కంది పప్పుతో కాసుల పేరు!

ఆసక్తిగా ఉందా..? ఇవిగో వివరాలు..
ఇంట్లో పేస్ట్ అయిపోతే మీరేం చేస్తారు? పారేస్తామండీ బాబూ...! అగ్గిపెట్టెలో పుల్లలు అయిపోతే..? చెత్తబుట్టలో వేస్తాం. పాడయిపోయిన, విరిగిపోయిన డబ్బాలు గట్రాలను ఏం చేస్తారేంటి? ఇనప సామాన్లకు అమ్మేస్తాం. లేదంటే అటకమీదకెక్కిస్తాం. పనికిరాని వాటితో పనేంటి అంటారా? 'అయ్యో...వాటితోనే పని' అంటున్నారు నల్గొండకు చెందిన అరుణ్‌జ్యోతి ఎస్.లోఖండే.
సృజనకు కాస్త కళాత్మకత జోడిస్తే అయిపోయిన పేస్ట్ ట్యూబు, ఖాళీ కంటైనర్లు చక్కటి కళాఖండాలుగా పప్పులు, ధనియాలు, బిర్యాని ఆకుల్లాంటివి నాజూకు నగలుగా తయారవుతాయి. ఒక్క ఇవే కావు, ఇంకా ఇలాంటి చాలా కళల్లో అరుణ్జ్యోతికి ప్రవేశం ఉంది.
అమ్మ దగ్గర ప్రారంభం
చిన్నప్పటి నుంచి కొత్తగా ఆలోచించడం... కొత్త పనులను చేయడమంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ ఇష్టం మొదట కాయిన్స్ కలెక్షన్గా మొదలైంది. ఎక్కడ ఏ కొత్త రకం నాణెం దొరికినా జాగ్రత్తగా దాచుకునేదిట. పెళ్లయినా ఆ హాబీని కొనసాగిస్తూ ఇప్పటిదాకా యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలకు చెందిన దాదాపు పదివేల నాణాలను పోగుచేసిందామె. హైస్కూల్‌కు వెళ్లే రోజుల్లోనే అమ్మ దగ్గర చీరల మీద ఎంబ్రాయిడరీ, ఇతర అల్లికలు నేర్చుకుంది అరుణ్‌జ్యోతి.
ఉమ్మడి కుటుంబం కావడంతో వాళ్లింట్లో పూటకో వెరైటీ వంటలుండేవట. దీంతో రకరకాల వంటలను చేయడం కూడా నేర్చుకుంది. ఇలా కొత్త విషయాలను తెలుసుకోవడం, నేర్చుకోవడం పట్ల తనకున్న ఆసక్తి ...పెళ్లయ్యాక దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగ పర్చుకోవడానికి చాలా ఉపయోగపడిందని చెప్తూ... 'ఇంటర్ పూర్తవగానే నాకు పెళ్లయింది. ఇక్కడా ఉమ్మడి కుటుంబమే. ఏ పనైనా అందరం కలిసి చేసుకునే వాళ్లం కాబట్టి ఇంటిపని త్వరగా అయిపోయేది.
ఆ తర్వాత అంతా ఖాళీయే. అప్పుడే చిన్నప్పుడు నేర్చుకున్న ఎంబ్రాయిడరీ, అల్లికలు మళ్లీ మొదలుపెట్టాను. ఆ ఆసక్తితోనే కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ డ్రెస్ మేకింగ్‌లో డిప్లమా చేశాను. అదే సమయంలో నల్గొండలో జరిగే ప్రతి వంటల పోటీల్లో పాల్గొనేదాన్ని. ప్రతి పోటీలో ప్రైజ్ గెలుచుకునేదాన్న'ని గతాన్ని గుర్తుచేసుకుంది అరుణ్‌జ్యోతి.
ఆపదలోనూ...
అరుణ్‌జ్యోతి వాళ్లబ్బాయి అనీష్‌కి ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు కరెంట్ షాక్ తగిలి గాయాలయ్యాయి. బాబును పట్టుకుని తొమ్మిది నెలలు ఆసుపత్రిలో ఉందామె. అంత ఆపదలోనూ కుంగిపోకుండా... తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ... ఒకవైపు కొడుకును చూసుకుంటూనే ఇతర వ్యాపకాల మీద మనసు పెట్టింది. ఆ టైమ్‌లోనే తనకు ఎంతో ఇష్టమైన ఉర్దూ భాషను నేర్చుకుంది.
