Monday, May 30, 2011

జానపద ఉద్యమానికి తెర తీస్తున్న స్నేహలత

పాటల పొదరిల్లు

చిన్ని శిశువుకు జోలపాట, కాస్త పెద్దయ్యాక లాలిపాట, తర్వాత పెళ్లి పాట, పండుగంటే పాట, నలుగురు కలిస్తే పాట... తెలుగునాట ప్రతి సందర్భమూ పాటతో ముడిపడి ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ సంస్కృతి వెనకబాట పట్టినా ఇప్పుడు మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. స్త్రీల పాటలు, జానపదాలను సేకరించడమే కాకుండా, చక్కని స్వరంతో అభినయంతో వాటిని పడుతూ పదిమందికీ చేరువచేస్తున్న కళాకారిణి స్నేహలత. ఆ పనిలో ఆమె లీనమయ్యే తీరూ, వ్యక్తీకరణలోని ఎనర్జీ... కళ్లు తిప్పనివ్వవు. వ్యవహారిక భాషోద్యమాన్ని ముందుండి నడిపించిన గిడుగు రామ్మూర్తి మునిమనవరాలైనందుకు ఆ స్ఫూర్తిని కూడా అందిపుచ్చుకుని ఒక జానపద ఉద్యమానికి తెర తీస్తున్న స్నేహలత పంచుకున్న విశేషాలు.
http://www.hindu.com/mp/2009/02/14/images/2009021452880901.jpg
"సమాజం కూడా నిస్తేజంగా మారిపోయినట్టనిపించింది. సంగీత సాంస్కృతిక అంశాలనెవరూ పట్టించుకునేవారే లేకపోయారు. సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకున్నవారే కాదు, హాయిగా గొంతెత్తి చక్కగా ఏ పాట పాడగలిగేవారికైనా శ్రోతలు లేకుండా పోయారు. మీరు గమనిస్తే ఆ స్థితి దాదాపు ఇరవయ్యేళ్లు కొనసాగింది. తర్వాత ప్రైవేటు ఛానెళ్లు పాటల కార్యక్రమాలు పెట్టడం, అవి నెమ్మదిగా ఊపందుకుని సీరియళ్లను మించి ప్రేక్షకాదరణ పొందడం మొదలయ్యాక మళ్లీ సంగీత రంగంలో కదలిక వచ్చింది..''

"హైదరాబాద్ ఇప్పుడున్నట్టు ఉక్కిరిబిక్కిరి చేసేది కాదు. మేముండే సరూర్‌నగర్ ఒక పల్లెటూరు. ఆకుకూరలు కావాలంటే అప్పటికప్పుడు కోసుకురావడం, చింతచెట్ల నీడల్లో బాగా ఆడుకుని సాయంత్రం కాగానే పిల్లలంతా చేరి మూసీ నది ఒడ్డున స్నానాలు చేసి రావడం - ఇలా ఉండేది. మా నాన్న గిడుగు రాజేశ్వర్రావు, అమ్మ సీతలది ప్రేమ వివాహం కావడంతో మాకు బంధువుల కన్నా మిత్రుల స్నేహమే ఎక్కువ. దాంతో చుట్టుపక్కల ఉండే పల్లెపడుచులతోనే ఆటపాటలన్నీ.

అలా ఇక్కడి జానపదం నాకు తొలిగా చిన్నవయసులోనే పరిచయమైంది. వదినామరదళ్ల హాస్యాలు, బతుకమ్మ పాటలు మా అమ్మ గిడుగు సీత బాగా పాడేది. మద్రాసులో ఉండగా సినిమాల్లోనూ నటించింది. ఇంట్లో ఎప్పుడూ ఆమె నోటిలో పాటలు నానుతూ ఉండేవి. దాంతో నాకూ అదే అలవాటయింది. తర్వాత నేను గాత్రమూ వీణా నేర్చుకోవడానికి గురువుల దగ్గర చేరాను. అదిగాక చిన్నప్పటి నుంచే నాన్న పాటలకు రాగాలు కడుతూ, వాటిని పాడటమూ ఒక సరదాగా ఉండేది. ముఖ్యంగా మా పనమ్మాయి ఊర్మిళ. నన్ను తీసుకుని ఒగ్గు కథలకూ బతుకమ్మ ఆటలకూ తీసుకెళ్లేది...'' అంటూ తన సంగీత నేపథ్యాన్ని చెప్పుకొచ్చారు స్నేహలత.

బతుకమ్మ బతకాలి...

ఊర్మిళ పల్లెపడుచే కావొచ్చు. ఆమె నింపిన స్ఫూర్తి స్నేహలతలో అణువణువునా నిండిపోయింది. రంగురంగుల బతుకమ్మ, రకరకాల పాటలు ఆమెను ఆకర్షించాయి. దాంతోనే బతుకమ్మ పాటల సేకరించి, వాటి నేపథ్యాలనూ తెలుసుకున్నారు. అయితే వాటిని జనంలోకి తీసుకెళ్లడం పెద్ద సమస్య అయి కూచుంది. "టీవీలో, రేడియోలో ఎక్కడయినా బతుకమ్మ పాటలు పాడదామంటే ఎవరూ కలిసొచ్చేవాళ్లు కాదు. వాటిని పాడటం ఏమిటని ఆశ్చర్యపోయేవారు.

ఒకావిడయితే రికార్డింగ్ వరకూ వచ్చాక 'ఇలాంటి పాటలు మా ఆయన పాడొద్దన్నారండీ' అనేసి వెళ్లిపోయింది. ఇప్పటికీ కొందరిలో అలాంటి భావన ఉన్నా నెమ్మదిగా మార్పు వస్తుంది. బతుకమ్మ బతుకు కోరే తల్లి. ప్రకృతిలో పుట్టి మనల్ని నడిపించి పకృతిలో లీనమయ్యే శక్తి. బతుకమ్మ ఆటలో పేదాగొప్పా పిల్లా ముసలీ తేడాలేం లేవు. కులమతాల పట్టింపు లేదు. అంత గొప్ప సంస్కృతిని ఒంటపట్టించుకుని అందరికీ తెలియజెప్పాలనేదే నా లక్ష్యం. అందువల్లే డీడీ రోజుల నుంచీ నేను బతుకమ్మ పాటల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను...'' అని చెప్పుకొచ్చారు స్నేహలత.

ఒక్క స్వరమూ వినిపించలేదు...

"ఒక దశలో దూరదర్శన్ ప్రాభవం వెనుకబట్టింది. కొత్తగా వచ్చిన ఛానెళ్లు - అయితే వార్తలకూ లేదంటే సీరియళ్లకూ పెద్దపీట వేశాయి కళారూపాలకూ సంగీత కార్యక్రమాలకూ చోటు కల్పించలేదు. అప్పుడు సమాజం కూడా నిస్తేజంగా మారిపోయినట్టనిపించింది. సంగీత సాంస్కృతిక అంశాలనెవరూ పట్టించుకునేవారే లేకపోయారు. సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకున్నవారే కాదు, హాయిగా గొంతెత్తి చక్కగా ఏ పాట పాడగలిగేవారికైనా శ్రోతలు లేకుండా పోయారు. తమ విద్యను ప్రదర్శించడానికి వేదికలే ఉండేవి కాదు. మీరు గమనిస్తే ఆ స్థితి దాదాపు ఇరవయ్యేళ్లు కొనసాగింది. తర్వాత ప్రైవేటు ఛానెళ్లు పాటల కార్యక్రమాలు పెట్టడం, అవి నెమ్మదిగా ఊపందుకుని సీరియళ్లను మించి ప్రేక్షకాదరణ పొందడం మొదలయ్యాక మళ్లీ సంగీత రంగంలో ఒక కదలిక వచ్చింది...'' అంటూ విశ్లేషించారు స్నేహలత. వసంతం వచ్చేవరకూ కోయిల గొంతు వినిపించదు.

ఎక్కడో దాక్కుని నిశ్శబ్దంగా సాధన చేస్తుంది. స్నేహలత కూడా ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. కొన్నేళ్లపాటు కుటుంబానికే పూర్తి సమయం కేటాయించారు. "అలాగని ఖాళీగా ఉన్నాననుకుంటే పొరపాటే. పాటలకు రాగాలు కట్టడం, నాలో నేనే పాడుకోవడం. మా అమ్మాయి మాధవీలతకు నేర్పించడం. ఇదిగాక ఏ శుభకార్యాలు జరిగినా, బంధుమిత్రులను కలిసినా వాళ్లకు తెలిసిన పాటలను రాసుకునేదాన్ని. వారెలా పాడతారో గమనించి అవసరమైతే మార్పుచేర్పులు చేసుకునేదాన్ని. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏయే సందర్భాల్లో ఏమేం పాడతారో తెలుసుకున్నాను. ఒకేపాటను మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా పాడేవీ ఉన్నాయి. ఆ తేడాలను తెలుసుకున్నాను. ఇదంతా వ్యక్తిగత తృప్తి, అధ్యయనాల కోసం చేసినవే...'' అన్న స్నేహలత ఆ కాలంలో మూడొందలకు పైగా పాటలు సేకరించారు.

సంగీత బృందం

ఆవిడ అనుకోలేదుగానీ, తర్వాత కాలం మారింది. సంప్రదాయం, జానపదం, ఆధ్యాత్మికం... ఏదైనాసరే, పాడేవారికి మంచి రోజులొచ్చాయి. టీవీ ఛానెళ్లే కాదు, ప్రైవేటు కార్యక్రమాల్లోనూ పాటకే పెద్ద పీట వేస్తున్నారు. నేటి ఈ ధోరణిని అందిపుచ్చుకుని స్నేహలత తనకో బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సందర్భానుసారం బతుకమ్మ పాటలను వ్యాప్తిచేస్తున్నారు. శుభకార్యాల్లో ప్రదర్శనలివ్వడం ప్రారంభించారు. "ఇప్పుడు 'సంగీత్' అని పెళ్లి వేడుకలకు రెండు రోజుల ముందే మొదలవుతున్నాయి. సినిమా పాటల ఆర్కెస్ట్రా, డీజేలకు బదులు కొందరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అసలు మన పెళ్లిళ్లలో ఎన్ని పాటలో. ముహూర్తం పెట్టి పసుపు దంచింది మొదలు, నలుగు పాట, విడిది పాట, వియ్యపురాలి పాట, భోజనం బంతి పాట, పూలచెండ్ల పాట, అప్పగింతల పాట... ప్రతి సందర్భానికీ పాటలేపాటలు...'' అంటున్న స్నేహలత తన కార్యక్రమంలో కేవలం వాటిని పాడేసి ఊరుకోరు.

పాటల సమయసందర్భాలను, వాటిలోని సాహిత్యాన్నీ అందాన్నీ పరిచయం చే స్తూ జనరంజకంగా సాగుతుందామె కార్యక్రమం. "మొదట్లో పెద్దలే ఎక్కువగా ఆనందించేవారు. యువత రాన్ని ఆకట్టుకోకపోతే ఈ పాటలు భవిష్యత్ తరాలకు ప్రవహించవని అర్థమయింది. అందువల్ల పెళ్ళిళ్లకు వెళ్లినప్పుడు వాళ్లతో మాట కలుపుతాను. పాటలకు అనుగుణంగా అప్పటికప్పుడు వాళ్లతో చిందేయిస్తాన''ని చెబుతున్న స్నేహలత తానూ పాదం కలిపి పదం పాడతారు. మామూలుగా ఈ కార్యక్రమం పెళ్లివారందరూ కొత్తాపాతా తేడా లేకుండా కలిసిపోవడానికి, యంగ్ తరంగాలకు జోష్‌నందించడానికే అయినా దానికి మించిన గొప్ప ప్రయోజనాన్ని సాధిస్తున్నారామె. ఏదైనా విజయవంతమయిందనడానికి సూచిక దానికి అనుకరణలు రావడమే. ఇప్పుడు స్నేహలతలాగే 'పెళ్లి పాటలు పాడతాం' అంటూ మరో పాతిక బృందాలు తయారయ్యాయంటే ఆమె ప్రయోగం విజయవంతమైనట్టే. "నేనా మరొకరా అని కాదు. పాటలు పదిమందికి చేరాయా లేదా అన్నదే ముఖ్యం. అలా ఆలోచించినప్పుడు ఈ పాతిక బృందాలూ నాకు పోటీ అనిపించవు...' అని హుందాగా చెబుతున్న ఆమె తీరు గొప్పగా అనిపిస్తుంది.

Thursday, May 19, 2011

అశేష కీర్తి గిరి చిత్రాలు * కొండపల్లి శేషగిరిరావు

seshagiri_pic3
కొండపల్లి బొమ్మలు ఈ తరం వారికి కొత్తేమోగానీ పాతతరం వాళ్ల ఇళ్లల్లో కొలువుతీరి ఉంటాయి ఆ కొయ్యబొమ్మలు. ప్రత్యేకించి బొమ్మల కొలువుల్లో కొండపల్లి బొమ్మలు ఉండితీరాల్సిందే. అంతలా ప్రాచుర్యం పొందిన కొండపల్లి బొమ్మలు చూడటానికి అచ్చం కొండపల్లి శేషగిరిరావు గీసిన బొమ్మల్లానే ఉంటాయి. అంతలా జీవకళ ఉట్టిపడుతుంటుంది శేషగిరిరావుగారి కళాత్మక చిత్రాలలో. ఆదరణ కరవై కొండపల్లి బొమ్మలకు గిరాకీ తగ్గిందిగానీ అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రం తగ్గవు కొండపల్లి బొమ్మలు. అంతగా గుర్తుకుతెచ్చే కొండపల్లినే ఇంటిపేరుగా చేసుకుని శేషగిరిరావు అనే ప్రసిద్ధ చిత్రకారుడు తన విశేష పేరుప్రతిష్టలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేయక యావత్‌ భారతావని మెచ్చే స్థాయికి వ్యాప్తిచెందడమంటే అంత తేలికైన విషయం కాదు. ఎనిమిది పదుల వయసులోనూ వన్నెతగ్గని కళాఖండాలను ఎంతో సృజనాత్మకంగా తీర్చిదిద్దుతుంటారు ఆయన. ఇంటిపేరు కొండపల్లి అయినా శేషగిరిరావు పుట్టింది మాత్రం తెలంగాణకే తలమానికమైన పోరుగడ్డ వరంగల్‌ జిల్లాలోని పెనుగొండలో 1924 సంవత్సరంలో జన్మించారు. పెనుగొండలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసి వరంగల్‌ ప్రాంతంలో ఉన్నత విద్యను అభ్యసించారు ఆయన.

seshagiri_pic 

లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్రా : పౌరాణిక, దృశ్య కావ్య నాయకానాయికలను, మనసుకు హత్తుకుపోయే వివిధ సుందర దృశ్యాలను మనోహరంగా చిత్రించడమేకాక కుడ్య చిత్రలేఖనంలో కూడా శేషగిరిరావుకు సాటి ఆయనే అనిపించుకొన్నారు. కొండపల్లి వేసిన బొమ్మలు పరోక్షంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్ర’ అనే అతి బృహత్తర చిత్రం అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో వేదిల మీద మనకు కనిపిస్తుంటాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వాటిని చూడటం తటస్తించివుంటుంది. కాకపోతే చాలామందికి ఆయన పేరు మాత్రం తెలియదు. టీవీ ఛానల్స్‌, వార్తాపత్రికల ద్వారా, మీడియా ద్వారా రాష్ట్రంలోని ప్రజలు ఏదో ఓ సందర్భంలో ఆ చిత్రాన్ని తిలకించి ఉంటారు.అయితే ఆ చిత్రం ‘కొండపల్లి’ శేషగిరిరావుదే అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియనే తెలియదు.

