనిపించే దృశ్యం. చెక్కభజన సామూహిక నృత్యరూపం.

పండుగ, పర్వదినాల్లో, జాతరలు, ఉత్సవాలలో , సాయంకాలం ఊళ్ళో గుడిముంగిట, ఎప్పుడు పడితే అప్పుడు , ఎక్కడపడితే అక్కడ జానపదులు చెక్క భజన ప్రదర్శిస్తుంటారు. భారత రామాయణాది కథలను పాటలుగా మలచుకుని స్థానిక కళాకారులు నృత్యాలు చేస్తారు. గురువు మధ్యలో ఉంటాడు. అతను జట్టును నడిపిస్తుంటాడు. అతని ఆదేసానుసారంగా జట్టు అడుగులు వేస్తుంది. చెక్కభజనతో చేసే నృత్యంలో అడుగులు వేస్తారు. ఈ అడుగులు చాలా ఉన్నాయి. అది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్ప కొట్టడం, కులుకు వంటివి అనేకం ఇందులో ఉంటాయి. మొత్తం గుంపు ఒకే రకంగా అడుగులు వెయడం, చెక్కలు కొట్టడం మధ్యలో గురువు అరుపులు, కేకలు, ఈ ప్రదర్శనను కనులపండువగా చేస్తాయి. గురువు ఒక పాటలోని చరణం పాడితే దానిని జట్టులోని వారందరూ తిరిగి పాడతారు. ఈ పునరుక్తి వలన పాటకు అందం వస్తుంది.

భక్త రామదాసు విరచితం: చెక్కభజనను ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కంచెర్ల గోపన్న. భక్త రామదాసుగా ఆయన జగద్విఖ్యాతులు. రామదాసుగా ప్రసిద్దుడైన గోపన్న కీర్తనలు భజన సంప్రదాయానికి చెందినవి. ఇప్పటికీ ఆంధ్రాప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలలో వేసిన పందిళ్లలో కొన్ని భజన బృందాలు శ్రీరామనామగానంతో, తమ చెక్కభజనలతో జనాన్ని ఉర్రూతలూగిస్తుంటారు. భజనల్లో పండరి భజన, చెక్కభజన, కులుకు భజన వంటివి అనేకం. వీటిలో చెక్కభజనలో నృత్యంకూడ ఉండడంచేత ఇది మరింత కళాత్మకతను కలిగి ఉంది.

భక్తి ఉద్యమంలో ప్రధానపాత్ర:మధ్యయుగాల్లో భారత దేశంలో వచ్చిన భక్తి ఉద్యమ ప్రభావం చెక్క భజనలో చూడవచ్చు. వేదాంతాన్ని సామాన్యులకు అందించాలన్న ఉద్దేశ్యం భక్తి ఉద్యమంలో కనిపిస్తుంది. చెక్కభజనలో కూడ వేదాంత పరమైన భారత, రామాయణ, భాగవతాది కథలను పాటల రూపంలో పామరులకు కూడ అర్థమయ్యే భాషలో చెప్పడం జరుగుతుంది. అందువల్లనే చెక్కభజన సర్వ జనాదరణీయమైంది. రాముడి గుడిలేని ఊరు లేనట్లే, అంధ్ర దేశంలో చెక్కభజన గుంపు లేని ఊరు లేదు. ప్రతి గ్రామంలోను చెక్కభజన గురువు ఉండేవాడు...అలానే చెక్కభజన గుంపు కూడా ఉండేది.

janapadalu1 
చెక్కభజనకు చిరునామా: చెక్కభజనకు కడప జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ ప్రతి గ్రామంలోను చెక్కల శబ్ధాలు, గురువుల కేకలు, జట్టులోని కళాకారుల అడుగుల నాదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడి నుండి చాలమంది కళాకారులు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు ఇచ్చారు. కడప జిల్లలోని గొరిగనూరు వాసి పుల్లయ్య, చెన్నూరు వాసి ఈశ్వరరెడ్డి చెక్కభజనలో ప్రయోగాలు చేస్తున్నారు.

చెక్కభజన కూడ జానపదత్వం కోల్పోయింది. ఆధునిక ప్రసార మాధ్యమాలు టీ.వి , సినిమాలు చెక్కభజనను దెబ్బ తీస్తున్నాయి. వీటిని తట్టుకొని నిలబడడానికి ఈ కళాకారులు కూడా చెక్కభజనలో ప్రయోగాలూ చేస్తున్నారు.

నిజానికి చెక్కభజనలో కేవలం తప్పెట మాత్రమే ఉపయోగిస్తారు. అప్పుడే చెక్కభజనకు అందం వస్తుంది.మన జానపద కళారూపాలు మన సంస్కృతికి నిలువెత్తు దర్పణాలు. వాటిని కాపాడుకోకపోతే మనం సంస్కతి విధ్వంసకులమవుతాము.

భాషాభివృద్ధికి తోడ్పాటు: ఒకప్పుడు ఉత్తరాదికి పరిమితమైన దేవనాగరిలిపి దక్షిణాదికి కూడా వ్యాప్తిచెందడానికి ఈ చెక్కభజనలే కారణమంటే ఆశ్చర్యం కలగక మానదు. తుకారం, కబీర్‌, పురందరదాస్‌, మీరాభాయ్‌ వంటి ఉత్తరాది కళాకారులు తమ గీతామృతాల ద్వారా వాటి భజనల ద్వారా దక్షిణాదికి కూడా తమ భాషను వ్యాప్తినొందించారు. వారి భక్తబృందాలు ఆ రకంగా దక్షిణాదిన కూడా కొద్దోగొప్పో హిందీ భాషాభివృద్ధికి ఈ చెక్కభజనలు తోడ్పడ్డాయి.
-నండూరి రవిశంకర్‌

Wednesday, October 27, 2010

సృజనకు కాస్త కళాత్మకత జోడిస్తే ....

కంది పప్పుతో కాసుల పేరు!

కుక్కపిల్ల.. సబ్బుబిళ్ల.. అగ్గిపుల్ల.. ఇవి శ్రీశ్రీ కవిత్వానికి అర్హమైనవైతే.. ఖాళీ డబ్బా.. ప్లాస్టిక్ ముక్క.. పప్పుబద్ద... ఇవి అరుణ్‌జ్యోతి సృజనాత్మకతకు వస్తువులయ్యాయి. ఆమె చేతిలో అందమైన కళారూపాలుగా ప్రాణం పోసుకున్నాయి. వీటి కోసం ఆమె పెట్టిన పెట్టుబడేంటో తెలుసా..? బాధ్యతల మధ్య మిగిలిన ఖాళీ సమయం. 
ఆసక్తిగా ఉందా..? ఇవిగో వివరాలు..
ఇంట్లో పేస్ట్ అయిపోతే మీరేం చేస్తారు? పారేస్తామండీ బాబూ...! అగ్గిపెట్టెలో పుల్లలు అయిపోతే..? చెత్తబుట్టలో వేస్తాం. పాడయిపోయిన, విరిగిపోయిన డబ్బాలు గట్రాలను ఏం చేస్తారేంటి? ఇనప సామాన్లకు అమ్మేస్తాం. లేదంటే అటకమీదకెక్కిస్తాం. పనికిరాని వాటితో పనేంటి అంటారా? 'అయ్యో...వాటితోనే పని' అంటున్నారు నల్గొండకు చెందిన అరుణ్‌జ్యోతి ఎస్.లోఖండే.

సృజనకు కాస్త కళాత్మకత జోడిస్తే అయిపోయిన పేస్ట్ ట్యూబు, ఖాళీ కంటైనర్‌లు చక్కటి కళాఖండాలుగా పప్పులు, ధనియాలు, బిర్యాని ఆకుల్లాంటివి నాజూకు నగలుగా తయారవుతాయి. ఒక్క ఇవే కావు, ఇంకా ఇలాంటి చాలా కళల్లో అరుణ్‌జ్యోతికి ప్రవేశం ఉంది.

