Thursday, May 19, 2011

ముచ్చటగొలిపే ముప్పిడి చిత్రాలు

అతనొక ఉపాధ్యాయుడు...సృజనాత్మకత కలిగివున్న సామాజిక చిత్రకారుడు కూడా...మారుమూల కుగ్రామంలో ముదిరాజ్‌ కులంలో జన్మించి పల్లెటూరి జీవన విధానంపై అందమైన చిత్రాలను వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న అద్భుత చిత్రకారుడు అతడు. పేరు ముప్పిడి విఠల్‌. చిన్నతనం నుంచి అతని కళ్లముందు ఉట్టిపడే పల్లెల ప్రకృతి అందాలే ఆయనకు స్ఫూర్తిదాయకమయ్యారు. మెదక్‌ జిల్లాలోని కంగ్డిలోని తడ్కల్‌ గ్రామంలో ఒక నిరుపేద గ్రామంలో జన్మించారు విఠల్‌.

mupidi-pic 

పదవతరగతి వరకు స్వగ్రామంలోనే విద్యనభ్యసించిన విఠల్‌ ఇంటర్మీడియట్‌ నిజామాబాద్‌ జిల్లా బిచ్కుందలో పూర్తిచేశారు. తండ్రి లక్ష్మయ్య, తల్లి నాగమ్మ. నలుగురు సంతానంలో రెండవ సంతానం విఠల్‌. 1995లో సావిత్రితో వివాహం జరిగింది. ముగ్గురు ఆడపిల్లలు. వారిలో ఇద్దరు మంచి ఆర్టిస్టులుగా ఎదుగుతై తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు.

రైతుకుటుంబం నుంచి వచ్చిన విఠల్‌ పేదరికం అనుభవించినప్పటికీ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ సాగారు. వివేకవర్ధిని డిగ్రీకాలేజీలో చదువు సాగిస్తూ ఉదయం పార్ట్‌టైమ్‌ జాబ్‌ కింద పెయింటింగ్స్‌ వేస్తూ తన సొంతకాళ్లమీద నిలబడి ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తిచేశారు. డిగ్రీ సెకండియర్‌ నుంచి ఫైన్‌ ఆర్ట్‌‌సలో మారి (పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ) బి.ఎఫ్‌.ఏ. పూర్తిచేసారు. అనేక ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసి ప్రస్తుతం ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నారు. చిన్ననాటినుంచి ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కృషిచేసి తన కుంచె నుంచి జాలువారిన అపురూప చిత్రాలు అశేష జనాదరణను పొందాయి. నిజానికి విఠల్‌కు స్ఫూర్తిగా నిలచినది కిషన్‌ మహరాజ్‌. ఆయన విఠల్‌ చదివిన హైస్కూల్‌కు హెడ్‌మాస్టర్‌గా ఉండేవారు. చిన్నతనం నుంచి విఠల్‌లో దాగివున్న సృజనాత్మకతను మొట్టమొదటిసారిగా గ్రహించి ఎంతగానో ప్రోత్సహించేవారు. అలాగే పోచాపూర్‌ మెగలప్ప అనే మరో ఉపాధ్యాయుడు విఠల్‌ను ఆర్టిస్టుగా ఎదిగేందుకు పరోక్షంగా ప్రోత్సహించారు. ఒకరకంగా ఈ ఇద్దరు ఉపాధ్యాయ గురువులు తన జీవితానికి మార్గదర్శకులయ్యారు అంటారు విఠల్‌.
గ్రామీణ వాతావరణాన్ని మన కళ్లకు కట్టినట్లుగా చిత్రాలు వేయడంలో ఎంతో దిట్ట విఠల్‌. 1994 సంవత్సరంలో హైదరాబాద్‌లోని జాంబాగ్‌ వద్ద గల వివేకవర్ధిని కళాశాలలో విఠల్‌ వేసిన వివేకానంద చిత్రపటానికి గాను కళాశాల యాజమాన్యం మెచ్చుకోలుగా కళాశాల తరపున బెస్ట్‌ అవార్డును అందజేసింది. 1995లో తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్విహంచిన సౌత్‌ జోన్‌ చిత్రలేఖనం పోటీలలో రజిత పథకాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే 1997లో నిర్వహించిన జన్మభూమి చిత్రలేఖనం పోటీల్లో రాష్టస్థ్రాయిలో మూడవ బహుమతిని అప్పటి లోక్‌సభ స్పీకర్‌ జి.ఎం.సి.బాలయోగి చేతులమీదుగా అందుకున్నారు.
ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం పట్టిపీడిస్తున్న సమస్య. ఇటివంటి కాలుష్యాన్ని నివారించేందుకు తన చిత్రాల ద్వారా నేటి తరం విద్యార్థులలో చైతన్యం కలగజేసేందుకు కృషిచేస్తున్నారు. ఆ దిశగా కృషిచేస్తూ తన పెయింటింగ్‌ ఎగ్జిబిషన్ల ద్వారా అనేక మందికి మార్గదర్శనం చేస్తున్నారు.

mupidi-pic1 

బహుమతులు: 1998 సంవత్సరంలో నిర్వహించిన అంతర్‌ విశ్వవిద్యాలయం చిత్రలేఖనం పోటీలలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దాశరథి రంగాచార్య చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం జరిగింది. అలాగే 2000 సంవత్సరంలో జరిగిన ముదిరాజ్‌ మహాసభల్లో విఠల్‌ వేసిన కార్గిల్‌ వార్‌ చిత్రాలకుగాను బంగారు పతకం లభించింది. అప్పట్లో దేశభక్తిని పెంపొందించే ఆ చిత్రాలతో ఒక పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ కార్యక్రమం జరిపిద్దామనుకున్నారు విఠల్‌. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఆ కార్యక్రమం రూపుదిద్దుకోలేక పోయింది. అన్నీ కలిసొస్తే తొందరలోనే ఆ దేశభక్తిని రూపొందించే పెయింటింగ్స్‌తో ఒక పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ను నిర్వహించాలనేది ఆయన ఆశయం. 2002 డిసెంబర్‌ 31న శబరిమలైలోని దృశ్యాలను చూసి వాటిని కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించినందుకుగాను శ్రీరాం ఇంటీరియర్స్‌ వారు బంగారు ఉంగరంతో ఘనంగా సత్కరించారు. అలాగే తన సొంత ఊరైన తడ్కల్‌లో అప్పటి దొరగారి కోట చిత్రాన్ని వేసి పోటీలకు పంపించారు విఠల్‌. ఈ చిత్రం రాష్టస్థ్రాయిలోనే చిత్రకళా ప్రదర్శనకు ఎంపికయింది. తన సొంత ఊరిలోని కోటను తన చేత్తో గీసుకుని ఎంతో తృప్తిని పొందానంటారు ఆయన.

mupidi-pic2 

ఆశయం: కాంటెంపరరీ ఆర్టిస్టుగా ఎదగాలని ఆకాంక్ష. ఇతర దేశాలలో కూడా మన దేశ ప్రతిష్ట ఇనుమడింపజేసేలా ఉండాలని నా ఆశయం. మారుమూల పల్లె వాతావరణం ప్రపంచవ్యాప్తం కావాలని...అన్ని దేశాలలో కూడా ప్రత్యేకించి మన పల్లెవాతావరణం ఇనుమడింపజేయాలనేదే తన ఆశయం అంటారు విఠల్‌.

పిల్లలకు అవగాహన: చిన్నారుల్లో దాగివున్న సృజనాత్మకత శక్తిని వెలికితీస్తూ ...వారిని చిత్రకారులుగా తీర్చిదిద్దుతూ చిత్రలేఖనంలో వారికి ప్రోత్సాహం అందించేందుకుగాను 1999లో హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌లో ముప్పిడి ఆర్ట్‌‌స గ్యాలరీని విఠల్‌ ప్రారంభించారు. ప్రతిసంవత్సరం వేసవికాలంలో చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ఆయన. తను పుట్టిపెరిగిన ప్రాంతపు పల్లె పొలాల స్థితిగతులే తన చిత్రాలకు ప్రేరణలంటారు విఠల్‌. అక్కడి ఎండిపోయిన చెరువులు, బీడులువారిన భూములు, ఎండిపోయిన పిల్లకాలవలు, పల్లె ప్రాంతంలో జనజీవన స్థితిగతులు...తన సొంత పొలం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలలో చూసిన దృశ్యాలనే తన పెయింటింగ్స్‌కు స్ఫూర్తిదాయకంగా పనికొచ్చాయంటారు విఠల్‌. నేటి తరం విద్యార్థులు కూడా పల్లె ప్రాంతాలను అలక్ష్యం చేయకుండా...పూర్తిగా సిటీ జీవనానికే అలవాటుపడకుండా అక్కడి ప్రాంతాలను కూడా సందర్శించాలంటారు విఠల్‌. అలాగే నేడు ప్రతి పాఠశాలలోనూ ఒక చిత్రలేఖనం నేర్పించే ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలంటారు విఠల్‌. పిల్లలకు కేవలం చదువు ఒక్కటే పరమావధికాదని...చదువుతో పాటు ఇలా ఏదో ఒక కళమీద వ్యాపకం చాలా మంచిదని...ప్రస్తుత విద్యావిధానంలో అది లోపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు విఠల్‌. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు చిత్రకారులుగా మలిచే ఉపాధ్యాయులను నియమించాలంటారు. అలాగే తన సొంత మండలంలో ఒక వృద్ధ ఆశ్రమాన్ని నెలకొల్పాలనేది ఆయన ఆశయం అంటారు.

-నండూరి రవిశంకర్‌

No comments: