
కిరాణాకొట్టు నడిపిస్తూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్న సామాన్యమైన వ్యక్తి ఆయన తండ్రి. కరీంనగర్ జిల్లాకు చెందిన బూరుగుపల్లి ప్రాంతంలో పుట్టిన తోట వైకుంఠం చిన్నప్పటినుంచి కూడా సాదాసీదా జీవనాన్ని కొనసాగిస్తుండేవారు. చిన్నతనంనుంచి కూడా తోట వైకుంఠానికి తాను పుట్టిన ప్రాంతమన్నా...పల్లెవాతావరణమన్నా ఎంతో మక్కువ. అందుకే ఆయన గీసిన చిత్రాలలో ఆయనకున్న అభిరుచిని తెలియజేస్తాయి ఆ చిత్రాలు.

తెలంగాణ సంస్కృతి మనకు ఆయన చిత్రాలలో అణువణువూ స్మృజిస్తుంది. దాసి చిత్రానికిగాను వైకుంఠం కళాదర్శకునిగా పనిచేశారు. ఆ చిత్రానికి కేంద్రస్థాయిలో ఉత్తమ కళాదర్శకునిగా తోట వైకుంఠం అవార్డును అందుకోవడం విశేషం. ‘రంగుల కల’ చిత్రం ఓ చిత్రకారుని గురించిన అంశం. ఆ చిత్రాన్ని దర్శకుడు బి.నరసింగరావు ఎంతో హృద్యంగా తెరకెక్కించిన తీరు నభూతో నభవిష్యతి. ఇక ఆ చిత్రకారుడు గీసే బొమ్మలన్నీ సినిమా తెర వెనక గీసిన వ్యక్తి తోట వైకుంఠం. ఆ సినిమా కూడా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అందుకే నరసింగరావు తన ప్రతిచిత్రంలోనూ ఏదోఒకరకంగా తోట వైకుంఠం పాల్గొనేలా చేస్తారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. వైకుంఠానికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చెట్టూ పుట్టా తిరిగి కాయకష్టం చేసి అలసి, సొలసిన శ్రమజీవులు మానసిక విశ్రాంతిని, పొందడానికి కళలను నమ్ముకొని తెలంగాణలో వేలాది మంది కళాకారులు బ్రతుకు బండిని కొనసాగించేవారు. ఇలాంటి ప్రాశస్త్యం కల్గిన విశిష్ఠ కళలతో పరవశించే తెలంగాణ పల్లెల ప్రకృతి అందాలను తోట వైకుంఠం తన కుంచెతో మన మనసుల్లో నిలిచిపోతారు.
నండూరి రవిశంకర్
No comments:
Post a Comment