seshagiri_pic1 

సైన్స్‌ మాస్టార్‌ స్ఫూర్తి : కోటిరత్నాల వీణ తెలంగాణలో వేయిస్తంభాల గుడి, అరుదైన చారిత్రక కళాసంపదను చాటుతున్న వరంగల్‌ ప్రాంతంలో జన్మించిన కొండపల్లి శేషగిరిరావు చిన్నతనంలోనే సామాన్యశాస్త్రంలో గీయవలసిన బొమ్మల్ని తన పాఠ్యపుస్త్తకంలో ఉన్నదానికన్నా ఎంతో అందంగా చిత్రించేవారు. చిన్నతనంలోనే కొండపల్లి శేషగిరిరావులో ఉన్న సృజనాత్మకతను పరిశీలించిన ఆ పాఠశాల డ్రాయింగ్‌ మాస్టర్‌ అయిన దీనదయాళ్‌ ఆనాడే కొండపల్లి గొప్ప కళాకారుడవుతాడని గ్రహించారు. దీంతో కొండపల్లి కళాచతురతను ప్రప్రథమంగా ఆ పాఠశాల డ్రాయింగ్‌ టీచరు దీనదయాళ్‌ గుర్తించారు. పెన్సిల్‌తో ఏ రేఖలు ఎలా గీయాలో, కుంచెతో ఏ రేఖల్లో జీవం ఎలా నింపాలో దీనదయాళ్‌ సార్‌ మన కొండపల్లికి నేర్ఫారు. చుట్టూ వ్యాపించి ఉన్న కళాసంపద ఆయన కళాభిమానాన్ని తట్టిలేపింది. వేయిస్తంభాల గుడిలోని ప్రతిస్తంభం ఆయనకు రోజుకో పాఠం చెప్ఫింది. రామప్ఫ గుడి ఆయన్ని తన హృదయాంతరాలలో నింపుకుంది. ఆ గుడిలోని శిల్ప సౌందర్యం..శిల్పక్షేత్రాల శిల్ఫకళా సొగసులను సుదీర్ఘ, సునిశిత అధ్యయనంతో తన సొంతం చేసుకొన్న కొండపల్లి వాటినుంచి స్ఫూర్తిపొంది కొన్నివందల చిత్రాలతో ఆ శిల్ఫకళకు దర్ఫణం పట్టారు. శిల్ఫుల మనోగతాల్ని, వారి అభిరుచిలో తొంగిచూసిన ప్రత్యేకతల్ని, విశిష్టతల్ని తాను అవగతం చేసుకోవడమే కాక ప్రజాబాహుళ్యానికి చాటే ప్రయత్నం చేశారు.

seshagiri_pic2 

వరంగల్‌లో విద్యాభ్యాసం, చిత్రకళాభ్యాసం తర్వాత ఆయన హైదరాబాద్‌కు చేరుకొన్నారు. హైదరాబాద్‌ చిత్రకళాశాలలో డిప్లొమా పొందారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే ఆయనకి నవాజ్‌ మిహిది నవాజ్‌తో పరిచయం కలిగింది. కొండపల్లి చిత్రకళా ప్రతిభ గుర్తించిన నవాజ్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినిేకతనంలో అధునాతన చిత్రకళా రీతుల్ని అధ్యయనం చేయడంవల్ల తగిన ఫలితం ఉంటుందని సూచించి, సహకరించడంతో కొండపల్లి ‘శాంతినిేకతన్‌’లో ప్రవేశించారు. సర్వకళలకు పుట్టినిల్లయిన శాంతినిేకతన్‌లో అప్పుడు నంద్‌లాల్‌బోస్‌ చిత్రకళా విభాగంలో ఉండేవారు. ఆయన కొండపల్లి కళాప్రతిభని గుర్తించారు. పాటించాల్సిన జాగ్రత్తలేమిటో నేర్ఫారు. ఆయన నేర్ఫిన మెలకువలతో కొండపల్లి ప్రతిభ బాగా వికసించింది. అక్కడే ‘కుడ్య’ చిత్రలేఖనంలో కూడా కొండపల్లి ప్రత్యేక శిక్షణ పొందారు. 1950లో హైదరాబాద్‌లో చిత్ర కళాపోటీలు భారీఎత్తున జరిగాయి. అఖిలభారత స్థాయిలో జరిగిన ఆ పోటీల్లో కొండపల్లి చిత్రం ప్రథమ బహుమతి సొంతం చేసుకొంది. ఆ సభలో పాల్గొన్న అప్ఫటి మంత్రి, కొండపల్లి చిత్రాన్ని ప్రశంసించడమే కాక హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌‌స అండ్‌ క్రాఫ్ట్‌‌సలో అధ్యాపకుడిగా కొండపల్లి శేషగిరిరావు పేరును ప్రతిపాదించారు.

అలా ఉద్యోగం చేపట్టిన కొండపల్లి శేషగిరిరావు ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. ఆయన కళాత్మకత రాజకీయ నాయకులను విశేషంగా ఆకట్టుకోవడంతో హైదరాబాద్‌, బెంగళూరు, భావనగర్‌లలో జరిగిన ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలకు ద్వారాలు, వేదిక రూపకల్ఫన బాధ్యతలు కొండపలిే్లక అప్ఫగించారు. అవి అప్ఫటి ప్రధానమంత్రుల అభినందనలు అందుకొన్నాయి. అప్ఫటి ప్రభుత్వం చొరవతోనే ఆయన ‘‘లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్ర’’ అనే బృహత్తర చిత్రాన్ని చిత్రించారు. అది అనేక పర్యాయాలు రవీంద్రభారతి, తెలుగు లలిత కళాతోరణం వంటి వేదికల మీద జరిగిన కార్యక్రమాల్లో ప్రదర్శితమై ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఆయన ఉపాధ్యాయుడిగానే మిగిలిపోకుండా చిత్రకళా విస్తృతికి తానెంతో కృషిచేశారు. పత్రికల్లో విరివిగా వ్యాసాలు రాశారు. చిత్రకళకు సంబంధించిన దాని అనుబంధ కళలపై ఎన్నో గ్రంథాలు కూడా రాశారు. 1982లో ఉద్యోగ విరమణ అనంతరం కూడా తన దగ్గరకొచ్చే వారిని నిరాశపరచక మెలకువలన్నీ నేర్ఫారు. 1987 మే ఆరో తేదీన హైదరాబాద్‌లో ‘మాడపాటి సుకుమార్‌’ అవార్డు అందుకొన్న కొండపల్లి చిత్రకళా సాధన, బోధనల్లో ‘కొండపల్లి బొమ్మలంత’ సుస్థిర కీర్తిప్రతిష్టలను పొందారు.

మాస్కో, లండన్‌, అమెరికా దేశాలలో శేషగిరిరావు చిత్రాల ఆర్ట్‌ ఎగ్జిబిషన్లు జరిగాయి. లలిత కళా అకాడమీ ఫెలోషిప్‌ పొందిన శేషగిరిరావు తన జీవిత ధ్యేయం పౌరాణిక చిఙత్రాలను ఎంతో హృద్యంగా చిత్రీకరించడమేనంటారు. కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలానికి సంబంధించిన సుమనోహర చిత్రాలు శేషగిరిరావుకు ఎంతగానో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

-నండూరి రవిశంకర్‌

ముచ్చటగొలిపే ముప్పిడి చిత్రాలు

అతనొక ఉపాధ్యాయుడు...సృజనాత్మకత కలిగివున్న సామాజిక చిత్రకారుడు కూడా...మారుమూల కుగ్రామంలో ముదిరాజ్‌ కులంలో జన్మించి పల్లెటూరి జీవన విధానంపై అందమైన చిత్రాలను వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న అద్భుత చిత్రకారుడు అతడు. పేరు ముప్పిడి విఠల్‌. చిన్నతనం నుంచి అతని కళ్లముందు ఉట్టిపడే పల్లెల ప్రకృతి అందాలే ఆయనకు స్ఫూర్తిదాయకమయ్యారు. మెదక్‌ జిల్లాలోని కంగ్డిలోని తడ్కల్‌ గ్రామంలో ఒక నిరుపేద గ్రామంలో జన్మించారు విఠల్‌.

mupidi-pic 

పదవతరగతి వరకు స్వగ్రామంలోనే విద్యనభ్యసించిన విఠల్‌ ఇంటర్మీడియట్‌ నిజామాబాద్‌ జిల్లా బిచ్కుందలో పూర్తిచేశారు. తండ్రి లక్ష్మయ్య, తల్లి నాగమ్మ. నలుగురు సంతానంలో రెండవ సంతానం విఠల్‌. 1995లో సావిత్రితో వివాహం జరిగింది. ముగ్గురు ఆడపిల్లలు. వారిలో ఇద్దరు మంచి ఆర్టిస్టులుగా ఎదుగుతై తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు.

రైతుకుటుంబం నుంచి వచ్చిన విఠల్‌ పేదరికం అనుభవించినప్పటికీ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ సాగారు. వివేకవర్ధిని డిగ్రీకాలేజీలో చదువు సాగిస్తూ ఉదయం పార్ట్‌టైమ్‌ జాబ్‌ కింద పెయింటింగ్స్‌ వేస్తూ తన సొంతకాళ్లమీద నిలబడి ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తిచేశారు. డిగ్రీ సెకండియర్‌ నుంచి ఫైన్‌ ఆర్ట్‌‌సలో మారి (పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ) బి.ఎఫ్‌.ఏ. పూర్తిచేసారు. అనేక ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసి ప్రస్తుతం ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నారు. చిన్ననాటినుంచి ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కృషిచేసి తన కుంచె నుంచి జాలువారిన అపురూప చిత్రాలు అశేష జనాదరణను పొందాయి. నిజానికి విఠల్‌కు స్ఫూర్తిగా నిలచినది కిషన్‌ మహరాజ్‌. ఆయన విఠల్‌ చదివిన హైస్కూల్‌కు హెడ్‌మాస్టర్‌గా ఉండేవారు. చిన్నతనం నుంచి విఠల్‌లో దాగివున్న సృజనాత్మకతను మొట్టమొదటిసారిగా గ్రహించి ఎంతగానో ప్రోత్సహించేవారు. అలాగే పోచాపూర్‌ మెగలప్ప అనే మరో ఉపాధ్యాయుడు విఠల్‌ను ఆర్టిస్టుగా ఎదిగేందుకు పరోక్షంగా ప్రోత్సహించారు. ఒకరకంగా ఈ ఇద్దరు ఉపాధ్యాయ గురువులు తన జీవితానికి మార్గదర్శకులయ్యారు అంటారు విఠల్‌.
గ్రామీణ వాతావరణాన్ని మన కళ్లకు కట్టినట్లుగా చిత్రాలు వేయడంలో ఎంతో దిట్ట విఠల్‌. 1994 సంవత్సరంలో హైదరాబాద్‌లోని జాంబాగ్‌ వద్ద గల వివేకవర్ధిని కళాశాలలో విఠల్‌ వేసిన వివేకానంద చిత్రపటానికి గాను కళాశాల యాజమాన్యం మెచ్చుకోలుగా కళాశాల తరపున బెస్ట్‌ అవార్డును అందజేసింది. 1995లో తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్విహంచిన సౌత్‌ జోన్‌ చిత్రలేఖనం పోటీలలో రజిత పథకాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే 1997లో నిర్వహించిన జన్మభూమి చిత్రలేఖనం పోటీల్లో రాష్టస్థ్రాయిలో మూడవ బహుమతిని అప్పటి లోక్‌సభ స్పీకర్‌ జి.ఎం.సి.బాలయోగి చేతులమీదుగా అందుకున్నారు.
ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం పట్టిపీడిస్తున్న సమస్య. ఇటివంటి కాలుష్యాన్ని నివారించేందుకు తన చిత్రాల ద్వారా నేటి తరం విద్యార్థులలో చైతన్యం కలగజేసేందుకు కృషిచేస్తున్నారు. ఆ దిశగా కృషిచేస్తూ తన పెయింటింగ్‌ ఎగ్జిబిషన్ల ద్వారా అనేక మందికి మార్గదర్శనం చేస్తున్నారు.

mupidi-pic1 

బహుమతులు: 1998 సంవత్సరంలో నిర్వహించిన అంతర్‌ విశ్వవిద్యాలయం చిత్రలేఖనం పోటీలలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దాశరథి రంగాచార్య చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం జరిగింది. అలాగే 2000 సంవత్సరంలో జరిగిన ముదిరాజ్‌ మహాసభల్లో విఠల్‌ వేసిన కార్గిల్‌ వార్‌ చిత్రాలకుగాను బంగారు పతకం లభించింది. అప్పట్లో దేశభక్తిని పెంపొందించే ఆ చిత్రాలతో ఒక పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ కార్యక్రమం జరిపిద్దామనుకున్నారు విఠల్‌. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఆ కార్యక్రమం రూపుదిద్దుకోలేక పోయింది. అన్నీ కలిసొస్తే తొందరలోనే ఆ దేశభక్తిని రూపొందించే పెయింటింగ్స్‌తో ఒక పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ను నిర్వహించాలనేది ఆయన ఆశయం. 2002 డిసెంబర్‌ 31న శబరిమలైలోని దృశ్యాలను చూసి వాటిని కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించినందుకుగాను శ్రీరాం ఇంటీరియర్స్‌ వారు బంగారు ఉంగరంతో ఘనంగా సత్కరించారు. అలాగే తన సొంత ఊరైన తడ్కల్‌లో అప్పటి దొరగారి కోట చిత్రాన్ని వేసి పోటీలకు పంపించారు విఠల్‌. ఈ చిత్రం రాష్టస్థ్రాయిలోనే చిత్రకళా ప్రదర్శనకు ఎంపికయింది. తన సొంత ఊరిలోని కోటను తన చేత్తో గీసుకుని ఎంతో తృప్తిని పొందానంటారు ఆయన.

mupidi-pic2 

ఆశయం: కాంటెంపరరీ ఆర్టిస్టుగా ఎదగాలని ఆకాంక్ష. ఇతర దేశాలలో కూడా మన దేశ ప్రతిష్ట ఇనుమడింపజేసేలా ఉండాలని నా ఆశయం. మారుమూల పల్లె వాతావరణం ప్రపంచవ్యాప్తం కావాలని...అన్ని దేశాలలో కూడా ప్రత్యేకించి మన పల్లెవాతావరణం ఇనుమడింపజేయాలనేదే తన ఆశయం అంటారు విఠల్‌.

పిల్లలకు అవగాహన: చిన్నారుల్లో దాగివున్న సృజనాత్మకత శక్తిని వెలికితీస్తూ ...వారిని చిత్రకారులుగా తీర్చిదిద్దుతూ చిత్రలేఖనంలో వారికి ప్రోత్సాహం అందించేందుకుగాను 1999లో హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌లో ముప్పిడి ఆర్ట్‌‌స గ్యాలరీని విఠల్‌ ప్రారంభించారు. ప్రతిసంవత్సరం వేసవికాలంలో చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ఆయన. తను పుట్టిపెరిగిన ప్రాంతపు పల్లె పొలాల స్థితిగతులే తన చిత్రాలకు ప్రేరణలంటారు విఠల్‌. అక్కడి ఎండిపోయిన చెరువులు, బీడులువారిన భూములు, ఎండిపోయిన పిల్లకాలవలు, పల్లె ప్రాంతంలో జనజీవన స్థితిగతులు...తన సొంత పొలం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలలో చూసిన దృశ్యాలనే తన పెయింటింగ్స్‌కు స్ఫూర్తిదాయకంగా పనికొచ్చాయంటారు విఠల్‌. నేటి తరం విద్యార్థులు కూడా పల్లె ప్రాంతాలను అలక్ష్యం చేయకుండా...పూర్తిగా సిటీ జీవనానికే అలవాటుపడకుండా అక్కడి ప్రాంతాలను కూడా సందర్శించాలంటారు విఠల్‌. అలాగే నేడు ప్రతి పాఠశాలలోనూ ఒక చిత్రలేఖనం నేర్పించే ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలంటారు విఠల్‌. పిల్లలకు కేవలం చదువు ఒక్కటే పరమావధికాదని...చదువుతో పాటు ఇలా ఏదో ఒక కళమీద వ్యాపకం చాలా మంచిదని...ప్రస్తుత విద్యావిధానంలో అది లోపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు విఠల్‌. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు చిత్రకారులుగా మలిచే ఉపాధ్యాయులను నియమించాలంటారు. అలాగే తన సొంత మండలంలో ఒక వృద్ధ ఆశ్రమాన్ని నెలకొల్పాలనేది ఆయన ఆశయం అంటారు.

-నండూరి రవిశంకర్‌