ఆసుపత్రిలో మంచం మీదున్న బాబును ఉల్లాస పర్చడానికి ఇంట్లో పాడైపోయిన వస్తువులు...డబ్బాలకు తన సృజనాత్మకతను జోడించి రకరకాల బొమ్మలను చేసి చూపించేది. అసంపూర్తిగా మిగిలిన తన చదువుకూ శ్రీకారం చుట్టింది. అట్లా మళ్లీ మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటిదాకా ఆగనే లేదు. ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఎంఏ చేసింది. సమ్మర్ క్యాంపులకు కొడుకుతో పాటు వెళ్లి యోగా, కూచిపూడి నాట్యాన్ని అభ్యసించింది. అభ్యసించి ఊరుకోలేదు. సమయం ఉన్నప్పుడల్లా ప్రదర్శనలు కూడా ఇస్తోంది.

ఇప్పటికీ ఆమెలోని సృజనాత్మకత కొత్త కొత్త ప్రయోగాలకు నాంది పలుకుతూనే ఉంది. చీరల మీద జర్దోసీ, ఎంబ్రాయిడరీ పని, సిమెంటు, ప్లాస్టిక్, కంటైనర్లతో రకరకాల కళాకృతులు.... లేటెస్టుగా కంది, పెసర, ధనియాలు, సోంపు గింజలు, జీలకర్ర, మిరియాలు, బిర్యానీ ఆకులతో వంటింటి వెచ్చాలతో నాజూకైన నగలనూ తయారు చేస్తోంది. పప్పు ధాన్యాలతో కాసుల పేరు, నెక్లెస్, లాంగ్ చైన్లను అందంగా అమరుస్తుంది. పప్పులతో చీరల మీద రకరకాల డిజైన్లనూ వేస్తోంది.
ఆమె బంధువులు, స్నేహితుల్లో తాను తయారు చేసిన ఈ జ్యువెలరీకి ఎంతో డిమాండ్ ఉంటోందట. ఇప్పటివరకు ప్రదర్శనకే సరిపోయిన తన కళ ఇక నుంచైనా పదిమందికి ఉపయోగపడాలన్న తాపత్రయంతో....ఫ్రిజ్‌లో కూరగాయలను, పళ్లను పెట్టుకోవడానికి బట్టతో బ్యాగులను కుట్టి, వాటిని అమ్మగా వచ్చిన డబ్బును అనాథలకు అందిస్తోంది అరుణ్‌జ్యోతి. '
ఇన్నాళ్లూ నా కళను కాలక్షేపానికి, పదిమంది ప్రశంసలు పొందడానికే పరిమితం చేశాను. సమాజానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడాలని ఇలా బట్టతో సంచీలు కుట్టి అమ్ముతున్నాను. దీని ద్వారా రెండు రకాల మంచి జరుగుతోంది. ఒకటి... ప్లాస్టిక్ వాడకం తగ్గేలా ఎంతోకొంత కృషి చెయ్యడం. రెండవది.. అనాథలకు సాయం చేయడం' అని చెప్పింది. ప్రస్తుతం నల్గొండలో ఒక లేడీస్ గార్మెంట్ షాపును, అలాగే హైదరాబాదులోని బర్కత్‌పురాలో తను డిజైన్ చేసిన చీరలతో మరో షాపునూ నడుపుతోంది ఈమె.
ఇవే కాక 'ఆయుర్వేదం అంటే నాకున్న ప్రత్యేక అభిమానం వల్ల 'అందరికీ ఆయుర్వేదం' అనే అంశానికి ప్రచారం తీసుకురానున్నట్లు' తెలిపింది. తాను చేస్తున్న ఈ పనులన్నింటికీ ఆమె భర్త సతీష్ .ఎన్.లోఖండే, అత్తగారి ప్రోత్సాహం, తోడ్పాటు ఎంతో ఉన్నాయని చెప్పింది అరుణ్‌జ్యోతి.
సరస్వతి రమ