అమ్మ దగ్గర ప్రారంభం
చిన్నప్పటి నుంచి కొత్తగా ఆలోచించడం... కొత్త పనులను చేయడమంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ ఇష్టం మొదట కాయిన్స్ కలెక్షన్‌గా మొదలైంది. ఎక్కడ ఏ కొత్త రకం నాణెం దొరికినా జాగ్రత్తగా దాచుకునేదిట. పెళ్లయినా ఆ హాబీని కొనసాగిస్తూ ఇప్పటిదాకా యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలకు చెందిన దాదాపు పదివేల నాణాలను పోగుచేసిందామె. హైస్కూల్‌కు వెళ్లే రోజుల్లోనే అమ్మ దగ్గర చీరల మీద ఎంబ్రాయిడరీ, ఇతర అల్లికలు నేర్చుకుంది అరుణ్‌జ్యోతి.

ఉమ్మడి కుటుంబం కావడంతో వాళ్లింట్లో పూటకో వెరైటీ వంటలుండేవట. దీంతో రకరకాల వంటలను చేయడం కూడా నేర్చుకుంది. ఇలా కొత్త విషయాలను తెలుసుకోవడం, నేర్చుకోవడం పట్ల తనకున్న ఆసక్తి ...పెళ్లయ్యాక దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగ పర్చుకోవడానికి చాలా ఉపయోగపడిందని చెప్తూ... 'ఇంటర్ పూర్తవగానే నాకు పెళ్లయింది. ఇక్కడా ఉమ్మడి కుటుంబమే. ఏ పనైనా అందరం కలిసి చేసుకునే వాళ్లం కాబట్టి ఇంటిపని త్వరగా అయిపోయేది.

ఆ తర్వాత అంతా ఖాళీయే. అప్పుడే చిన్నప్పుడు నేర్చుకున్న ఎంబ్రాయిడరీ, అల్లికలు మళ్లీ మొదలుపెట్టాను. ఆ ఆసక్తితోనే కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ డ్రెస్ మేకింగ్‌లో డిప్లమా చేశాను. అదే సమయంలో నల్గొండలో జరిగే ప్రతి వంటల పోటీల్లో పాల్గొనేదాన్ని. ప్రతి పోటీలో ప్రైజ్ గెలుచుకునేదాన్న'ని గతాన్ని గుర్తుచేసుకుంది అరుణ్‌జ్యోతి.

ఆపదలోనూ...
అరుణ్‌జ్యోతి వాళ్లబ్బాయి అనీష్‌కి ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు కరెంట్ షాక్ తగిలి గాయాలయ్యాయి. బాబును పట్టుకుని తొమ్మిది నెలలు ఆసుపత్రిలో ఉందామె. అంత ఆపదలోనూ కుంగిపోకుండా... తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ... ఒకవైపు కొడుకును చూసుకుంటూనే ఇతర వ్యాపకాల మీద మనసు పెట్టింది. ఆ టైమ్‌లోనే తనకు ఎంతో ఇష్టమైన ఉర్దూ భాషను నేర్చుకుంది.

ఆసుపత్రిలో మంచం మీదున్న బాబును ఉల్లాస పర్చడానికి ఇంట్లో పాడైపోయిన వస్తువులు...డబ్బాలకు తన సృజనాత్మకతను జోడించి రకరకాల బొమ్మలను చేసి చూపించేది. అసంపూర్తిగా మిగిలిన తన చదువుకూ శ్రీకారం చుట్టింది. అట్లా మళ్లీ మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటిదాకా ఆగనే లేదు. ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఎంఏ చేసింది. సమ్మర్ క్యాంపులకు కొడుకుతో పాటు వెళ్లి యోగా, కూచిపూడి నాట్యాన్ని అభ్యసించింది. అభ్యసించి ఊరుకోలేదు. సమయం ఉన్నప్పుడల్లా ప్రదర్శనలు కూడా ఇస్తోంది.


పప్పు నగలు....
ఇప్పటికీ ఆమెలోని సృజనాత్మకత కొత్త కొత్త ప్రయోగాలకు నాంది పలుకుతూనే ఉంది. చీరల మీద జర్దోసీ, ఎంబ్రాయిడరీ పని, సిమెంటు, ప్లాస్టిక్, కంటైనర్లతో రకరకాల కళాకృతులు.... లేటెస్టుగా కంది, పెసర, ధనియాలు, సోంపు గింజలు, జీలకర్ర, మిరియాలు, బిర్యానీ ఆకులతో వంటింటి వెచ్చాలతో నాజూకైన నగలనూ తయారు చేస్తోంది. పప్పు ధాన్యాలతో కాసుల పేరు, నెక్లెస్, లాంగ్ చైన్‌లను అందంగా అమరుస్తుంది. పప్పులతో చీరల మీద రకరకాల డిజైన్లనూ వేస్తోంది.

ఆమె బంధువులు, స్నేహితుల్లో తాను తయారు చేసిన ఈ జ్యువెలరీకి ఎంతో డిమాండ్ ఉంటోందట. ఇప్పటివరకు ప్రదర్శనకే సరిపోయిన తన కళ ఇక నుంచైనా పదిమందికి ఉపయోగపడాలన్న తాపత్రయంతో....ఫ్రిజ్‌లో కూరగాయలను, పళ్లను పెట్టుకోవడానికి బట్టతో బ్యాగులను కుట్టి, వాటిని అమ్మగా వచ్చిన డబ్బును అనాథలకు అందిస్తోంది అరుణ్‌జ్యోతి. '

ఇన్నాళ్లూ నా కళను కాలక్షేపానికి, పదిమంది ప్రశంసలు పొందడానికే పరిమితం చేశాను. సమాజానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడాలని ఇలా బట్టతో సంచీలు కుట్టి అమ్ముతున్నాను. దీని ద్వారా రెండు రకాల మంచి జరుగుతోంది. ఒకటి... ప్లాస్టిక్ వాడకం తగ్గేలా ఎంతోకొంత కృషి చెయ్యడం. రెండవది.. అనాథలకు సాయం చేయడం' అని చెప్పింది. ప్రస్తుతం నల్గొండలో ఒక లేడీస్ గార్మెంట్ షాపును, అలాగే హైదరాబాదులోని బర్కత్‌పురాలో తను డిజైన్ చేసిన చీరలతో మరో షాపునూ నడుపుతోంది ఈమె.

ఇవే కాక 'ఆయుర్వేదం అంటే నాకున్న ప్రత్యేక అభిమానం వల్ల 'అందరికీ ఆయుర్వేదం' అనే అంశానికి ప్రచారం తీసుకురానున్నట్లు' తెలిపింది. తాను చేస్తున్న ఈ పనులన్నింటికీ ఆమె భర్త సతీష్ .ఎన్.లోఖండే, అత్తగారి ప్రోత్సాహం, తోడ్పాటు ఎంతో ఉన్నాయని చెప్పింది అరుణ్‌జ్యోతి.  
సరస్వతి రమ

Friday, October 1, 2010

అమెరికా కంపెనీకి చిక్కిన... అప్పడాల కథ

కథ: కప్పడాలు
రచయిత: తోలేటి జగన్మోహనరావు


గన్ ప్రేమలో పడ్డాడు. గన్ అసలు పేరు గన్ కాదు. గణేష్. ఢిల్లీలో డాండూమ్ అని చదివేసి అమెరికా బాస్‌ల కింద పని చేయడం మొదలుపెట్టాక గణేష్ కాస్తా గన్‌గా మారిపోయాడు. కుర్రాడు కత్తి. మహా చురుకు. కుదురంటే బెరుకు.
ఇంత స్పీడు మీద ఉన్న కుర్రాడు సహజంగానే ప్రేమలో పడతాడు. పడ్డాడు. ఢాం. అమ్మాయి తండ్రి అతగాణ్ణి పిలిచి- నాయనా ప్రేమ సరే, నీ ప్రయోజకత్వం నిరూపించుకో. అప్పుడే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా. నీకు ఒక సంవత్సరం గడువు అని మరోచరిత్ర లెవల్లో ప్రామిస్ చేస్తాడు.

సాధారణంగా ప్రేమించేవాళ్లు అమ్మాయితో పాటు అమ్మాయి బ్యాక్‌గ్రౌండు, ఆ అమ్మాయి యిలాకా, తాలూకా, తండ్రి ఏం పని చేస్తాడు, ఏమి ఆస్తిపాస్తులు ఉన్నాయి... ఒకసారి కాకపోయినా ఒకసారైనా చూసుకుంటాడు.
కాని, మన గన్ చూసుకోడు.

కెరీర్‌లో దూకుతాడు. బుల్లెట్‌లా దూసుకుపోతాడు. అమెరికా కంపెనీ ‘కెప్సీ’ భారత్‌లో అడుగుపెట్టి ‘అప్పడాల’ వ్యాపారం చేద్దామని నిర్ణయించుకుంటే దాని లోకల్ శాఖకు మనవాడే సుప్రీమ్ అవుతాడు. అప్పటికే అంధ్రదేశంలో ‘గణేష్’ అనే కంపెనీ అప్పడాల రంగంలో నంబర్ వన్‌గా ఉంటుంది. దానిని తన కెప్సీతో గన్ దెబ్బ కొడతాడు. తనవి అప్పడాలు కావనీ కప్పడాలని ప్రకటనలతో ఊదరగొడతాడు. చేతితో చేసే అప్పడాల వల్ల టైఫాయిడ్, కలరా, మలేరియా, ఎయిడ్స్ కూడా వస్తాయని ప్రచారం చేస్తాడు.

జనమంతా అప్పడాలు మానేసి కప్పడాలు తినడం మొదలెడతారు.
కెప్సీతో పోరాడలేక ఆఖరుకు గణేష్ కంపెనీ చేతులెత్తేసి మూతపడుతుంది.
గన్ ఇప్పుడు విజేత. ఆ విజయోత్సాహంతో మామగారి దగ్గరకు వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడబోతాడు. కాని అప్పటికే మామగారు వ్యాపారంలో చితికిపోయి ఉంటారు. కట్నకానుకలు యిచ్చే పరిస్థితిలో లేనని కాబోయే అల్లుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటారు.
గన్ ఇవి పట్టించుకోడు. తనకు కావల్సింది కట్నం కాదని కన్య అని చెబుతాడు.
మామగారు సంతోషపడతారు. అందరూ భోజనాలకు కూర్చుంటారు. పనిమనిషి పెరుమాళ్లు యధావిధిగా సాంబారుతో పాటు అప్పడాలు తెస్తాడు. గన్ ఉలిక్కిపడతాడు. ఏమిటి యింకా మీరు అప్పడాలే తింటున్నారా, మా కంపెనీ వారి కప్పడాలు తినడం లేదా అంటాడు.

మామగారి భృకుటి ముడిపడుతుంది. ఇంతకూ నువ్వు చేసే పని ఏమిటి అంటారు. కప్పడాల మార్కెటింగ్ అని చెబుతాడు గన్.
అంతే. మామగారు లేచి గన్ మీద గన్ ఎక్కుపెడతారు. పెరుమాళ్లు సాంబారు బకెట్‌ను గన్ మీద కుమ్మరించడానికి సిద్ధమవుతాడు. పనివాళ్లు అతని వైపు దూసుకువస్తారు. గన్ జరిగిందేమిటో అర్థంగాక కన్నుతప్పి చావు లొట్టబోయి బయటపడతాడు.

ఇంతకు సంగతి ఏమిటి? కప్పడాల దెబ్బకు మూతబడ్డ అప్పడాల కంపెనీ ‘గణేష్’ ఈ మామగారిదే.
రచయిత తోలేటి జగన్మోహనరావు 2001లో ఈ కథ రాశారు. మల్టీనేషనల్ కంపెనీలు ఆఖరుకు ఉప్పూ పప్పుల్లో కూడా అడుగుపెట్టి భారతీయ సంప్రదాయ మార్కెట్‌ను ఎలా ధ్వంసం చేయబోతున్నాయో ఈ కథలో వ్యంగ్యంగా, హాస్యంగా ఎత్తి చూపించారు. ఆయన ఊహించినట్టుగానే అలాంటి కంపెనీలు భారత్‌లో అడుగుపెట్టాయి. చినచేపను పెదచేప మింగినట్టుగా చిన్న చిన్న చిల్లరకొట్లను పెద్దపెద్ద మాల్స్ మింగుతున్నాయి.

ఈ కథ చదువుతున్నంత సేపూ నవ్వు వస్తుంది. కాని, ఆఖరున కళ్లు తుడుచుకుంటే కన్నీళ్లు చేతికి తగులుతాయి.
ఈ కథ ఒక హెచ్చరిక. వర్తమాన విషాదం. ఏడవలేక నవ్వడం.

తోలేటి జగన్మోహనరావు : ప్రసిద్ధ తెలుగు కథకుడు. ‘తోలేటి జగన్మోహనరావు కథలు’ పేరుతో సంపుటి వెలువరించారు. ఢిల్లీలో కేంద్ర సర్వీసులలో పని చేసి, రిటైరై, ప్రస్తుతం ఢిల్లీలోనే విశ్రాంత జీవనం గడుపుతున్నారు.

శమంతకమణి ఎవరో కాదు ...మన సూరమ్మే!

‘రాయడానికి కలానికి చిక్కని గొప్పతనమే గొప్పతనం’ అనే చలం మాటలు ఆయన కథలకూ వర్తిస్తాయి.
మన తృప్తి కోసం మళ్లీ మళ్లీ చెప్పుకోవడమేగానీ ఆ మహా రచయిత కథల గొప్పతనం ఏ కలానికి చిక్కుతుంది?! ‘శమంతకమణితో ఇంటర్‌వ్యూ’ కథ ఏ సంవత్సరంలో చలం రాశారో తెలియదుగానీ ఏ సంవత్సరం చదివినా ఆ సంత్సరం రాసిన కథగా తాజాగా చదివిస్తుంది. వర్తమానానికి పట్టిన నిలువెత్తు అద్దంలానే ఉంటుంది. చలం కాలాతీత కథల్లో ఇదొకటి.
శమంతకమణి ఎవరు? కథానాయకి.

తెనాలికి చెందిన సూరమ్మ సినిమాఫీల్డ్‌కు వెళ్లి శమంతకమణిగా మారుతుంది. లెక్కకు అందని డబ్బు,పేరు ప్రఖ్యాతులు గడిస్తుంది. కీర్తిని, డబ్బును వెతుక్కుంటూ వెళ్లినవారు వెనక్కి తిరిగి రావడమనేది ఉంచదు. ఇది లోకరీతి. బలంగా స్థిరపడిన ఇట్లాంటి లోకరీతిని కాలదన్ని రంగుల లోకాన్ని, కీర్తిని, డబ్బును వదిలేసి ఒకానొకరోజు సొంతూరు తెనాలికి వచ్చి స్థిరపడుతుంది శమంతకమణి.

లోకం మూకుమ్మడిగా ముక్కు మీద వేలేసుకుంటుంది.
శమంతకమణి మనసు మారడానికి కారణం ఏమిటి?
ప్రేమ విరహం అంటారు కొంతమంది. వైరాగ్యమంటారు మరి కొందరు. సుబ్బారావు స్నేహితుడైన రచయిత మాటల్లో కథ నడుస్తుంది. శమంతకమణి తెనాలికి వచ్చి స్థిరపడడానికి గల కారణాలను రకరకాలుగా ఊహించుకోవడం కంటే ఆమెనే అడిగితే సరిపోతుంది కదా అని ఇద్దరూ శమంతకమణి ఇంటికి బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక-‘‘శమంతకమణి ఉందా?’’ అని ఇంటిదగ్గర కనిపించిన అబ్బాయిని అడుగుతాడు సుబ్బారావు.

‘‘ఎవరు ఆమె?’’ అని తెల్లబోతాడు ఆ కుర్రాడు.
‘‘సూరమ్మ ఉందా?’’ అని అడుగుతాడు సుబ్బారావు మళ్లీ.
‘‘ఉంది’’ అని చెబుతాడు అతను. ఈ దృశ్యంతో అర్థమయ్యే విషయం ఏమిటంటే శమంతకమణి ఇకముందు ఆ పేరుతో బతకదల్చుకోలేదని మళ్లీ సూరమ్మగానే బతకదల్చుకుందని. సూరమ్మ ఇక సినిమాల్లో నటించదు. జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇవ్వదు. స్థలాలు కొనదు. తననెవరూ ఫోటోలు తీసుకోనివ్వదు.

సుబ్బారావు స్నేహితుడు అంటే మనకు కథ చెప్పే రచయిత... సూరమ్మ చిన్నతనంలో ఉండగా ఎత్తుకొని ఆడించాడు. చాలా చాలా కాలం తరువాత సూరమ్మను చూసినప్పుడు ఎత్తుకొని ఆడించిన సూరమ్మ గుర్తుకు రాదు. ఆమె ముఖంలో అందం కంటే స్థిమితమూ, విజ్ఞానం ఎక్కువ కనిపిస్తాయి. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ అప్పుడు ‘వేదాంతసార సంగ్రహం’ చదువుతూ కనపిస్తుంది. ఎక్కడి గ్లామర్ ఫీల్డ్? ఎక్కడి వేదాంతం!!

‘‘మీరిప్పుడు వేదాంత పుస్తకాలు రాస్తున్నారట కదా’’ అని ఆ మాజీ తార అడిగితే - ‘‘నువ్విప్పుడు వేదాంతం చదువుతున్నట్లే’’ అని చెబుతాడు సుబ్బారావు స్నేహితుడు. కొద్దిసేపటి తరువాత వచ్చిన విషయంలోకి దిగుతాడు.
‘‘నువ్వు అంత అకస్మాత్తుగా సినిమాల్ని వదిలి వచ్చేశావు. వేదాంతమా?’’ అని అడుగుతాడు.
‘‘వేదాంతం కాదుగానీ, చాలా వరకు విరక్తి’’ అంటుంది సూరమ్మ. ఆ విరక్తి రహస్యమేమిటో మాత్రం అప్పుడు చెప్పదు. మెల్లిగా కదిలే సంభాషణల్లో ఒక చోట చెబుతుంది ఇలా:

‘‘సంసారం, బంధువులు, స్నేహితులూ అందరూ డబ్బు కోసం ఆశ్రయించేవారే. మొగవాళ్లకి ఫరవాలేదనుకుంటాను. స్ర్తీకి మాత్రం తక్కిన స్ర్తీలూ విరోధులే. అందం ఉన్న తారకి ఆ అందం వల్లనే విరోధులు, మిత్రులూ. అందం లేని నా బోటి దానికి అదీ లేదు’’.

శమంతకమణి ఎలియాస్ సూరమ్మ అశాంతి, ఒంటరితనం, ఆత్మ నలిగిన చప్పుడు కేవలం చలం కథ మాత్రమేనా? హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్... గుర్తుకు తెచ్చుకుందాం ఒక్కసారి....శమంతకమణిగా మారిన సూరమ్మలు, సూరమ్మగా మారిన శమంతకమణులు!!

Thursday, September 30, 2010

చిరు కవితలు

మా ఊరికి విమానమొచ్చింది
నిన్నే కూలిపడింది మరి!

మా చెరువుకు స్నేహాలెక్కువ
ఊళ్లోని మురుగు దారులన్నీ దానివైపే!

మా సర్పంచ్ చాలా పొదుపరి
ప్రభుత్వ డబ్బు అసలు ఖర్చేపెట్టడు!

వాడు మంచి ఆర్టిస్టు
భార్యను ఇట్టే నమ్మించేస్తాడు.

గోదావరి ఒంటరయ్యింది
పుష్కరాలు అయిపోయాయిగా.

కుండ గుండె పగిలింది
ఫ్రిజ్‌ను చూసి.

నేనూ గొప్ప పాటగాడ్నే
వినేవారుంటే!

మా తాతా చిన్నపిల్లాడే
పళ్లు లేవుగా!

ముందు దాని కడుపులో
పడితేగాని మనకు టీ దొరకదు
టీకప్పు!

చేతిదెంత ఉదారగుణం
తాను తినకుండా
నోటికందిస్తోంది ఆహారం.

గాలి - నీటి వైరం
తుపాను!

ఆకాశవాణి కన్నా
టేప్ రికార్డరే బెస్టు
మాట వింటుంది!

దుఃఖానికి ఫ్రమ్ అడ్రస్
దురాశ!

చెట్టుకాండం కట్టుకుంది
బెరడనే పట్టు చీరని!

- వి.ప్రభాకర్