
‘రాయడానికి కలానికి చిక్కని గొప్పతనమే గొప్పతనం’ అనే చలం మాటలు ఆయన కథలకూ వర్తిస్తాయి.
మన తృప్తి కోసం మళ్లీ మళ్లీ చెప్పుకోవడమేగానీ ఆ మహా రచయిత కథల గొప్పతనం ఏ కలానికి చిక్కుతుంది?! ‘శమంతకమణితో ఇంటర్‌వ్యూ’ కథ ఏ సంవత్సరంలో చలం రాశారో తెలియదుగానీ ఏ సంవత్సరం చదివినా ఆ సంత్సరం రాసిన కథగా తాజాగా చదివిస్తుంది. వర్తమానానికి పట్టిన నిలువెత్తు అద్దంలానే ఉంటుంది. చలం కాలాతీత కథల్లో ఇదొకటి.
శమంతకమణి ఎవరు? కథానాయకి.
తెనాలికి చెందిన సూరమ్మ సినిమాఫీల్డ్‌కు వెళ్లి శమంతకమణిగా మారుతుంది. లెక్కకు అందని డబ్బు,పేరు ప్రఖ్యాతులు గడిస్తుంది. కీర్తిని, డబ్బును వెతుక్కుంటూ వెళ్లినవారు వెనక్కి తిరిగి రావడమనేది ఉంచదు. ఇది లోకరీతి. బలంగా స్థిరపడిన ఇట్లాంటి లోకరీతిని కాలదన్ని రంగుల లోకాన్ని, కీర్తిని, డబ్బును వదిలేసి ఒకానొకరోజు సొంతూరు తెనాలికి వచ్చి స్థిరపడుతుంది శమంతకమణి.
లోకం మూకుమ్మడిగా ముక్కు మీద వేలేసుకుంటుంది.
శమంతకమణి మనసు మారడానికి కారణం ఏమిటి?
ప్రేమ విరహం అంటారు కొంతమంది. వైరాగ్యమంటారు మరి కొందరు. సుబ్బారావు స్నేహితుడైన రచయిత మాటల్లో కథ నడుస్తుంది. శమంతకమణి తెనాలికి వచ్చి స్థిరపడడానికి గల కారణాలను రకరకాలుగా ఊహించుకోవడం కంటే ఆమెనే అడిగితే సరిపోతుంది కదా అని ఇద్దరూ శమంతకమణి ఇంటికి బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక-‘‘శమంతకమణి ఉందా?’’ అని ఇంటిదగ్గర కనిపించిన అబ్బాయిని అడుగుతాడు సుబ్బారావు.
‘‘ఎవరు ఆమె?’’ అని తెల్లబోతాడు ఆ కుర్రాడు.
‘‘సూరమ్మ ఉందా?’’ అని అడుగుతాడు సుబ్బారావు మళ్లీ.
‘‘ఉంది’’ అని చెబుతాడు అతను. ఈ దృశ్యంతో అర్థమయ్యే విషయం ఏమిటంటే శమంతకమణి ఇకముందు ఆ పేరుతో బతకదల్చుకోలేదని మళ్లీ సూరమ్మగానే బతకదల్చుకుందని. సూరమ్మ ఇక సినిమాల్లో నటించదు. జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇవ్వదు. స్థలాలు కొనదు. తననెవరూ ఫోటోలు తీసుకోనివ్వదు.
సుబ్బారావు స్నేహితుడు అంటే మనకు కథ చెప్పే రచయిత... సూరమ్మ చిన్నతనంలో ఉండగా ఎత్తుకొని ఆడించాడు. చాలా చాలా కాలం తరువాత సూరమ్మను చూసినప్పుడు ఎత్తుకొని ఆడించిన సూరమ్మ గుర్తుకు రాదు. ఆమె ముఖంలో అందం కంటే స్థిమితమూ, విజ్ఞానం ఎక్కువ కనిపిస్తాయి. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ అప్పుడు ‘వేదాంతసార సంగ్రహం’ చదువుతూ కనపిస్తుంది. ఎక్కడి గ్లామర్ ఫీల్డ్? ఎక్కడి వేదాంతం!!

‘‘మీరిప్పుడు వేదాంత పుస్తకాలు రాస్తున్నారట కదా’’ అని ఆ మాజీ తార అడిగితే - ‘‘నువ్విప్పుడు వేదాంతం చదువుతున్నట్లే’’ అని చెబుతాడు సుబ్బారావు స్నేహితుడు. కొద్దిసేపటి తరువాత వచ్చిన విషయంలోకి దిగుతాడు.
‘‘నువ్వు అంత అకస్మాత్తుగా సినిమాల్ని వదిలి వచ్చేశావు. వేదాంతమా?’’ అని అడుగుతాడు.
‘‘వేదాంతం కాదుగానీ, చాలా వరకు విరక్తి’’ అంటుంది సూరమ్మ. ఆ విరక్తి రహస్యమేమిటో మాత్రం అప్పుడు చెప్పదు. మెల్లిగా కదిలే సంభాషణల్లో ఒక చోట చెబుతుంది ఇలా:
‘‘సంసారం, బంధువులు, స్నేహితులూ అందరూ డబ్బు కోసం ఆశ్రయించేవారే. మొగవాళ్లకి ఫరవాలేదనుకుంటాను. స్ర్తీకి మాత్రం తక్కిన స్ర్తీలూ విరోధులే. అందం ఉన్న తారకి ఆ అందం వల్లనే విరోధులు, మిత్రులూ. అందం లేని నా బోటి దానికి అదీ లేదు’’.
శమంతకమణి ఎలియాస్ సూరమ్మ అశాంతి, ఒంటరితనం, ఆత్మ నలిగిన చప్పుడు కేవలం చలం కథ మాత్రమేనా? హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్... గుర్తుకు తెచ్చుకుందాం ఒక్కసారి....శమంతకమణిగా మారిన సూరమ్మలు, సూరమ్మగా మారిన శమంతకమణులు!!
No comments:
Post a Comment