Wednesday, November 23, 2011

ఉలి వాడని '' శిల్పి ''

‘నాలుగు రాళ్లు’ వెనకేసుకోవడం అంటే ఆస్తి కూడబెట్టడం అనుకుంటాం మనం...‘నాలుగు రాళ్లు’ పోగేసుకోవడం అంటే అందమైన బొమ్మలను తీర్చిదిద్దడం అనుకుంటుంది ఆమె... ఉలితో చెక్కకుండానే రకరకాల రాళ్లు ఆమె చేతిలో ఒద్దికగా ఒదిగి రూపుకడతాయి.. రతనాల కన్నా రాళ్లనే మిన్నగా భావించే ఆమె పేరు సుజాత. ఉలి వాడని శిల్పిగా ఆమె పరిచయం ..


‘నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకుబెళుకు రాళ్లు తట్టెడేల?’ అంటే.. తళుకు బెళుకులు లేకపోయినా ఫర్వాలేదు రాయి అయితే చాలు అంటారు సుజాత. ఇల్లు కట్టడానికా! పొయ్యి వెయ్యడానికా..? అనే సందేహంతో ఎవరైనా చూస్తే ‘షోకేసుల్లో పెట్టడానికి’ అనే సమాధానం వస్తుంది ఆమె నుంచి. అవును, సుజాత రాళ్లతో బొమ్మలను చేస్తుంది. అదీ ఉలితో చెక్కకుండా. ఉలి లేని శిల్పిగా సుజాతకు, ఆమె చేతిలో రూపు కట్టిన బొమ్మలకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ వివరాలు కావాలంటే సికింద్రాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్న ఆమె నివాసానికి వెళ్లాలి.

అపురూపం.. ఆ బొమ్మ
ముప్పై అయిదేళ్ల సుజాత చదువుకున్నది టెన్త్ క్లాసే. 2, 5 తరగతులు చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గుండెపోటు వచ్చి ఏపనీ చేయలేని భర్త. ఒకటే అనిపించే రెండు గదుల అద్దె ఇంట్లో నివాసం. ఇదీ సుజాత సామ్రాజ్యం. అందులో ఆమెకున్న ఆస్తిపాస్తులు మాత్రం ఏడాదిగా పోగేసుకున్న వందలకొద్దీ రాళ్లు. సమయం చిక్కితే ఆ రాళ్లను ముందేసుకొని వాటికి బ్రష్‌తో రంగులేస్తూ, ఏ రాయి ఇంకో రాయికి అతికించవచ్చో చూసుకుంటూ ఉంటుంది. కోరుకున్నరూపం వచ్చాక తనకు తాను మురిసిపోతుంది.

తర్వాత కూతుళ్లను పిలిచి తన చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మను చూపించి సంబరపడిపోతుంది. ఆ రాతిబొమ్మను అపురూపంగా తీసుకెళ్లి షెల్ఫ్‌లాంటి చెక్కలపైన నిలబెడుతుంది. రాయి మీద రాయిని పేర్చి బొమ్మలుగా మలుస్తున్న ఈ కళ సుజాతను కోరి కోరి ఎలా వరించిందో తెలపమంటే కళ్లింతలు చేసుకుంటుంది.‘‘ఏడాదిక్రితం మా ఇంటి పక్కన ఇల్లు కడుతున్నారు. లారీల కొద్ది ఇసుక తెచ్చి పోశారు. ఓ రోజు చుట్టుపక్కల ఆడవాళ్లం ఆ ఇసుకలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. చేతులు ఊరుకోవు కదా! ఇసుకలో అటూ ఇటూ కదుపుతుంటే చేతికి గోధుమ వర్ణంలో ఉన్న ఓ రాయి దొరికింది.


ఆ రాయిని ఎందుకో అక్కడ వదిలేయాలనిపించలేదు. ఇంటికి తెచ్చి షెల్ఫ్‌లో పెట్టాను. రోజూ ఆ రాయిని చూస్తుండేదాన్ని. ఆ రాయితో ఏదో తెలియని అనుబంధం. ఏదో మనసును తట్టే బొమ్మ.. చూడగా చూడగా గణేషుని బొమ్మలా అనిపించింది. బయటకు వెళ్లినప్పుడు ఎమ్‌సీల్(రకరకాల వస్తువులు అతికించడానికి వాడేది), పెయింట్, బ్రష్ కొనుక్కొచ్చాను. తొండం, చెవులు, కిరీటంగా మళ్ళీ రాళ్లు వెతికి తెచ్చి అతికించాను. చూడముచ్చటనైన గణేషుని రూపం. పార్వతీదేవి నలుగుపిండితో గణేషుని తయారుచేసుకుంటే, నేను రాయితో చేశాను అన్న ఆలోచన రాగానే ఉద్వేగంతో కళ్లలో నీరు పొంగింది. ఆ బొమ్మను దేవుని మందిరంలో పెట్టాను.’’ అంటూ తన తొలికళ విఘ్నరాజుతో నిర్విఘ్నంగా వంటపట్టిందని ఆనందంగా చెబుతుంది సుజాత.



రోడ్డుపాలు...
‘ఈ బొమ్మల్ని ఇంట్లో ఉంచితే ఎవరికి తెలుస్తుంది. ఎక్కడైనా ఎగ్జిబిషన్‌గా పెట్టు’ అన్న వాళ్ల మాటలు పట్టుకొని ఉస్మానియా క్యాంపస్ ఆవరణలో టేబుల్ వేసుకొని దాని మీద రాతి బొమ్మల కొలువు పెట్టింది సుజాత. వచ్చి చూసిన వాళ్లు ‘ఔరా’ అని ఆశ్చర్యపోవడమే తప్ప వాటికి ఎక్కడ గుర్తింపు వస్తుందో చెప్పేవాళ్లే లేరని ఆవేదన వ్యక్తం చేసింది. హస్తకళల వారిని కలిసి తన బొమ్మలను చూపించింది. బొమ్మలు బాగున్నాయని అన్నవారే తప్ప, ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వలేదు. సభ్యత్వం తీసుకోవాలన్నారు.

అందుకు డబ్బులు కట్టాలన్నారు. ఎక్కడ తీసుకోవాలో, ఎవరిని అడగాలో, ఎంత డబ్బు కట్టాలో తెలియదు. తనకు తెలిసిన ఈ కళ ఇక్కడే మరుగునపడిపోతుందేమో అనేదే సుజాత బాధ. రాతిబొమ్మలకు పేరు తేలేకపోవడం తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడమే కారణమంటుంది. ‘‘అక్క దగ్గర నేర్చుకున్న బ్యుటీషియన్ పనే ఇప్పుడు నా కుటుంబానికి ఆదరవు. తెలిసినవారు కోరితే వారి ఇళ్లకే వెళ్లి బ్యుటీషియన్ పనులు చేసి వస్తాను.


ఇంట్లో నలుగురి కంచంలోకి నాలుగు మద్దలు రావాలంటే ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్లాలి కదా’’ అనే సుజాతకు ఈ బొమ్మల వల్ల ఉపయోగమేంటో తెలియదు. రేపటి తరానికి వాటి ద్వారా ఏం అందించవచ్చో తెలియదు. ఇలాంటి కళకు దేశ విదేశాలలో ఎక్కడెక్కడ, ఎలాంటి పేరుందో! తెలియదు. అందుకే మూలన పడేయడంతో విరిగిన బొమ్మలు, కావాలని అడిగిన వారికి ఇచ్చేసిన బొమ్మలు, పిల్లలు ఆడుతూ ఆడుతూ రోడ్డు మీద వదిలేసి వచ్చిన బొమ్మలు, ప్రాణం చివుక్కుమన్నా స్థలం సరిపోక వద్దనుకున్న బొమ్మలు ఎన్నో... కాని రాయి కనపడితే చాలు అది ఏ బొమ్మగా రూపుకట్టవచ్చో ఆలోచన చేస్తుంది. దానిని అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్ది బొమ్మను చేస్తుంది. ఈ ఉలి చెక్కని బొమ్మల విలువ తెలిసినవారెవరైనా వాటికో స్థానం క లిపిస్తే చాలనుకుంటుంది సుజాత.


కళలు తెలిసిన వారు అరుదు. తమకు తాముగా నేర్చుకుని కళకు ప్రాణం పోసే వారు మరీ అరుదు. స్వతహాగా అబ్బిన ఈ కళ సుజాత జీవితాన్ని సుసంపన్నం చేస్తుందని ఆశిద్దాం.


ఒకటికి ఒకటి...
‘‘బయట ఏదైనా రాయి కనిపిస్తే చాలు, దానికి సరిపోయే రాయి నా దగ్గర ఏది ఉంది? అని చెక్ చేసుకుంటాను. కొన్ని రాళ్లు పక్షుల రెక్కల్లా ఉంటే కొన్ని తలల్లా, మనుషుల చేతుల్లా.. ఏదో ఒక అవయవ రూపంలో కనిపిస్తాయి. ఒకటి దొరికనప్పుడు దానికి అనువైన మరో రాయి దొరికే దాకా ఎదురుచూడక తప్పదు’’ అంటూ రాతిబొమ్మల రూపకల్పనలో పట్టే సమయాన్ని వివరిస్తుంది ఆమె. తిమింగలం, నెమలి, చేప, కప్ప, ఎలుక, జూజూ, గుర్రం, కుక్క, జోకర్, ఏలియన్ మాస్క్, మర్రిచెట్టు, శివలింగం, రామచిలుకలు, వృద్ధుడు, రాకాసి, ... చెప్పుకుంటే పోతే వందల కొద్ది బొమ్మలు సుజాత చేతిలో రూపుకట్టి మనల్ని అబ్బురపరుస్తాయి.

- నిర్మలారెడ్డి
ఫొటోలు: అమరశ్రీనివాసరావు. వి

No comments: