
కృష్ణా జిల్లాలో సుమారు 600 ఏళ్ల క్రితం పుట్టిన కూచిపూడి నృత్యం గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. సిలికానాంధ్ర, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన 2వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనంలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ‘హిందోళ థిల్లాన’ నృత్యాన్ని 2,800 కళాకారులు ఒకే వేదికపై నర్తించిన అద్భుత దృశ్యాన్ని గిన్నిస్ రికార్డు సంస్థ అధికార ప్రతినిధి తారికవర ప్రత్యక్షంగా వీక్షించారు.

రాష్టప్రతి ప్రతిభా పాటిల్ సహా వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శనను గిన్నిస్ రికార్డులోకి చేర్చుతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ప్రకటించడంతో స్టేడియం చప్పట్లతో మార్మోగింది. ఈ రసరమ్యమైన నృత్యాన్ని కీర్తించేందుకు తనకు మాటలు రావడం లేదని తారికవర వ్యాఖ్యానించారు. అనంతరం గిన్నిస్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలకు అందజేశారు. ఈ నృత్య సమ్మేళనంలో 15 దేశాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూచిపూడి ఆది గురువు పద్మ భూషణ్ వెంపటి చినసత్యంతోపాటు పద్మభూషణ్ యామినీ కృష్ణమూర్తి, పద్మశ్రీ డాక్టర్ కె.శోభానాయుడులను రాష్టప్రతి సత్కరించారు.
దేశానికే గర్వకారణం: ప్రతిభా పాటిల్

కూచిపూడి నృత్యం గిన్నిస్ రికారులోకి ఎక్కడం దేశానికే గర్వకారణమని రాష్టప్రతి ప్రతిభా పాటిల్ పేర్కొన్నారు. నృత్య సమ్మేనళం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజ రైన సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. భక్తి, అంకితభావం, పట్టుదలతో ఈ విజయం సాధించిన కళాకారులందరికీ అభినందనలు తెలియజేశారు. ఒకే వేదికపై ఇంత భారీ సంఖ్యలో కళాకారులు పాలుపంచుకోవడం గొప్ప విషయమని, కార్యక్రమం అద్భుతంగా జరిగిందని ప్రశంసించారు. 2,800 కళాకారులు పాల్గొన్నారని గిన్నిస్ రికార్డు సంస్థ ప్రతినిధి చెప్పారని, కానీ కేంద్ర మంత్రి పురందేశ్వరి పేరు కలిపి 2,801గా మార్పు చేస్తే బాగుంటుందని చమత్కరించారు.
తెలుగులో ప్రసంగించిన గవర్నర్...
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన గవర్నర్ నరసింహన్ తెలుగులో ప్రసంగించి ప్రేక్షకులను ఆనందపర్చారు. ‘వేదికపై ఉన్న మహానుభావులు, వేదిక ముందున్న కళాకారులకు అభివందనం’ అని ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘కృష్ణపరమాత్ముడు విశ్వరూపం ప్రదర్శించినప్పుడు, ఆ దృశ్యాన్ని కేవలం అర్జునుడు ఒక్కడే చూసి మూర్చపోయాడు. అనంతరం లేచి కృష్ణపరమాత్ముడికి సాస్టాంగ నమస్కారం చేశాడు. ఈ రోజు కూచిపూడి నృత్య ప్రదర్శన తిలకించిన నాకు ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిలికానాంధ్రకు ధన్యవాదాలు తెలిపారు. కూచిపూడి నృత్యం గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు.
కూచిపూడి, యోగా తదితర సంస్కృతులను కాపాడుకోవడం మన బాధ్యతని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘనత సాధించిన కళాకారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల చెక్‌ను నిర్వాహకులకు అందజేశారు.
