Sunday, January 23, 2011

టీవీల్లో చేస్తే మర్యాద .... మేం చేస్తే అమర్యాదా .. ?

ఇన్నేళ్ల తరువాత మీరెరిగిన జీవితం ఎలా వుందని ఆమెని ప్రశ్నిస్తే? తడుముకోకుండా 'ముళ్లకంప భోగం' అని సమాధానమిచ్చారు. దానిని మరింత వివరంగా చెబుతూ'ముళ్లకంపలో చిక్కుకుంటే రక్తాలు కారతాయండీ. భరించలేని బాధ పెడుతుందండీ. అలాగని చావు కూడా రాదండీ. భరించాలండీ' అంటారు. ఆరుతరాల కళావంతుల కుటుంబ వారసత్వంలో గొల్లకలాపం, భామా కలాపాలు తెలిసిన ఆఖరి కళాకారిణి అన్నాబత్తుల లక్ష్మీ మంగతాయారు. కలాప సంప్రదాయాలపై హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్జాతీయసదస్సుకు ఆమె హాజరయ్యారు. కలాపాలు నేర్చుకున్న తీరు నుంచి సమాజంలో భోగంఆటలు రద్దుచేశాక మారిన పరిస్థితుల వరకు చాలా విషయాలపై మాట్లాడారు...

మాది తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని ఉమ్మిడివరం గ్రామం. అక్కడి ఉమాసూరేశ్వరస్వామి ఆలయంలో మా వాళ్లంతా ఆలయ నర్తకీమణులు. అందులో ఆరుతరాల వారసత్వం మాది. మా అమ్మమ్మ బుల్లివేంకటరత్నం చనిపోయేవరకు ఆ దేవుని సేవలోనే వున్నారు. అప్పట్లో అలా సేవలో వుండేవారిని పెద్ద బుల్లి, చిన్న బుల్లి అని పిలిచేవారు. ఆమె దగ్గరి నుంచి మా అమ్మ అన్నాబత్తుల సత్యభామ వెంగమాంబ రాసిన గొల్లకలాపాన్ని నేర్చుకున్నారు. దీంతోపాటు భామాకలాపం అభ్యసించారు.

అప్పట్లో ఏటా ఐదురోజులు సూరేశ్వరస్వామి కల్యాణోత్సవం జరిగేది. ఐదు రోజులూ కార్యక్రమాలు వుండేవి. కుంభహారతి, పుష్పవర్ణం మా అమ్మమ్మ జరిపేది. స్వామి రథోత్సవంలో కళావంతుల కార్యక్రమాలు వుండేవి. రథానికి ముందు మందబయలు ఏర్పాటు చేసేవారు. కాగడాలతో అందరూ చుట్టూ నిల్చుంటే క్షేత్రయ్య పదాల నుంచి జావళీల వరకు అన్నిటినీ ప్రదర్శించడం ఆనవాయితీ. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం. వాటిల్లోనే గొల్లకలాపం, భామా కలాపం వుండేవి. దేవుని మాన్యంలో దాదాపు వంద కళావంతుల కుటుంబాలకు 25 ఎకరాలు ఇచ్చారు. అప్పుడు చాకలిమాన్యం, మంగలి మాన్యం కూడా వుండేవి. తరువాత కాలంలో దేవదాసి వ్యవస్థను రద్దుచేశాక భూస్వాములు, పెత్తందారులు వాటిని అమ్మించేసి తామే కొనుక్కున్నారు. కళావంతుల పరిస్థితి దారుణమైపోయింది.

సూర్యుడు మేల్కొన్న రోజులు...
కలాపాలను నేర్చుకోవడానికి కఠోర శ్రమ చేయాల్సిందే. మా అమ్మే నా గురువు. ఆమె మమ్మల్ని వేకువజామున నిద్రలేపేవారు. దానికి సమయం ఏమీ లేదు. పడుకున్న తరువాత ఏ జామున మెలకువ వస్త్తే అప్పటి నుంచి అభ్యాసం జరగాల్సిందే. శరీరానికి పూర్తిగా తైలం రాసేవారు. ఒక్కోసారి తైలం పూతకే గంట పట్టేది. ఆ తరువాత మొగ్గలు వేయించేవారు. దేహం రాటుదేలాలి మరి. గట్టిపడాలి. పురుషుని సామర్థ్యానికి సమానం కావాలి. దాదాపు మూడు గంటలకు పైగా ప్రదర్శనలివ్వాలి. ఒక్కోసారి రాత్రంతా కార్యక్రమాలు వుంటాయి. అంతేకాదు కల్యాణోత్సవాల్లో వరుసగా కలాపాలు వుంటాయి. ఇదంతా తట్టుకోవడానికి ఆ శ్రమ అవసరం.

మొదటి ఐదు సంవత్సరాలూ ఇదే దినచర్య. ఆ సమయంలో శరీరంతో సంబంధం లేకుండా కొ న్ని భాగాలు(మెడ, కళ్లు వగైరా) కదపడం కూడా నేర్పుతారు. అప్పుడే అడవిసాము నేర్పించారు. ఐదు సంవత్సరాల తరువాత గొల్లకలాపం, భామాకలాపం, జావళీలు, క్షేత్రయ్య పదాలు నేర్పించేవారు. ఏడు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఇవన్నీ వచ్చేసేవి. ఆపై వీటిని కల్యాణోత్సవాల్లో ప్రదర్శించాలి. ఇప్పుడైతే గానం ఒకరిది, నృత్యం ఇంకొరిది. కానీ అప్పుడు రెండూ నృత్యకారిణే చేయాలి.

ఊరికి నిప్పంటుకుంది...
గొల్లకలాపం ఆడటంలో మా అమ్మమ్మకు ఎంతో పేరుంది. అందులో ఆమెకు దివ్యత్వం వుందనేవారు. దానికి ఒకటి రెండు నిదర్శనాలు కూడా వున్నాయి. వండ్ర అనే గ్రామంలో దేవుని మాన్యం కింద ఎకరా భూమి మాకిచ్చారట. ఆ ఊళ్లో దేవుని పెళ్లికి, ఇతర శుభకార్యాలకు మా అమ్మమ్మ గొల్లకలాపం ఆడేది. ఒక సంవత్సరం అమ్మమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వండ్రలో గొల్లకలాపం ఆడలేదు. కొన్నిరోజులయ్యాక ఆ ఊరు అగ్నికి ఆహుతైపోయింది.

దానికి కారణం గొల్లకలాపం ప్రదర్శించకపోవడమనే నమ్మకం ఆ ప్రజల్లో కలిగింది. ఆ తరువాత సంవత్సరం అమ్మమ్మ ఆడింది. కొన్నాళ్లకు అమ్మమ్మ వెళ్లలేని పరిస్థితులొచ్చాక గొల్లకలాపం..గొల్లకలాపం అంటూ నాలుగు మాట అక్కడ చెప్పేవారట. మేజువాణి, భోగం ఆటలను అమ్మమ్మ ముందే వదిలేసింది. గొల్లకలాపం, భామాకలాపం పై ఎక్కువ ఆసక్తి చూపేది. అమ్మమ్మకు ఆఖరి రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నంచి పతకాలు అందాయి. 1978లో అమ్మమ్మ చనిపోయింది. మేము అంతటితో కలాపాలను విడిచిపెట్టేసి, తాళం, గజ్జలను పెట్టెలో పెట్టేశాము.

నృత్యనికేతన్‌తో మళ్లీ ఆరంభం...
గొల్లకలాపం పూర్తిగా వేదాంతపరమైనది. ఇందులో జ్ఞానం, విజ్ఞానం రెండూ వుంటాయి. గొల్లభామ, బ్రాహ్మణునికి మధ్య సంవాదమే గొల్లకలాపం. బ్రహ్మజ్ఞానం పొందడానికి ఏంచేయాలనేది చెప్పడంతోపాటు పిండోత్పత్తిశాస్త్రం కూడా ఈ కలాపంలో వుంటుంది. రెండు వందల సంవత్సరాల క్రితమే వెంగమాంబ దీనిని రాయడం ఒక అద్భుతం. దీనిని ఆడటానికి ఎంతో సహనం, ఓపిక కావాలి. ఆపై ఆదరించాలి. ఇవి రెండూ కొరవడి కలపాలను వదిలేశాము.

1985లో కళాకృష్ణ వచ్చి కలాపాలను ఎవరికైనా నేర్పాలని, వాటి అవసరం వుందని చెప్పారు. అలా నృత్యనికేతన్ మొదలు పెట్టాము. దాదాపు మూడు వందల మందికి ఈ కలాపాలను నేర్పించాము. కానీ ఇప్పుడు ఎంతమంది వాటిని ప్రదర్శిస్తున్నారు, వారికి పదాలపై, జావళీలపై ఎంత అవగాహన వుందని ప్రశ్నిస్తే మాత్రం నిరాశే మిగులుతుంది. ఒకసారి మా దగ్గర నేర్చుకున్నవారు నారాయణపేటలో గొల్లకలాపం ప్రదర్శించారు. అది టీవీలో చూసి మా అమ్మ బాధపడింది.

సంపూర్ణంగా నేర్చుకోమనీ, ఇంకా అభ్యాసం అవసరమనీ, అసంపూర్ణ ప్రదర్శన ఇవ్వడం కళకు అన్యాయమనీ...అంచేత గొల్లకలాపాన్ని ప్రదర్శించవద్దని ఉత్తరం కూడా రాసింది. 2008లో అనుకుంటా ఒకసారి వరంగల్‌లో ఒక సదస్సుపెట్టారు. అక్కడితో అయిపోయింది. మా కళను తమదిగా చెప్పుకుంటూ చాలామంది ఇప్పుడు లాభపడుతున్నా కనీసం కళాకారుల గుర్తింపుకార్డులు సైతం పొందని దురదృష్టం మాది. గత ఏడాది 'శతరూప' అంటూ రాజధానిలో కళలను ప్రోత్సహించే కార్యక్రమం పెట్టారు. అప్పుడూ మేము గుర్తురాలేదు.

ఆకలి భోగం వద్దన్న వాళ్లు...
వివాహాల్లోనూ, వేడుకల్లోనూ కళావంతులు భోగం ఆటలు, మేజువాణిలు ఆడేవారు. మేజువాణిలో పదిమంది వేదికపై వుంటే, ఇద్దరు ముందుకు వచ్చి నాట్యం చేసేవారు. అప్పుడే ఎంకిపాటలు, టుమ్రీలు, జావళీలు, క్షే త్రయ్య పదాలు ఆడేవారు. కొంతమంది కుర్రాళ్లు ఏదైనా సినిమా పాటలకు ఆడమనేవారు. అదంతా ఆకలి తీర్చుకోవడానికే ఆడేవారు. మగాళ్లంతా కలసి దానిని వద్దన్నారు. సమాజానికి చెడు అన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి. టీవీల్లో షోలు, డాన్సులు అంటూ అదే ఓపెన్‌గా చేస్తున్నారు.

అంతకంటే ఎక్కువగా హీరోయిన్లను అనుకరిస్తూ, ఇంకా కురచ దుస్తులు ధరించి డాన్సులు చేస్తుంటే దానికి సమాజంలో పేరున్న వారంతా న్యాయనిర్ణేతలుగా వుంటున్నారు. వేలవేల రూపాయలు ఇస్తున్నారు. ఇదేమి న్యాయం?... సమాజం ఇప్పుడు చెడిపోదా?... కళావంతుల మాన్యాలు దోచుకున్నారు. చిన్న చూపు చూశారు. అప్పటి కళావంతుల నృత్యాలకు పేర్లు మార్చి, పద్ధతులు మార్చి వేలు వేలు సంపాదించుకుంటున్నారు. సమాజం ఇప్పుడు చెడిపోదా?...

సమాజం ద్వంద్వ వైఖరులపై లక్ష్మీమంగతాయారు ఎక్కుపెట్టిన ప్రశ్నలివి. జవాబులు చెప్పడం మనందరి బాధ్యత.

బల్లెడ నారాయణ మూర్తి, ఫొటోలు: భాస్కర్