Friday, October 1, 2010

అమెరికా కంపెనీకి చిక్కిన... అప్పడాల కథ

కథ: కప్పడాలు
రచయిత: తోలేటి జగన్మోహనరావు


గన్ ప్రేమలో పడ్డాడు. గన్ అసలు పేరు గన్ కాదు. గణేష్. ఢిల్లీలో డాండూమ్ అని చదివేసి అమెరికా బాస్‌ల కింద పని చేయడం మొదలుపెట్టాక గణేష్ కాస్తా గన్‌గా మారిపోయాడు. కుర్రాడు కత్తి. మహా చురుకు. కుదురంటే బెరుకు.
ఇంత స్పీడు మీద ఉన్న కుర్రాడు సహజంగానే ప్రేమలో పడతాడు. పడ్డాడు. ఢాం. అమ్మాయి తండ్రి అతగాణ్ణి పిలిచి- నాయనా ప్రేమ సరే, నీ ప్రయోజకత్వం నిరూపించుకో. అప్పుడే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా. నీకు ఒక సంవత్సరం గడువు అని మరోచరిత్ర లెవల్లో ప్రామిస్ చేస్తాడు.

సాధారణంగా ప్రేమించేవాళ్లు అమ్మాయితో పాటు అమ్మాయి బ్యాక్‌గ్రౌండు, ఆ అమ్మాయి యిలాకా, తాలూకా, తండ్రి ఏం పని చేస్తాడు, ఏమి ఆస్తిపాస్తులు ఉన్నాయి... ఒకసారి కాకపోయినా ఒకసారైనా చూసుకుంటాడు.
కాని, మన గన్ చూసుకోడు.

కెరీర్‌లో దూకుతాడు. బుల్లెట్‌లా దూసుకుపోతాడు. అమెరికా కంపెనీ ‘కెప్సీ’ భారత్‌లో అడుగుపెట్టి ‘అప్పడాల’ వ్యాపారం చేద్దామని నిర్ణయించుకుంటే దాని లోకల్ శాఖకు మనవాడే సుప్రీమ్ అవుతాడు. అప్పటికే అంధ్రదేశంలో ‘గణేష్’ అనే కంపెనీ అప్పడాల రంగంలో నంబర్ వన్‌గా ఉంటుంది. దానిని తన కెప్సీతో గన్ దెబ్బ కొడతాడు. తనవి అప్పడాలు కావనీ కప్పడాలని ప్రకటనలతో ఊదరగొడతాడు. చేతితో చేసే అప్పడాల వల్ల టైఫాయిడ్, కలరా, మలేరియా, ఎయిడ్స్ కూడా వస్తాయని ప్రచారం చేస్తాడు.

జనమంతా అప్పడాలు మానేసి కప్పడాలు తినడం మొదలెడతారు.
కెప్సీతో పోరాడలేక ఆఖరుకు గణేష్ కంపెనీ చేతులెత్తేసి మూతపడుతుంది.
గన్ ఇప్పుడు విజేత. ఆ విజయోత్సాహంతో మామగారి దగ్గరకు వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడబోతాడు. కాని అప్పటికే మామగారు వ్యాపారంలో చితికిపోయి ఉంటారు. కట్నకానుకలు యిచ్చే పరిస్థితిలో లేనని కాబోయే అల్లుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటారు.
గన్ ఇవి పట్టించుకోడు. తనకు కావల్సింది కట్నం కాదని కన్య అని చెబుతాడు.
మామగారు సంతోషపడతారు. అందరూ భోజనాలకు కూర్చుంటారు. పనిమనిషి పెరుమాళ్లు యధావిధిగా సాంబారుతో పాటు అప్పడాలు తెస్తాడు. గన్ ఉలిక్కిపడతాడు. ఏమిటి యింకా మీరు అప్పడాలే తింటున్నారా, మా కంపెనీ వారి కప్పడాలు తినడం లేదా అంటాడు.

మామగారి భృకుటి ముడిపడుతుంది. ఇంతకూ నువ్వు చేసే పని ఏమిటి అంటారు. కప్పడాల మార్కెటింగ్ అని చెబుతాడు గన్.
అంతే. మామగారు లేచి గన్ మీద గన్ ఎక్కుపెడతారు. పెరుమాళ్లు సాంబారు బకెట్‌ను గన్ మీద కుమ్మరించడానికి సిద్ధమవుతాడు. పనివాళ్లు అతని వైపు దూసుకువస్తారు. గన్ జరిగిందేమిటో అర్థంగాక కన్నుతప్పి చావు లొట్టబోయి బయటపడతాడు.

ఇంతకు సంగతి ఏమిటి? కప్పడాల దెబ్బకు మూతబడ్డ అప్పడాల కంపెనీ ‘గణేష్’ ఈ మామగారిదే.
రచయిత తోలేటి జగన్మోహనరావు 2001లో ఈ కథ రాశారు. మల్టీనేషనల్ కంపెనీలు ఆఖరుకు ఉప్పూ పప్పుల్లో కూడా అడుగుపెట్టి భారతీయ సంప్రదాయ మార్కెట్‌ను ఎలా ధ్వంసం చేయబోతున్నాయో ఈ కథలో వ్యంగ్యంగా, హాస్యంగా ఎత్తి చూపించారు. ఆయన ఊహించినట్టుగానే అలాంటి కంపెనీలు భారత్‌లో అడుగుపెట్టాయి. చినచేపను పెదచేప మింగినట్టుగా చిన్న చిన్న చిల్లరకొట్లను పెద్దపెద్ద మాల్స్ మింగుతున్నాయి.

ఈ కథ చదువుతున్నంత సేపూ నవ్వు వస్తుంది. కాని, ఆఖరున కళ్లు తుడుచుకుంటే కన్నీళ్లు చేతికి తగులుతాయి.
ఈ కథ ఒక హెచ్చరిక. వర్తమాన విషాదం. ఏడవలేక నవ్వడం.

తోలేటి జగన్మోహనరావు : ప్రసిద్ధ తెలుగు కథకుడు. ‘తోలేటి జగన్మోహనరావు కథలు’ పేరుతో సంపుటి వెలువరించారు. ఢిల్లీలో కేంద్ర సర్వీసులలో పని చేసి, రిటైరై, ప్రస్తుతం ఢిల్లీలోనే విశ్రాంత జీవనం గడుపుతున్నారు.

No comments: