Sunday, December 26, 2010

పరదేశీ... తకిట తథిమి

లంకాద్వీప కాంతి రువిని సిల్వామన పక్కింటమ్మాయిలా కనిపించే రువిని సిల్వా శ్రీలంకలోని కేండీ ప్రాంతంలో పుట్టిపెరిగింది. 'నాన్న సునీల్ సిల్వా ప్లాంటేషన్ మేనేజర్. అమ్మ విజయరత్న. నేను చిన్నప్పుడు బాగా డ్యాన్స్ చేసేదాన్ని. అలాగని నర్తకిగా కెరీర్ ఎంచుకుని స్థిరపడాలని మాత్రం అనుకోలేదు. మా అమ్మకు ఆసక్తి ఉన్నా, నాట్యం అభ్యసించడాన్ని అప్పట్లో అమ్మమ్మతో సహా అందరూ వ్యతిరేకించారట.

కానీ మా అమ్మ నన్ను ప్రోత్సహించింది. ఆమె చేయలేనిదాన్ని నేను చేస్తానని అమ్మకు నేను మాటిచ్చాను. అక్కడి విద్యావిధానంలో ఏదో ఒక కళారూపాన్ని అభ్యసించడం తప్పనిసరి. వాటికి ప్రత్యేకంగా మార్కులుంటాయి. అలా నేను మూడేళ్లపాటు భరతనాట్యాన్ని అభ్యసించాను..' అంటున్న రువిని సిల్వా శ్రీలంక జాతీయ నృత్యం కేండియన్ కూడా బాగా చేస్తుంది. యూనివర్సిటీల వెతుకుతున్నప్పుడు రవీంద్రుడి విశ్వభారతి పరిచయమయింది ఆమెకు.

మూడున్నరేళ్ల క్రితం అక్కడ చేరి మణిపురిని అభ్యసించడం మొదలుపెట్టింది. త్వరలోనే మెళకువలను ఒంటపట్టించుకున్న రువిని ప్రదర్శనలు ఇస్తూ అనేక దేశాలు తిరిగింది. ఎన్నో అవార్డులను అందుకుంది. 'దక్షిణాది సంస్కృతి చాలావరకూ నాకు పరిచయమైనదిగానే అనిపిస్తుంది. ఎటొచ్చీ మాకిన్ని పండగలూ పూజలూ ఉండవంతే. ఏప్రిల్ 14 సంవత్సరాది, మేలో బుద్ధజయంతి - అంతే మేం చే సుకునే పండగలు..' అంటూ ముగించిన రువిని సిల్వా ఒక ద్వీప దీప్తిని తన నాట్యంతో అందరి మనసుల్లోనూ నింపింది.

ఇంద్రధనస్సు వెలుగు ఇరినా కొమిస్సరొవా
ఇరినా ఒడిస్సీ నృత్యం చేస్తున్నప్పుడు ఆమె కళ్లలోని కాంతి ఆమె ధరించిన వెండి ఆభరణాల మిలమిలలతో పోటీపడుతుంటుంది. 'భారతీయ సంప్రదాయ నృత్యాల్లో ఒకటయిన ఒడిస్సీని నేను నేర్చుకుంటాననిగానీ, ప్రద ర్శనలిస్తాననిగానీ ఎప్పుడూ అనుకోలేదసలు..' అనే ఇరినా మాస్కోలో ఒక నేస్తం బలవంత ం చేస్తే ఒడిస్సీ నృత్య ప్రదర్శనను సరదాగా చూసింది. అది ఆమె మనసులో నాటుకుపోయింది. ఆ తర్వాత గురువు సుజాత మహాపాత్ర దగ్గర చేరి శ్రద్ధగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఎనిమిదేళ్ల నుంచీ అభ్యసిస్తున్న ఇరీనా ప్రస్తుతం మాస్కోలో జూనియర్ విద్యార్థులకు శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగింది. ప్రతి ఏడాదీభువనేశ్వర్‌కు వ చ్చి కొన్ని రోజులుండి తన నాట్యానికి మెరుగులు దిద్దుకునే ఆమె ఇంగ్లీష్ అధ్యాపకురాలు, అనువాదకురాలు కూడా.

చందన పరిమళం మాళవిక వెంకటసుబ్బయ్య
పేరు చూసినా, ఆమెను చూసినా అచ్చ తెలుగమ్మాయనే అనుకుంటారందరూ. కన్నడ కస్తూరి సౌరభాలను వెదజల్లే మాళవిక "నా తల్లిదండ్రులిద్దరూ రంగస్థలం మీద రాణించిన వారే. నా తోబుట్టువులకు కూడా థియేటర్ ఆర్ట్స్‌తో మంచి పరిచయం ఉంది. దానివల్ల చిన్నప్పటి నుంచీ నాకు ఈ కళతో అనుబంధం ఉంది. ఎనిమిదేళ్ల నుంచి నాకు నాట్య శిక్షణ ఆరంభమయింది...' అని చెప్పారు. అదే మొదటి అడుగుగా వేసిన మాళవిక బెంగళూరులోని లలితా శ్రీనివాసన్ శిక్షణలో మైసూరు బాణీకి చెందిన చక్కటి భరతనాట్య నర్తకిగా రూపొందింది.

భారతీయ జానపద నృత్యాల గురించి కూడా బాగా చదువుకున్న ఆమె హైదరాబాద్ వచ్చి పసుమర్తి వెంకటేశ్వరశర్మ శిష్యరికంలో కూచిపూడినీ అభ్యసించింది. 'ఇప్పటికి లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చాను. ప్రతి ప్రదర్శన తర్వాత ప్రేక్షకులు వచ్చి తమ అభిప్రాయాలను చెబుతున్నప్పుడు ఉద్వేగంగా ఉంటుంది. కళ అనేది 'వన్ వే' కాదు. నేనేం చేస్తున్నానో దాన్ని అర్థం చేసుకుని అనుభూతి చెందే వీక్షకులను కలిసినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది... వాళ్ల ప్రోత్సహం, అభినందనలే కళాకారులకు ఊపిరి పోస్తాయి..' అని చిరునవ్వుతో చెబుతారు.

తెలుగు కుటుంబంలో మెట్టిన మాళవిక ఆరేళ్లుగా కెనడాలోని ఎడ్మాంటన్‌లో ఉంటూ 'నాట్యమ్ డ్యాన్స్ అకాడమీ'ని నిర్వహిస్తున్నారు. 'కెనడా అనేక సంస్కృతుల సంగమం. అక్కడివారికి భాష తెలియకపోయినా సరే, మన సంప్రదాయ నృత్యాలను కళ్లార్పకుండా చూస్తారు. చాలా గౌరవిస్తారు. ప్రదర్శనకు ముందు దానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తే జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారు. ఎన్నారైలయితే చాలా సీరియస్‌గా నేర్చుకుంటారు..' అంటున్న మాళవిక తన నాట్యంతో విశాఖను మంత్రించారంటే నమ్మండి.

ప్రేమతత్వమే ఆమె నృత్యం - వార్దా రిహాబ్
'బంగ్లాదేశ్ ముస్లిం దేశమే కావొచ్చు. ఆంక్షల పరదాలు ఎక్కువే ఉండొచ్చు. కానీ వాటి వెనుక ప్రతిభ కలిగిన ఎందరో బాలికలున్నారు.. అవకాశం వస్తే వాళ్లు చెయ్యలేనిది లేదు. వారిని వెలుగులోకి తేవాలన్నదే నా కల' అంటున్నప్పుడు వార్దా రిహాబ్ కళ్లలోని మైమరుపును చూడాల్సిందే. ఆమె తల్లి డాక్టర్. చాలా ఏళ్లక్రితం ఉదయ్‌శంకర్ బృందం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నప్పుడు ఆమెను చూసి వారు తమ బృందంలోకి రమ్మని అడిగారట. కాని సంప్రదాయం ఆమెను అటువైపు అడుగెయ్యకుండా ఆపింది.

