పాటల పొదరిల్లు


"సమాజం కూడా నిస్తేజంగా మారిపోయినట్టనిపించింది. సంగీత సాంస్కృతిక అంశాలనెవరూ పట్టించుకునేవారే లేకపోయారు. సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకున్నవారే కాదు, హాయిగా గొంతెత్తి చక్కగా ఏ పాట పాడగలిగేవారికైనా శ్రోతలు లేకుండా పోయారు. మీరు గమనిస్తే ఆ స్థితి దాదాపు ఇరవయ్యేళ్లు కొనసాగింది. తర్వాత ప్రైవేటు ఛానెళ్లు పాటల కార్యక్రమాలు పెట్టడం, అవి నెమ్మదిగా ఊపందుకుని సీరియళ్లను మించి ప్రేక్షకాదరణ పొందడం మొదలయ్యాక మళ్లీ సంగీత రంగంలో కదలిక వచ్చింది..''

అలా ఇక్కడి జానపదం నాకు తొలిగా చిన్నవయసులోనే పరిచయమైంది. వదినామరదళ్ల హాస్యాలు, బతుకమ్మ పాటలు మా అమ్మ గిడుగు సీత బాగా పాడేది. మద్రాసులో ఉండగా సినిమాల్లోనూ నటించింది. ఇంట్లో ఎప్పుడూ ఆమె నోటిలో పాటలు నానుతూ ఉండేవి. దాంతో నాకూ అదే అలవాటయింది. తర్వాత నేను గాత్రమూ వీణా నేర్చుకోవడానికి గురువుల దగ్గర చేరాను. అదిగాక చిన్నప్పటి నుంచే నాన్న పాటలకు రాగాలు కడుతూ, వాటిని పాడటమూ ఒక సరదాగా ఉండేది. ముఖ్యంగా మా పనమ్మాయి ఊర్మిళ. నన్ను తీసుకుని ఒగ్గు కథలకూ బతుకమ్మ ఆటలకూ తీసుకెళ్లేది...'' అంటూ తన సంగీత నేపథ్యాన్ని చెప్పుకొచ్చారు స్నేహలత.
బతుకమ్మ బతకాలి...
ఊర్మిళ పల్లెపడుచే కావొచ్చు. ఆమె నింపిన స్ఫూర్తి స్నేహలతలో అణువణువునా నిండిపోయింది. రంగురంగుల బతుకమ్మ, రకరకాల పాటలు ఆమెను ఆకర్షించాయి. దాంతోనే బతుకమ్మ పాటల సేకరించి, వాటి నేపథ్యాలనూ తెలుసుకున్నారు. అయితే వాటిని జనంలోకి తీసుకెళ్లడం పెద్ద సమస్య అయి కూచుంది. "టీవీలో, రేడియోలో ఎక్కడయినా బతుకమ్మ పాటలు పాడదామంటే ఎవరూ కలిసొచ్చేవాళ్లు కాదు. వాటిని పాడటం ఏమిటని ఆశ్చర్యపోయేవారు.
ఒకావిడయితే రికార్డింగ్ వరకూ వచ్చాక 'ఇలాంటి పాటలు మా ఆయన పాడొద్దన్నారండీ' అనేసి వెళ్లిపోయింది. ఇప్పటికీ కొందరిలో అలాంటి భావన ఉన్నా నెమ్మదిగా మార్పు వస్తుంది. బతుకమ్మ బతుకు కోరే తల్లి. ప్రకృతిలో పుట్టి మనల్ని నడిపించి పకృతిలో లీనమయ్యే శక్తి. బతుకమ్మ ఆటలో పేదాగొప్పా పిల్లా ముసలీ తేడాలేం లేవు. కులమతాల పట్టింపు లేదు. అంత గొప్ప సంస్కృతిని ఒంటపట్టించుకుని అందరికీ తెలియజెప్పాలనేదే నా లక్ష్యం. అందువల్లే డీడీ రోజుల నుంచీ నేను బతుకమ్మ పాటల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను...'' అని చెప్పుకొచ్చారు స్నేహలత.
ఒక్క స్వరమూ వినిపించలేదు...
"ఒక దశలో దూరదర్శన్ ప్రాభవం వెనుకబట్టింది. కొత్తగా వచ్చిన ఛానెళ్లు - అయితే వార్తలకూ లేదంటే సీరియళ్లకూ పెద్దపీట వేశాయి కళారూపాలకూ సంగీత కార్యక్రమాలకూ చోటు కల్పించలేదు. అప్పుడు సమాజం కూడా నిస్తేజంగా మారిపోయినట్టనిపించింది. సంగీత సాంస్కృతిక అంశాలనెవరూ పట్టించుకునేవారే లేకపోయారు. సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకున్నవారే కాదు, హాయిగా గొంతెత్తి చక్కగా ఏ పాట పాడగలిగేవారికైనా శ్రోతలు లేకుండా పోయారు. తమ విద్యను ప్రదర్శించడానికి వేదికలే ఉండేవి కాదు. మీరు గమనిస్తే ఆ స్థితి దాదాపు ఇరవయ్యేళ్లు కొనసాగింది. తర్వాత ప్రైవేటు ఛానెళ్లు పాటల కార్యక్రమాలు పెట్టడం, అవి నెమ్మదిగా ఊపందుకుని సీరియళ్లను మించి ప్రేక్షకాదరణ పొందడం మొదలయ్యాక మళ్లీ సంగీత రంగంలో ఒక కదలిక వచ్చింది...'' అంటూ విశ్లేషించారు స్నేహలత. వసంతం వచ్చేవరకూ కోయిల గొంతు వినిపించదు.
ఎక్కడో దాక్కుని నిశ్శబ్దంగా సాధన చేస్తుంది. స్నేహలత కూడా ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. కొన్నేళ్లపాటు కుటుంబానికే పూర్తి సమయం కేటాయించారు. "అలాగని ఖాళీగా ఉన్నాననుకుంటే పొరపాటే. పాటలకు రాగాలు కట్టడం, నాలో నేనే పాడుకోవడం. మా అమ్మాయి మాధవీలతకు నేర్పించడం. ఇదిగాక ఏ శుభకార్యాలు జరిగినా, బంధుమిత్రులను కలిసినా వాళ్లకు తెలిసిన పాటలను రాసుకునేదాన్ని. వారెలా పాడతారో గమనించి అవసరమైతే మార్పుచేర్పులు చేసుకునేదాన్ని. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏయే సందర్భాల్లో ఏమేం పాడతారో తెలుసుకున్నాను. ఒకేపాటను మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా పాడేవీ ఉన్నాయి. ఆ తేడాలను తెలుసుకున్నాను. ఇదంతా వ్యక్తిగత తృప్తి, అధ్యయనాల కోసం చేసినవే...'' అన్న స్నేహలత ఆ కాలంలో మూడొందలకు పైగా పాటలు సేకరించారు.
సంగీత బృందం
ఆవిడ అనుకోలేదుగానీ, తర్వాత కాలం మారింది. సంప్రదాయం, జానపదం, ఆధ్యాత్మికం... ఏదైనాసరే, పాడేవారికి మంచి రోజులొచ్చాయి. టీవీ ఛానెళ్లే కాదు, ప్రైవేటు కార్యక్రమాల్లోనూ పాటకే పెద్ద పీట వేస్తున్నారు. నేటి ఈ ధోరణిని అందిపుచ్చుకుని స్నేహలత తనకో బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సందర్భానుసారం బతుకమ్మ పాటలను వ్యాప్తిచేస్తున్నారు. శుభకార్యాల్లో ప్రదర్శనలివ్వడం ప్రారంభించారు. "ఇప్పుడు 'సంగీత్' అని పెళ్లి వేడుకలకు రెండు రోజుల ముందే మొదలవుతున్నాయి. సినిమా పాటల ఆర్కెస్ట్రా, డీజేలకు బదులు కొందరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అసలు మన పెళ్లిళ్లలో ఎన్ని పాటలో. ముహూర్తం పెట్టి పసుపు దంచింది మొదలు, నలుగు పాట, విడిది పాట, వియ్యపురాలి పాట, భోజనం బంతి పాట, పూలచెండ్ల పాట, అప్పగింతల పాట... ప్రతి సందర్భానికీ పాటలేపాటలు...'' అంటున్న స్నేహలత తన కార్యక్రమంలో కేవలం వాటిని పాడేసి ఊరుకోరు.
పాటల సమయసందర్భాలను, వాటిలోని సాహిత్యాన్నీ అందాన్నీ పరిచయం చే స్తూ జనరంజకంగా సాగుతుందామె కార్యక్రమం. "మొదట్లో పెద్దలే ఎక్కువగా ఆనందించేవారు. యువత రాన్ని ఆకట్టుకోకపోతే ఈ పాటలు భవిష్యత్ తరాలకు ప్రవహించవని అర్థమయింది. అందువల్ల పెళ్ళిళ్లకు వెళ్లినప్పుడు వాళ్లతో మాట కలుపుతాను. పాటలకు అనుగుణంగా అప్పటికప్పుడు వాళ్లతో చిందేయిస్తాన''ని చెబుతున్న స్నేహలత తానూ పాదం కలిపి పదం పాడతారు. మామూలుగా ఈ కార్యక్రమం పెళ్లివారందరూ కొత్తాపాతా తేడా లేకుండా కలిసిపోవడానికి, యంగ్ తరంగాలకు జోష్‌నందించడానికే అయినా దానికి మించిన గొప్ప ప్రయోజనాన్ని సాధిస్తున్నారామె. ఏదైనా విజయవంతమయిందనడానికి సూచిక దానికి అనుకరణలు రావడమే. ఇప్పుడు స్నేహలతలాగే 'పెళ్లి పాటలు పాడతాం' అంటూ మరో పాతిక బృందాలు తయారయ్యాయంటే ఆమె ప్రయోగం విజయవంతమైనట్టే. "నేనా మరొకరా అని కాదు. పాటలు పదిమందికి చేరాయా లేదా అన్నదే ముఖ్యం. అలా ఆలోచించినప్పుడు ఈ పాతిక బృందాలూ నాకు పోటీ అనిపించవు...' అని హుందాగా చెబుతున్న ఆమె తీరు గొప్పగా అనిపిస్తుంది.
No comments:
Post a Comment