'నాకో కూతురు పుడితే ఆమె తప్పకుండా డ్యాన్స్ చేస్తుంది' అని అప్పుడే నిర్ణయించుకున్నారామె. అందువల్లే వార్దాను చిన్నప్పుడే డ్యాన్స్ స్కూల్లో చేర్పించారు ఆమె తల్లి. ప్రసిద్ధ బంగ్లాదేశీ నర్తకి, కొరియోగ్రాఫరయిన షర్మిలా బెనర్జీ శిష్యరికంలో మణిపురి మణిపూసగా ప్రకాశించింది వార్దా రిహాబ్. 'తాండవం, లాస్యం - రెండూ ఏక సమయంలో చెయ్యగలిగే విధానం మరే నాట్య సంప్రదాయంలోనూ లేదు. మణిపురిలో ఉన్న ఈ విశిష్టత నన్ను కట్టి పడేసింది...' అంటున్నారామె.

ఐసీసీఆర్ ఢాకాలో నియమించిన గురు కళావతి దగ్గర వార్దా పంగ్ (మృదంగం), థాన్ తా (మణిపురి మార్షల్ ఆర్ట్)లలో ప్రావీణ్యం సంపాదించింది. ఐసీసీఆర్ ఉపకారవేతనంతో రవీంద్రభారతి విశ్వవిద్యాలయంలో చేరిన ఈ కళాకారిణి అందులో బంగారు పతకాన్నీ సాధించింది. ఢాకా యూనివర్సిటీలో ఎంబీయే చేసిన వార్దాకు అక్కడ నాట్య విభాగాన్ని నెలకొల్పాలనేది ధ్యేయం. రాధాకృష్ణుల ప్రణయాన్ని ఆమె అభినయిస్తున్నప్పుడు అచ్చంగా బృందావనమే కళ్లకు కట్టింది విశాఖ ప్రేక్షకులకు.

కూచిపూడి కుందనం మంగళ
మూడేళ్ల వయసు నుంచే కూచిపూడి నేర్చుకుంటున్న మంగళ మద్దాలి పదహారణాల తెలుగమ్మాయి. తొమ్మిదేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లిపోయినా అక్కడ కూడా తన సాధనను ఆపలేదామె. కొమండూరి రేవతి, వెంపటి రవి శంకర్‌ల శిష్యరికంలో అనేక ప్రదేశాలు పర్యటించి ప్రదర్శనలిచ్చిన మంగళ 'వారిని చూస్తూ నేను చాలా నేర్చుకున్నాను. ఒక నర్తకిగా వేదిక మీద నన్ను నేను ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి, ఒక వ్యక్తిగా ఎలా మసలుకోవాలి... వంటివెన్నో విషయాలను నేను గ్రహించగలిగాను' అంటారామె వినయంగా.

'అక్కడ సంప్రదాయ కళారూపాలకు చాలా ప్రాధాన్యమిస్తారు. కానీ వాటికి పుట్టినిల్లు ఈ దేశం. సంగీతనాట్యాలకు సంబంధించి ఇక్కడ గొప్ప వారసత్వ సంపద ఉంది. దురదృష్టవశాత్తూ దాన్ని నిర్లక్షయం చేసేవారే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు..' అని బాధపడుతున్న మంగళ వయసు చాలా చిన్నది, ఆలోచన పెద్దది. పద్మభూషణ్ వెంపటి చిన సత్యంతో కలిసి అమెరికాలోని నలభై నగరాల్లో ప్రదర్శనల్లో పాల్గొన్న మంగళ నాలుగేళ్ల క్రితం ఇక్కడ కూచిపూడి మహోత్సవంలోనూ తన కళను ప్రదర్శించింది.

ఇంటర్వ్యూలు : అరుణ పప్పు, విశాఖపట్నం
ఫోటోలు : వై. రామకృష్ణ

No comments: